కోమటిబండ లో హైడ్రామా!
ABN, First Publish Date - 2020-07-21T08:31:44+05:30
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ట్యాంకు ఎక్కి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
తమను మరో ఏడాది కొనసాగించాలని డిమాండ్
గజ్వేల్, జూలై 20: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు హైడ్రామా నడిచింది. మిషన్ భగీరథలో 2015 నుంచి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేసిన దాదాపు 114 మంది రాష్ట్రం నలు మూలల నుంచి కోమటిబండకు చేరుకుని తమను మరో ఏడాది పాటు కొనసాగించాని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంకులు ఎక్కి నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పే యత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. మిషన్ భగీరథ అధికారులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు నిరసనను విరమించేది లేదని భీష్మించారు. దీంతో మిషన్ భగీరథ సీఈ చక్రవర్తి, ఎస్‌ఈ శ్రీనివాసాచారి కోమటిబండకు చేరుకుని ఫోన్‌లో మాట్లాడినా వారు శాంతించలేదు. మధ్యాహ్నం నిరసనకారులకు భోజనాలు తీసుకొచ్చిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
కాగా, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వారు ట్యాంకులపైనే ఉండి నిరసన తెలిపారు. పలుమార్లు గజ్వేల్, మర్కుక్ తహసీల్దార్‌లు, గజ్వేల్ సీఐ, మిషన్ భగీరథ డీఈఈ వారిని సముదాయించే యత్నాలు చేసినా మెత్తబడలేదు. అయితే, చివరికి రాత్రి 7 గంటలకు స్వచ్ఛందంగా కిందకు దిగొచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, నిరసనకారులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.
సీఎంకు మా గోడు చెప్పేందుకు...
కరోనా విస్తృత రూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో తమ గోడును పలువురు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సీఎం దృష్టికి చేరాలనే గజ్వేల్‌కు వచ్చినట్లు నిరసనకారులు తెలిపారు. 2015, మార్చిలో మిషన్ భగీరథ పనులు ప్రారంభమైన నాటి నుంచి డిప్లమో, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్హత ఉన్న తాము వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నామని, తమకు ఎలాంటి నోటీసు లేకుండా జూలై 1 నుంచి విధులకు రావొద్దని ఆదేశాలివ్వడంతోనే నిరసనకు దిగామని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47మంది జూనియర్ అసిస్టెంట్లను తొలగిస్తూ జూన్ 30న మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో ఐదేళ్లుగా పనిచేస్తున్న తాము ఏకకాలంలో నిరుద్యోగులుగా మారి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-07-21T08:31:44+05:30 IST