నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు
ABN, First Publish Date - 2020-03-16T07:26:16+05:30
జాతీయ ఉపాఽధి హామీ పథకంలో 40 శాతం పని కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 4779 తీసుకువచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది.
సమ్మెలో ఫీల్డ్ అసిస్టెంట్లు
జిల్లాలో 215 మంది సిబ్బంది
నాలుగు రోజులుగా ఆందోళనలోనే
సమస్యలను పరిష్కరించే వరకూ విరమించే ప్రసక్తే లేదు
ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్
సంగారెడ్డి రూరల్. మార్చి 15: జాతీయ ఉపాఽధి హామీ పథకంలో 40 శాతం పని కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 4779 తీసుకువచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. దీంతో ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కారమయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని భీష్మించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో 215మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గల ఎంపీడీవో కార్యాలయాల ముందు ఈ నెల 12 నుంచి సమ్మె చేపట్టారు. దీంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ప్రారంభం కాకుండా నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రభుత్వానికి ప్రశంసలు వచ్చే విధంగా పని చేసినందుకు తమకు బహుమతిగా జీవో 4779 తీసుకువచ్చి విధుల్లో నుంచి తొలగిస్తారా అని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తున్నదని అంటున్నారు.
ప్రభుత్వ చర్యలే కారణం
జాతీయ ఉపాధి హామీ పథకంలో 40 శాతం పనులు కల్పించకపోవడానికి ప్రభుత్వమే కారణమని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. పనికి వెళ్లలేని రైతులకు, ఐహెచ్‌హెచ్‌ఎల్, ఎస్‌బీఎం లబ్ధిదారులకు జాబ్ కార్డులు ఇవ్వడం, సోక్‌పేట్ నిర్మించుకునే వారికి జాబ్ కార్డులివ్వడం, సరైన సమయంలో వేతనాలు రాకపోవడం, వేసవిలో నేల గట్టిగా ఉన్న సమయంలో ఫాం ఫాండ్స్ పనిచేయించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని వారు అంటున్నారు. పొరపాటున ఎక్కడైనా పనులు కల్పించకపోతే తమపై చర్యలు తీసుకోవడం సరికాదంటున్నారు. గత మూడు రోజులుగా సమ్మె చేపట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేస్తున్నారు.
ముందుకు రాని పంచాయతీ కార్యదర్శులు
ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకోవాలని, వారి స్థానాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియమించి వారితో ఉపాఽధి హామీ పనులు చేయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఇప్పటికే తమపై పనిభారం పెరిగిందని తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ల పనులను చేయడం కష్టతరమవుతుందని కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అధికారులకు తేల్చి చెప్పారు. మరో పక్క తమ పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేస్తే సహించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఉపాధి పనులు చేసేందుకు కార్యదర్శులు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. సోమవారంనాటికి పనులు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
విధేయతకు బహుమతి ఇదేనా - ఎస్. ప్రభాకర్, ఎఫ్‌ఏ కొత్లాపూర్
మేము ఎంతో విధేయతతో పని చేసుకుంటూ పోయినందుకు ప్రభుత్వం మాకు ఇచ్చే బహుమతి ఇదేనా? కూలీలతో కలిసి ఎండ, వానలను లెక్కచేయకుండా చెరువులు, పొదల్లో తిరుగుతున్నాం. మాపై ప్రభుత్వం కనికరించాలి.
సమ్మె విరమించే ప్రసక్తే లేదు - శ్రీనివాస్, ఎఫ్‌ఏ కలివెముల
మాకు న్యాయం జరిగేంత వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదు. చాలీ చాలని వేతనాలతో గత 14 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీస వేతనాలు చెల్లించి ఈఎ్‌సఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.
కక్షసాధింపు చర్యలు తగవు- సాయిలు, సీఐటీయూ జిల్లా కోశాధికారి
క్షేత్రస్థాయిలో పనులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశంసలు అందేలా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పై కక్ష సాధించపు చర్యలు తీసుకోవడం సరైంది కాదు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
Updated Date - 2020-03-16T07:26:16+05:30 IST