‘చింతవర్రె’ కుటుంబాలకు అండగా ఉంటాం:మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్
ABN, First Publish Date - 2020-12-31T05:20:35+05:30
లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింత వర్రె ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులపై ఉపాధ్యాయుడు చేసిన లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఘటన లోని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
అసత్వర న్యాయం చేస్తాం.. దోషులను కఠినంగా శిక్షిస్తాం..
ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం హైకోర్టును కోరతాం
ఉపాధ్యాయుడి వేధింపుల ఘటనపై కొత్తగూడెంలో సమీక్ష
కొత్తగూడెం, డిసెంబరు 30: చదువు చెప్పి, ఉజ్వల భవిష్యత్‌ను ఇవ్వాల్సిన ఉపాధ్యా యుడే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటం దురదృష్టకరమని, ఈ ఘటన లోని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ ఉదంతం తమనెంతో కలిచివేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బాణోత్ హరిప్రియ పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింత వర్రె ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులపై ఉపాధ్యాయుడు చేసిన లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చింతవర్రె గ్రామంలోని బాధితుల ఇళ్లకు వెళ్లాలని భావించారు. కానీ ఆ కుటుంబాల గోప్యత అవసరం కారణంగా కలెక్టరేట్‌లోనే మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, కలెక్టర్ ఎంవీ.రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ వినీత్, ఐటీ డీఏ పీవో గౌతం, జిల్లా మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో సంఘటనపై చర్చించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లా డుతూ బాధిత కుటుంబాలకు వైద్య సౌకర్యాలను కల్పిస్తామని, ఘటనపై ప్రత్యేక కమిటీ వేస్తున్నామని, బాలబాలికలు, మహి ళల సంరక్షణకు సీఎం కేసీఆర్ షీ టీమ్‌లను అందుబాటులో ఉంచారని, ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసి ఈ ఘటన లోని నిందితులను త్వరితగతిన శిక్షించి.. విద్యార్థినులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో చర్చించామన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సదరు విద్యార్థినులను మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో శిశువుల కేంద్రంలో ఉంచి మానసికంగా, ధృఢంగా తయార య్యేటట్లు చూస్తామని భరోసానిచ్చారు. అందుకు ఆయా పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించినట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద బాధిత కుటుంబాలకు పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటామ న్నారు. ఈ సంఘటనపై ఎస్పీ విచారణ అధికారిగా.. ఐటీడీఏ పీవో, ఆర్డీవో, జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి, అదనపు కలెక్టర్లతో విచారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ దురాగతానికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం హైకోర్టును కోరుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామన్న ఆయన.. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు పోషణ కోసం 100శాతం సబ్సీడీతో వారికి ఏది కావాలన్నా అందించడానికి ఐటీడీఏకు బాధ్యత అప్పగించామన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలికారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను చింతవర్రె గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడానని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారని వివరించారు. త్వరితగతిన విచారణ పూర్తిచేయించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రతీ బాధిత కుటుంబానికి పోక్సో చట్టం కింద రూ.లక్ష, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.లక్ష.. మొత్తం రూ.2లక్షలను బాధితులకు అందజేశారు. వీటితో పాటు మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కుటుంబానికి రూ.50వేలు చొప్పున అందజేయగా.. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు ఐదు కుటుంబాలకు రూ.20వేల చొప్పున, హరిప్రియ రూ.20వేల చొప్పున అందజేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, సొసైటీ అధ్యక్షుడు మండే వీర హన్మంతరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.1.05లక్షలు అందించిన జిల్లా అధికారుల సంఘం
‘చింతవర్రె’ బాధిత కుటుంబాలకు జిల్లా అధికారుల సంఘం తరపున రూ.1.05లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ నగదు ను బుధవారం కలెక్టర్ చాంబర్‌లో సంఘం నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందించారు. ఘటన తర్వాత విద్యార్థినుల తల్లిదండ్రులు పనులకు వెళ్లలేకపోతు న్నారని, ఇలాంటి సందర్భంలో వారికి ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.
Updated Date - 2020-12-31T05:20:35+05:30 IST