ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం
ABN, First Publish Date - 2020-12-30T04:58:42+05:30
కొత్తగూడెం సింగరేణి మైన్ ్స ఏరియాలోని 5షాఫ్ట్ భూగర్భ గని విస్తరణపై మంగళవారం రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైంది.
యాజమాన్యం ధోరణులపై పలువురి ఆగ్రహం
ప్రభావిత ప్రాంతాల్లో వసతుల కల్పనకు డిమాండ్
రుద్రంపూర్ (సింగరేణి), డిసెంబరు 29 : కొత్తగూడెం సింగరేణి మైన్ ్స ఏరియాలోని 5షాఫ్ట్ భూగర్భ గని విస్తరణపై మంగళవారం రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైంది. సింగరేణి అవలంభిస్తున్న విధానాలపై అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధిస్తుంటే యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని స్థానికుల నుచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం వీధి లైట్ల ఏర్పాటు, కార్మికులు నివాసాలు సాగించే క్వార్టర్ల నిర్వహణ సైతం అధ్వాన్నంగా ఉందనే విమర్శలు వచ్చాయి. 5షాఫ్ట్ గనిపై పర్యావరణ అనుమతులు నేపథ్యంలో నిర్వహించిన ఈ వేదిక సందర్భంగానైనా సింగరేణి తమ ధోరణిని మార్చుకోవాలని పలువురు సూచించారు. సింగరేణి కార్మిక వాడలకు ప్రధాన కేంద్ర బిందువైన రామవరం పట్టణం పట్ల సింగరేణి యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని మునిసిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మీ ప్రశ్నించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతోపాటు మైన్స్ ఏరియా జనరల్ మేనేజర్ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబిర్‌పాషా, ఏఐటీయుసీ కార్మిక సంఘ ప్రధాన సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, సీఐటీయు బ్రాంచీ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, జిల్లా కాంట్రాక్ట్ కార్మికులు సంఘం అధ్యక్షులు పూల రవీందర్, లంబాడీ హక్కుల సంఘం నాయకులు లాల్ సింగ్‌తో పాటు మరో 15 మంది సభ్యులు ప్రసంగించారు. కొత్తగూడెం సింగరేణి మైన్స్ ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. నరసింహారావు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సింగరేణి అధికారులు ఆర్. నారాయణ , శామ్యూల్ సుధాకర్, టి. సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:58:42+05:30 IST