అసలేం జరుగుతోంది?
ABN, First Publish Date - 2020-05-09T10:32:14+05:30
కొంతకాలంగా అప్పారావుపేట కర్మాగారంలో ఆయిల్ రికవరీ శాతం పడిపోవడం, అధికారులు చెబుతున్న కారణాలతో.. అసలు
ఆయిల్‌ఫెడ్ తీరుపై అనుమానాలెన్నో
ఉన్నతాధికారులతో మాట్లాడిన మాజీ మంత్రి తుమ్మల
రికవరీశాతం పడిపోవడంపై కలెక్టర్ ఆరా...
నిలదీసిన రైతులు... పచ్చిగెలలే కారణమంటున్న అధికారులు
అశ్వారావుపేట, మే 8: కొంతకాలంగా అప్పారావుపేట కర్మాగారంలో ఆయిల్ రికవరీ శాతం పడిపోవడం, అధికారులు చెబుతున్న కారణాలతో.. అసలు కర్మాగారంలో ఏంజరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పారావుపేట కర్మాగారంలో గెలలు క్రష్సింగ్ చేస్తుండగా.. హఠాత్తుగా 2.5 శాతం ఆయిల్ రికవరీ తగ్గిపోయిందనే సమాచారంతో రైతులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం అశ్వారావుపేటలో పలువురు రైతులు సమావేశమై పంటను పరిరక్షించుకోవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో పలువురు ప్రముఖ రైతులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి ఆయిల్‌ఫెడ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వస్తున్న అనుమానాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమ్మల ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రైతుల అనుమానాలను తీర్చాలసిన బాధ్యత ఆయిల్‌ఫెడ్‌పై ఉందని, సాంకేతికపరమైన బృందంతో విచారణ చేపట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే గుర్తించి అప్రమత్తం చేయాలని ఆయిల్‌ఫెడ్ అధికారులను తుమ్మల కోరారని రైతులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
రికవరీశాతం తగ్గుదలపై అధికారుల నిలదీత?
పలువురు పామాయిల్ రైతులు అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి రికవరీశాతం తగ్గుదలపై అధికారులను నిలదీశారు. పలు అనుమానాలను వారి దృష్టికి తీసుకెళ్లి.. సమాధానం కావాలని నిలదీశారు. స్పందించిన అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ కర్మాగారాల మేనేజర్లు శ్రీకాంత్‌రెడ్డి, బాలకృష్ణ పచ్చిగెలలు ఎక్కువగా వస్తున్నాయని దానివల్లే రికవరీశాతం తగ్గిందని, వాటిని రాకుండా చూసుకోవాలని ఇప్పటికే డివిజనల్ కార్యాలయం ద్వారా రైతులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. వీటితో పాటు తెల్లదోమ, వాతావరణంలో మార్పులవల్ల కూడా రికవరీశాతం తగిఉండవచ్చునని అధికారులు చెప్పగా.. అందుకు రైతులు ఏకీభవించలేదు.
పచ్చిగెలల సమస్య ఎప్పుడూ ఉండేదని, తెల్లదోమవల్ల పామాయిల్ పండుపై ఇంత వరకు ప్రభావం చూపిందని నిర్ధారణేదీ లేదని, వాతావరణం కూడా ఈ ఏడాది అనుకూలంగానే ఉందని, కారణాలు ఇవేమి కావని రైతులు అన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో వచ్చిన రికవరీశాతాన్ని నెలలవారీగా బోర్డుపై చూపించాలని రైతులు కోరడంతో ఆ రెండేళ్లకు సంబంధించి రికవరీశాతాన్ని బోర్డుపై ఎక్కించారు. 2019 జనవరి నుండి ఏప్రిల్‌తో పోలిస్తే 2020 జనవరి నుంచి మార్చి వరకు నెలనెల తగ్గుతూ వచ్చినట్టు తేలింది.
రికవరీశాతం తగ్గుదలపై కలెక్టర్ ఆరా?
అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీశాతం తగ్గిపోయిందంటూ వస్తున్న కథనాలు, రైతులు చేస్తున్న ఆందోళనలతో అధికారుల్లో కదలిక వచ్చింది. శుక్రవారం రైతులు ఫ్యాక్టరీలో ఉండగానే కలెక్టర్ ఎంవీ రెడ్డి ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. పచ్చిగెలలు ఎక్కువగ రావడంవల్లనే ఆయిల్ రికవరీశాతం తగ్గిందని, ఈ విషయాన్ని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయానికి కూడా తెలియజేసినట్టు మేనేజర్ తెలియజేశారు. అయితే ఆయన వివరణకు ఆయిల్‌ఫెడ్ డివజనల్ అధికారి ప్రవీణ్‌రెడ్డి విబేధించారు. ఈ క్రమంలో పలు విషయాల్లో వారిద్దరు రైతుల ఎదుటే వాగ్వాదానికి దిగారు. అయితే ఆయిల్ రికవరీశాతం తగ్గటానికి ఉన్న కారణాలపై అసలు శోధనే లేకపోవడంపై అటు రైతులు, ఇటు అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్యాక్టరీలవద్ద రైతుల ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు..
పచ్చి గెలలు రావడంవల్లే రికవరీశాతం తగ్గుతుందని, కర్మాగారంలోను, సిబ్బందిలోను ఏ విధమైన తేడాలు లేవని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రైతులు చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చారు. అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల్లో రైతుల తరుపున కొందరిని ఉంచాలని, పచ్చిగెలలు వస్తే గ్రేడింగ్ చేసి వెనకకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో లోపాలను గుర్తించేందుకు విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు, సీఎం దృష్టికి ఫ్యాక్టరీలోని సమస్యలను తీసుకెళ్లాలని రైతులు తీర్మానించుకున్నారు.
ఇదిలా ఉంటే ఆయిల్ రికవరీశాతం తగ్గటంలో ఫ్యాక్టరీ తప్పేమి లేదని, ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు క్రమశిక్షణతో పని చేస్తున్నామని, పచ్చి గెలలు రావడం వల్లే రికవరీశాతం తగ్గుతుందని, తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఎలాంటి సంతకాలు లేని ఓ లేఖ సోషల్ మీడియా ద్వారా కొందరు విలేకరులకు అందడం గమనార్హం.
Updated Date - 2020-05-09T10:32:14+05:30 IST