‘మిక్సోపతి’తో ఆధునిక వైద్యంపై ప్రభావం
ABN, First Publish Date - 2020-12-12T04:55:30+05:30
‘మిక్సోపతి’తో ఆధునిక వైద్యంపై ప్రభావం
సీసీఐఏ గెజిట్‌తో తిరోగమనం
ఐఎంఏ ఖమ్మం జిల్లా నేతల ఆరోపణ
బంద్‌లో పాల్గొన్న 500ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు
ఐఎంఏ భవనంలో నిరసన తెలిపిన వైద్యులు
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు 11: ప్రపంచ వ్యాప్తంగా అల్లోపతి ఆధునిక వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన నేపథ్యంలో మనదేశంలో మాత్రం ఆయుర్వేద వైద్యానికి సీసీఐఏ గెజిట్ నోటిపికేషన్ ఇచ్చి మిక్సోపతిగా మార్చడం వల్ల.. ఆధునిక వైద్యంపై తిరోగమన ప్రభావం పడుతోందని ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శోభాదేవి, డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ ఆరోపించారు. ఐఎంఏ పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లాలోని 500 ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్ పాటించాయి. ఖమ్మం ఐఎంఏ భవనంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు పాల్గొని ప్లేకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఐఎంఏ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సీసీఐఎం గెజిట్ నోటిఫికేషన్ 2020ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయుర్వేద వైద్యులకు సరైన వైద్యశాస్త్ర శిక్షణ లేకుండా అపరేషన్లు నిర్వహించటం రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. అపరేషన్ తర్వాత రోగులకు సరైన ఔషధాలు ఇవ్వకపోవడంతో వారు మృత్యువుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అల్లోపతి, ఆయుర్వేద విధానాలు ఉండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా మిక్సోపతి వైద్యం జరుగుతోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా సీసీఐఏ గెజిట్‌ను విడుదల చేసిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఐఎంఏ కోశాదికారి డాక్టర్ కంభంపాటి నారాయణరావు, వైద్యులు సతీష్‌బాబు, యలమంచిలి రవీంధ్రనాఽథ్, వై వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, బి.నాగేశ్వరరావు, నందన్, శ్రీకాంత్, శ్రీకళ, కిశోర్‌బాబు, శీలం పాపారావు, జీ వెంకటేశ్వర్లు, మహితర్, అసాధారణ్, సురేశ్, ధనమూర్తి, రాఘవేంద్ర, శ్రీహర్ష, వీరేందర్ పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లాలో 150ప్రైవేట్ ఆస్పత్రుల మూత
కొత్తగూడెం కలెక్టరేట్, డిసెంబరు 11 : శస్త్ర చికిత్స చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అనుమతిస్తూ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇచ్చిన 12గంటల బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం విజయవంతమైంది. దీంతో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అత్యవసర వైద్య సేవలు, కొవిడ్ సేవలు మినహా మిగిలిన వైద్య సేవలన్నింటిని నిలిపివేశారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ చారుగుండ్ల నాగేశ్వరరావు, డాక్టర్ చారుగుండ్ల రాజశేఖర్ అయ్యప్పమాట్లాడుతూ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ తీసుకున్న నిర్ణయం మిక్సోపతి అవుతోందని, ఆయుర్వేద వైద్యానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స చేసే అనుమతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-12T04:55:30+05:30 IST