వాన వరద
ABN, First Publish Date - 2020-09-14T10:20:12+05:30
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీవర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
ఖమ్మంలో 4.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
అశ్వారావుపేట పెదవాగుకు పోటెత్తిన వరద
కిన్నెరసానికి భారీగా వరద
ఖమ్మం/అశ్వారావుపేటరూరల్/పాల్వంచరూరల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీవర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా.. చెరువులు అలుగులు పోస్తున్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా... పలు పంటలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లాలో 4.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో 10సెం.మీ, ఏన్కూరులో 9.6సెం.మీ కొణిజర్లలో 7.5సెం.మీ, ముదిగొండలో 6.4సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఎర్రుపాలెం, తిరుమలాయపాలెం, మధిర, ఖమ్మం అర్బన్ మండలాల్లో 1 సెంమీ వర్షపాతం నమోదైంది. కొణిజర్ల, ఏన్కూరు, సత్తుపల్లి, మధిర, వైరా తదితర మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. వైరా రిజర్వాయిర్‌కు వరద పెరిగింది. వాగులు ఉప్పొంగుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఓ మోస్తారు వర్షం పడగా.. ముఖ్యంగా అశ్వారావుపేట మండలంలో దాదాపు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో వాగులు పొంగాయి.
కన్నాయిగూడెం, గుబ్బల మంగమ్మ ఆలయం, అనంతారం ప్రాంతాల్లో భారీగా వర్షం పడటంతో మండలంలోని మధ్యతరహా పెదవాగుప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక గేటును 1.5 మీటర్లు మేర ఎత్తి మొత్తం 0.1 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు గేటు ఎత్తటంతో రంగాపురం, గుమ్మడివల్లి గ్రామాల మధ్య గల వాగుపై వరద ఉధృతంగా ప్రవహించటంతో ఆమార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. రెండురోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన ఆళ్లపల్లి, గుండాల, మర్కోడు తదితర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఆదివారం సాయంత్రానికి కిన్నెరసాని నీటిమట్టం 405.690అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 5వేల క్యూసెక్కులు ఉండటంతో డ్యాం అధికారులు రాత్రి సమయంలో గేట్లు ఎత్తి అధికంగా ఉన్న వరద నీటిని లోతట్టు ప్రాంతాలకు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాజాపురం చప్టాపై నుంచి నీరు ప్రవహిస్తోందని.. వాగుదాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Updated Date - 2020-09-14T10:20:12+05:30 IST