నల్లమలకే ప్రత్యేకం
ABN, First Publish Date - 2020-02-21T06:19:47+05:30
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తదుపరి నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో అరుదుగా కనిపించే పొడ తూర్పుజాతి పశువులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి.
అచ్చంపేట, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తదుపరి నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో అరుదుగా కనిపించే పొడ తూర్పుజాతి పశువులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అంతర్జాయ గుర్తింపు ఈ ప్రాంతంలో ఉండే పొడతూర్పుజాతి పశువులకు లభించడంతో ఈ ప్రాంత పశుపోషకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి తూర్పుపొడజాతి పశువులకు గుర్తింపు రావాలని వాసన్, కోనేరు స్వచ్ఛంద సంస్థలు పొడలక్ష్మి గోవుసంఘాలను ఏర్పాటు చేసి పలు కార్యాక్రమాలను చేపట్టాయి. అదే ఏడాది జిల్లా కలెక్టర్ శ్రీధర్ అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో పొడ తూర్పుజాతి పశువుల మేళాను ప్రారంభించి, గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు గతంలోనే హామీ ఇచ్చారు. ఎట్టకేలకు తూర్పుజాతి పశువులకు కేంద్రం ఈ నెల 19న గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 20న (గురువారం)గుర్తింపునిచ్చింది. రాష్ట్ర పశుసంవర్థక శాఖ గతంలోనే భారత వ్యవసాయ పరిశోధన మండలికి ప్రతిపాదనలు పంపింది. సీఐఏఆర్‌కు చెందిన జాతీయ కమిటీ ఈ ప్రతిపాదనలపై చర్చించి పొడతూర్పు జాతి పశువుల గుర్తింపును తెచ్చారు. రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కల్గిన తూర్పుజాతి పశువును జిల్లాలోని అచ్చంపేట డివిజన్‌లో ఉండడం ఈ ప్రాంత రైతులు, పశుపోషకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పొడజాతి తూర్పుపశువులపై ఢిల్లీ శాస్త్రవేత్తల అధ్యయనం
పొడజాతి తూర్పుపశువులకు గుర్తింపు ఇచ్చేందుకు ఢిల్లీ కర్నాల్‌కు చెందిన సైంటిస్ట్‌లు డా.ఆమోస్, డా.రాజాలు గతంలో పరిశీలించారు. పొడజాతి పశువులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాయిలేటిపెంట, రాయలగండి, వటువర్లపల్లి, తిమ్మారెడ్డిపెంట, మన్ననూర్ ప్రాంతాలను సందర్శించారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన సమావేశంలో ఈ పశువులకు దేశవ్యాప్తంగా 43వ స్థానం, రాష్ట్రంలో మొదటి స్థానం లభించే అవకాశాలు ఉన్నాయని జాతీయ జీవవైవిధ్య సంస్థ, వాసన్ సంస్థలు ఽధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పొడజాతిలో రకాలు, ప్రత్యేకతలు
తూర్పుజాతి పశువులలో ఎన్నో రకాలు ఉన్నాయి. దొరపొడలు, ఎర్రపొడలు, తెల్లపొడలు, పుల్లబట్ట, తెల్లబట్ట, పాలబట్ట, ఎరుపు, నులుపు పశువులున్నాయి. ఈ జాతి పశువులు వర్షం రాకను రెండు, మూడు రోజుల ముందుగానే గుర్తిస్తాయని పెంపకందారులు చెబుతున్నారు. ఇవి బురదలో, రాతినేలలతో పాటు కొండలు, గుట్టల్లోను సనాయాసంగా నడుస్తాయి. నీటిలో వేగంగా ఈదగలగడం వీటి ప్రత్యేకతని చెప్పవచ్చు. బురదలో సైతం సులువుగా దున్నగలవని రైతులు వివరించారు. ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలతో చూడముచ్చటగా ఉండే ఈ పశువులకు భయం తెలియదు. ఆపదను ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఆహారం సరిగా లేకున్న పనిలో మాత్రం వెనుకడుగు వెయ్యవు.
తూర్పుజాతి పశువుల జీవితకాలం, సంక్రమించే వ్యాధులు
తూర్పుజాతి పొడపశువులకు గాలికుంటు, గూడలు వేయడం(గూడల రోగం), దొబ్బలవాపు(వివర్), ఎక్కువగా సోకే అవకాశాలు ఉంటాయి. ఈ పశువులు 15-20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పాడిపశువులు 5-6ఈతలను వెయ్యగలవు. ఈ పశువులు అమ్రాబాద్, పదర, అచ్చంపేట, లింగాల, బల్మూరు మండలాల్లో మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
పొడజాతి తూర్పుపశువులకు గుర్తింపు రావడం సంతోషకరం: అమ్రాబాద్ పొడలక్ష్మి గోవుసంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు
పొడజాతి తూర్పుపశువులకు గుర్తింపు రావాలని 2016-17 సంవత్సరం నుంచి తెలంగాణ జీవవైవిద్య మండలి, వాసన్ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేశాయి. గత ఆక్టోబరులో ఢిల్లీలోని కర్నాల్‌లో జరిగే దేశవ్యాప్త పశువుల గుర్తింపు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌గా పొడజాతి తూర్పుపశువులకు మొదటిస్థానం లభిస్తుందన్న ఆశాభావం ఉంది. కానీ ప్రభుత్వం ఈ నెల 19న కేంద్రం, 20న రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం పట్ల సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ పశువులకు 43వ స్థానం దక్కింది. అమ్రాబాద్ పొడలక్ష్మి గోవుసంఘంలో 350మంది సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2020-02-21T06:19:47+05:30 IST