కరోనా ప్రభావం లేదు
ABN, First Publish Date - 2020-03-16T12:32:48+05:30
జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ప్రజలు ఆందోళన చెందొద్దు
ముందస్తు నివారణపై అవగాహన కల్పించండి
అధికారులకు, ప్రజలకు ఖమ్మం కలెక్టర్ సూచన
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 15: జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు జిల్లా స్థాయి అధికారులు ముందస్తు నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు తహాసీల్దార్లు, వైద్య, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈనెల 31 వరకు సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లు, మెంబర్‌షిప్ క్లబ్బులు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్‌లు, జూపార్క్‌లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, మ్యూజియాలు మూసివేతకు ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో వీటిని పకడ్బందీగా అమలు చేయాల న్నారు. జనసమర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రించేందుకు, విద్యాసంస్థలతో పాటు కోచింగ్ సెంటర్లు సమ్మర్ క్యాంపులు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు.
యథాతథంగా పరీక్షలు
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్, జరగబోయే పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్, జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరించడంతో పాటు అవసరమైన వారికి పరీక్షలను నిర్వహించాలని, అనుమానితులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, గ్రామస్థాయిలో ఆశాకార్యకర్తలు అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు 24 గంటలు నిరంతరాయంగా విధుల్లో ఉండి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యాసంస్థలు మూసేయాలి
జిల్లాలోని ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ విధిగా మూసేసే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాస్టల్ వసతిని యథావిధిగా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని పంచాయతీరాజ్ రహాదారులు విద్యుత్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో రైళ్లలో శానిటేషన్ పనులను నిరంతరాయం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీసీపీ ఇంజారపు పూజ, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, కల్లూరు ఆర్డీవో దశరథ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, డీఈవో మదన్‌మోహన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, సంక్షేమశాఖ అధికారి సబిత, ఇంటర్‌బోర్డు అధికారి రవికుమార్, సాంఘీక సంక్షేమశాఖ అఽధికారి కె సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఈఈ స్వర్గం నర్సింహారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, విఽవిధ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు, తహాసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T12:32:48+05:30 IST