ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రాక 10న

ABN, First Publish Date - 2020-12-06T05:26:27+05:30

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట పర్యటన ఖరారైంది. ఈనెల 10వ తేదీన ఆయన జిల్లాకు రానున్నారు.

రంగనాయకసాగర్‌ గెస్ట్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేటలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

మెడికల్‌ కాలేజీ భవనాలు, టీఆర్‌ఎస్‌ భవన్‌, రంగనాయకసాగర్‌ గెస్ట్‌హౌజ్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి ప్రారంభోత్సవం

అదే రోజు డబుల్‌ బెడ్రూం గృహ ప్రవేశాలు

కోమటిచెరువు సందర్శన

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

కలెక్టర్‌, సీపీ, జిల్లా అధికారులతో సమీక్ష


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 5 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట పర్యటన ఖరారైంది. ఈనెల 10వ తేదీన ఆయన జిల్లాకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిద్దిపేటలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. చివరగా బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు.

2016 అక్టోబరు 11వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. మరుసటి ఏడాది మళ్లీ అక్టోబరు నెలలోనే ఇక్కడకు వచ్చి నూతన కలెక్టరేట్‌, సీపీ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో, చింతమడక విషయంలో ఇక్కడకు వచ్చారు. అయితే పాలనాపరంగా మరోసారి కేసీఆర్‌ సిద్దిపేటలో అడుగుపెట్టనున్నారు. 


ప్రారంభోత్సవాలకు సిద్ధంగా..

 పొన్నాల గ్రామ శివారులో నిర్మాణమైన జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌ పూర్తయ్యింది. ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాలను పూర్తి చేశారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ గుట్టపై అత్యద్భుతంగా గెస్ట్‌హౌజ్‌ను నిర్మించారు. అంతేగాకుండా సిద్దిపేట పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మిస్తున్నారు. మురికినీటి శుద్ది కేంద్రాల నిర్మాణం పూర్తి చేశారు. వీటన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మిట్టపల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదిక, సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియాలను ప్రారంభిస్తారు.  


కోమటిచెరువు సందర్శనకు

పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. ఒకనాడు పిచ్చిమొక్కలు, తుమ్మచెట్లతో వెక్కిరించిన ఈ కోమటిచెరువు నేడు సుందర ప్రదేశంగా కీర్తి గడిస్తున్నది. సిద్దిపేట జిల్లా వాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటక ప్రేమికులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతున్నది. తాజాగా ఇక్కడ నెక్లెస్‌ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్‌ కోమటిచెరువునూ సందర్శించనున్నారు. కాసేపు ఇక్కడే గడిపేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. 


బహిరంగ సభకు ఏర్పాట్లు

సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ప్రసంగిస్తారు. దీనికి సిద్దిపేట పట్టణంతోపాటు నియోజకవర్గానికి చెందిన ప్రజలను సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌ డేవి్‌సలు కళాశాల మైదానాన్ని పరిశీలించారు. పార్కింగ్‌, ఇతర ఏర్పాట్ల గురించి కలియ తిరిగారు. 


‘డబుల్‌’ ఇళ్ల ప్రారంభం

సిద్దిపేట పట్టణంలో నివసిస్తున్న నిరుపేదలు, ఇళ్లు లేని అర్హుల కోసం నర్సాపూర్‌ శివారులో 2,460 డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. వీటిని పంపిణీ చేయడానికి దరఖాస్తులు కోరగా 11 వేల మందికి పైచిలుకు సమర్పించారు. పూర్తిస్థాయిలో నెలరోజులపాటు విచారణ జరిపి 1,360 మంది అర్హులను ఎంపిక చేశారు. ఇటీవలే వీరికి ఇళ్లను కూడా కేటాయించారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా వీటిని ప్రారంభించి గృహ ప్రవేశాలు చేయిస్తారు. ఇక్కడ భారీ పైలాన్‌ను కూడా నిర్మిస్తున్నారు. 


సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను  విజయవంతం చేసేలా మంత్రి హరీశ్‌రావు ప్రణాళిక రచించారు. శనివారం తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకొని కేవలం సీఎం పర్యటన విజయవంతంపై ఫోకస్‌ పెట్టారు. ఉదయం నుండి రాత్రిదాకా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవి్‌సలతో కలిసి కేసీఆర్‌ పర్యటించే ప్రదేశాలన్నీ తిరిగారు. అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించి ఆయా కార్యక్రమాల బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించారు.  


కొత్త కలెక్టరేట్‌, సీపీ ఆఫీస్‌ ప్రారంభాలు లేనట్లే !

దుద్దెడ గ్రామ శివారులో నిర్మించిన సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం, జిల్లా పోలీస్‌  కమిషనర్‌ కార్యాలయాల ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు తెలిసింది. సీఎం పర్యటనలో వీటి ప్రారంభాల గురించి ప్రస్తావించలేదు. అయితే కలెక్టరేట్‌, సీపీ ఆఫీస్‌ భవన నిర్మాణ పనులూ పూర్తిగా జరగకపోవడం వల్లే వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే సీఎం కేసీఆర్‌ మళ్లీ వచ్చి వీటిని ప్రారంభిస్తారని తెలుస్తున్నది. అప్పుడు సిద్దిపేట కలెక్టరేట్‌ ,సీపీ కార్యాలయాలతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా ప్రారంభించనున్నట్లు తెలిసింది.




Updated Date - 2020-12-06T05:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising