ఖజానాకు కొవిడ్ గండి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.కోట్లలో నష్టం
ABN, First Publish Date - 2020-12-30T05:49:58+05:30
ఆంధ్రజ్యోతి ప్రతినిధి- సంగారెడ్డి : ఉమ్మడిమెదక్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండిపడింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.కోట్లలో నష్టపోయిన ప్రభుత్వం
రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖలు డీలా
మద్యం ధరల పెరుగుదలతో ఆబ్కారీకి ఊరట
మరో మూణ్ణెళ్లలో లక్ష్యసాధనకు అధికారుల కసరత్తు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి- సంగారెడ్డి : ఉమ్మడిమెదక్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండిపడింది. ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. మన జిల్లాలోనూ తీవ్ర ప్రభావమే చూపింది. ఆర్టీసీని దాదాపు కుదేలు చేసింది. ప్రభుత్వానికి ప్రఽధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ర్టేషన్ల శాఖ అటు కరోనాతో, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయంతో మూడో వంతును దాటి ఆర్జించలేకపోయింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ మద్యానికి దూరంగా ఉండి ఆదాయం కోల్పోయిన ఆబ్కారీ.. ఆ తర్వాత ధరల పెరుగుదలతో ఊరట పొందింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన రవాణా వ్యవస్థ అయిన టీఎ్‌సఆర్టీసీ.. కొవిడ్ ఎఫెక్ట్‌తో దాదాపు రూ.44.20 కోట్లు నష్టపోయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది డిపోల ద్వారా 680 బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. రోజుకు సగటున 2.39 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల 55 రోజుల పాటు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఆర్టీసీకి రూ.44.20 కోట్లు నష్టం వాటిల్లింది. ఇక 2019-20లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆర్టీసీకి రూ.244.69 కోట్లు ఆదాయం రాగా, ఈ యేడు ఆర్థిక సంవత్సరంలో గత నవంబరు నెలాఖరు వరకు రూ.67.85 కోట్ల ఆదాయమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మార్చి వరకు గడువుంది. ఈ మూడు నెలల్లో వచ్చే ఆదాయం గతేడాది సంపాదనకు సరిసమానం అయ్యే అవకాశం లేదు. 55 రోజుల లాక్‌డౌన్ విరామం అనంతరం ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా ప్రజలు బస్సు ఎక్కేందుకు ముందుకు రాకపోవడమే ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది.
రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా
రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జోరుగానే సాగుతాయి. ఉమ్మడి జిల్లాలోని 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.587.79 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటి వరకు రూ.134.63 కోట్లు మాత్రమే వచ్చింది.
కరోనా ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 56,627 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా ఖజానాకు చేరిన ఆదాయం రూ.119.62 కోట్లు. ఇక రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖల్లో ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం గత సెప్టెంబరు 8 నుంచి డిసెంబరు 8 వరకు రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మూడు నెలల కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.16వేల ఆదాయం వచ్చింది. ఈ మొత్తం కూడా వీలునామాలు, వివాహ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.
డిసెంబరు 8 నుంచి వ్యవసాయ భూములు, 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్లు మొదలయ్యాయి. ఆయా తేదీల నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,179 ఆస్తుల రిజిస్ర్టేషన్లు పూర్తయి రూ.15.01 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తమ్మీద ఇప్పటి వరకు రూ.134.63 కోట్ల ఆదాయమే ఖజానాకు చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మిగిలిన మూడు నెలల్లో మరో రూ.100 కోట్లకు మించి రాకపోవచ్చని అధికారుల అంచనా. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ శాఖకు వచ్చిన నష్టం సుమా రుగా రూ.350 కోట్లు.
ఒక జిల్లాలో నష్టం.. రెండు జిల్లాలో లాభం
ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చే ఎక్సైజ్‌శాఖకు సంగారెడ్డి జిల్లా నుంచి సుమారు రూ.37.67 కోట్ల నష్టం కలిగిందని చెప్పవచ్చు. 2019 జనవరి నుంచి డిసెంబరు వరకు సంగారెడ్డి జిల్లాలో 18.89 లక్షల బీరు పెట్టెలు, 1.40 లక్షల ఐఎంఎల్ పెట్టెల విక్రయాలతో జిల్లా ఖజానాకు రూ.824.03 కోట్లు వచ్చింది. ఈ ఏడాది.. అంటే. 2020 జనవరి నుంచి డిసెంబరులో ఈ రోజు వరకు జరిపిన లావాదేవీలను చూస్తే.. 10.21 లక్షల బీరు కేసులు, 12.80 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడయ్యాయి. దీంతో వచ్చిన ఆదాయం రూ.786.36 కోట్లు. అంటే సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆబ్కారీ విభాగానికి వచ్చిన నష్టం రూ.38.67 కోట్లు.
ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే.. 45 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడినా ఆదాయం మాత్రం తగ్గలేదు. 20 శాతం ధరల పెరుగుదలతో నష్టం భర్తీ అయింది. జిల్లాలో 3.04 లక్షల బాక్స్‌ల మేర ఐఎంఎల్, 2.40 లక్షల వరకు బీరు కేసులు అమ్ముడయ్యాయి. జిల్లాలో మద్యం అమ్మకాల విలువ రూ.200 కోట్లుగా అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ.250 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. మద్యం ధరల పెంపు ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఇక సిద్దిపేట జిల్లాలోనూ మంచి ఆదాయమే వచ్చింది. గతేడాది జిల్లాలో రూ.662 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.762 కోట్లు వచ్చింది. లాక్‌డౌన్ కాలాన్ని మినహాయిస్తే.. మిగతా సమయంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 9.19 లక్షల పెట్టెల లిక్కర్, 10.08 లక్షల పెట్టెల బీర్లు ఈ జిల్లాలో అమ్ముడుపోయాయి. దీని వల్ల రూ.100 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
రవాణాశాఖకు అంతంతే
రవాణాశాఖ ద్వారా సంగారెడ్డి జిల్లా నుంచి సర్కారు ఖజానాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.80 కోట్ల ఆదాయమే వచ్చింది. 2019-20లో 40,391 వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.147.00 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 36,583 వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగి రూ.80.00 కోట్ల రాబడి వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు ఉన్నా మూడు నెలల్లో మరో రూ.30.00 కోట్ల వరకు మాత్రమే రావొచ్చని అధికారవర్గాల అంచనా. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది సుమారు రూ.37.00 కోట్ల వరకు నష్టం రావచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి. మెదక్ జిల్లాలో రవాణా విభాగానికి గతేడాది రూ.28.54 లక్షలు వసూలు కాగా.. 2020లో రూ.27.62 లక్షలు వచ్చాయి. వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రవాణా నిబంధనలు ఉల్లంఘన కేసుల నమోదు ద్వారా ఈ మొత్తం వసూలైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఈ శాఖలో సమకూరిన ఆదాయంలో పెద్దగా తేడా లేదు. మార్చిలో బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరగడమే ఇందుకు కారణం. ఇక సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే.. 2019లో రూ.42 కోట్ల ఆదాయం రాగా 2020లో ఇప్పటి వరకు సుమారుగా రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ రవాణా శాఖ ఆదాయం గతేడాది మార్క్‌ను చేరుకోవడం సందేహమే.
Updated Date - 2020-12-30T05:49:58+05:30 IST