నెమ్మది..నెమ్మదిగా..భద్రాద్రి వద్ద 55.2 అడుగులకు గోదావరి
ABN, First Publish Date - 2020-08-22T10:59:08+05:30
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరడంతో కలెక్టర్
కొనసాగుతున్న చివరి ప్రమాద హెచ్చరిక
వారం రోజులుగా వరద నీటిలోనే పలు ప్రాంతాలు
వరద బాధితులకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పరామర్శ
భద్రాచలం, ఆగస్టు 21 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరడంతో కలెక్టర్ ఎంవీరెడ్డి చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 53.8 అడుగులకు చేరుకోగా, ఆరు గంటలకు 54 అడుగులు, ఉదయం 9 గంటలకు 54.3 అడుగులు, మధ్యాహ్నం 12గంటలకు 54.8 అడుగులకు చేరుకుంది. 3 గంటలకు 55.2 అడుగులకు చేరుకుని సాయంత్రం 4 గంటల వరకు నిలకడగా ఉంది. ఈ క్రమంలో మళ్లీ నెమ్మదిగా పెరిగి 5గంటలకు, 6 గంటలకు 55.3అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఈ క్రమంలో తుది ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనేఉంది.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ తీరాన ఉన్న సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, పునర్వసు మండపం, దేవస్థానం కల్యాణ కట్ట, వైకుంఠ ఘాట్ నీట మునిగాయి. అలాగే వారం నుంచి చప్టా దిగువ, విస్తా కాంప్లెక్సు, దేవస్థానం ఉచిత నిత్యాన్నదాన సత్రం, రామాలయం పడమరమెట్ల ముందు భాగం, మిథిలా స్టేడియం వెనుక భాగం, శిల్పినగర్ లోని కొద్దిభాగం వరద నీటిలోనే ఉన్నాయి. అశోకనగర్ కొత్తకాలనీ, సుభాష్‌నగర్‌లోని శివారు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే మార్గం, భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే మార్గంలో రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
భద్రాచలంలో పునరావాస కేంద్రాలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య శుక్రవారం వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గోదావరి ఒడ్డున వరద ఉధృతిని పరిశీలించారు. ఈ క్రమంలో చప్టా దిగువ ప్రాంతానికి చెందిన వ్యాపారులు.. వారం రోజులుగా నీట మునిగి ఉండటంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే దృష్టికి తేగా ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2020-08-22T10:59:08+05:30 IST