ప్రైవేట్ భవనానికి ప్రభుత్వ స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
ABN, First Publish Date - 2020-12-12T04:59:39+05:30
వైరాలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వ్యాపార కార్యకలాపాల కోసం నిర్మించిన ఓ ప్రైవేట్ భవనానికి కరెంట్ కనెక్షన్ కోసం ఎదురుగా ఉన్న ప్రభుత్వస్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేస్తుండటంపై తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి.
వైరా, డిసెంబరు 11: వైరాలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వ్యాపార కార్యకలాపాల కోసం నిర్మించిన ఓ ప్రైవేట్ భవనానికి కరెంట్ కనెక్షన్ కోసం ఎదురుగా ఉన్న ప్రభుత్వస్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేస్తుండటంపై తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాల కోసం నిర్మించిన భవన సముదాయ స్థలంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఆ భవనానికి ఎదురుగా రోడ్డుపక్కనున్న నీటిపారుదలశాఖ స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో అధికారులు సిమెంట్ దిమ్మె నిర్మించారు. సాధారణంగా ఎక్కువమంది ప్రజల అవసరాల కోసం ట్రాన్స్‌ఫార్మర్లను ఆర్‌అండ్‌బీ, మునిసిపల్, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేస్తారు. అయితే అందుకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ భవనం వ్యాపారాల కోసం ప్రభుత్వస్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేపట్టడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఏకంగా నీటిపారుదలశాఖ స్థలానికి రక్షణగా ఉన్న ప్రహారీని ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సిమెంట్ దిమ్మె నిర్మించారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేయటం మాత్రమే మిగిలిఉంది. వెంటనే నీటిపారుదలశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ భవనం కోసం ప్రభుత్వస్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేయకుండా తగుచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2020-12-12T04:59:39+05:30 IST