అటవీశాఖతో అమీతుమీ తేల్చుకుందాం
ABN, First Publish Date - 2020-12-16T04:57:55+05:30
అటవీశాఖ అధికారులతో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్న పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు.
ఆ శాఖ అధికారులు గ్రామాల్లోకి వస్తే నిర్బంధించండి
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విప్ రేగా ప్రకటన
ప్రజల దృష్టి మళ్లించేందుకేనంటున్న ప్రతిపక్షాలు
మణుగూరుటౌన్, డిసెంబరు 15: అటవీశాఖ అధికారులతో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్న పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు. అటవీశాఖ కబ్జాలో వేల ఎకరాల భూమి ఉందని, అటవీ, రెవెన్యూ శాఖల భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన ఓ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన ఆయన అటవీశాఖ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఆదివాసీ గ్రామాలకు నేటికీ రహదారుల సౌకర్యం లేకపోవడానికి అటవీశాఖ తీరే కారణమని మండిపడ్డ రేగా అడవుల్లో ఉండే గిరిజనులకు మౌళిక సదుపాయాల కల్పనలోనూ అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆ సమావేశంలో ఆరోపించారు. ప్రత్యేక గిరిజన చట్టాలున్న ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలపైనే అధికారులు పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారని ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు గ్రామాల్లోకి వస్తే నిర్బంధించాలని సోషల్ మీడియా వేదికగా రేగా కాంతారావు మంగళవారం పిలుపునివ్వడం సంచలనంగా మారింది. ఫారెస్ట్ అధికారులతో అమీతుమీ తేల్చుకోకుంటే తమ బతుకులు రోడ్లపైకి వస్తాయని పేర్కొన్న ఆయన తాను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని, అందుకు ఆదివాసీలు సిద్ధంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆయిన రేగా కాంతారావు సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టింగ్‌లు సంచలనమయ్యాయి. అంతే కాకుండా సమస్యలు పరిష్కరిస్తానన్న హామీ మేరకే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని హైదరాబాద్‌లో మీడియా ముందు ప్రకటించినట్టు వస్తున్న వార్త కథనాలు మరింత సంచలనం రేపుతున్నాయి.
ప్రజల దృష్టి మరల్చేందుకేనంటున్న ప్రతి పక్షాలు
పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగాపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రజలతోపాటు టీఆర్‌ఎస్‌లోని కొందరు ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యే ధోరణిపై పార్టీలో అంతర్గతంగా సొంత క్యాడర్‌నుంచే వ్యతిరేకత వస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీనికి తోడు తన సొంత మనుషులుగా భావిస్తున్న కొందరు చేస్తున్న అక్రమాలపై ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటుండడం ఇటీవల చర్చనీయాంశమైంది. గిరిజన ఎమ్మెల్యే అయి ఉండి గిరిజనేతరులకు ప్రాధాన్యమిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. దీనికి తోడు ప్రధాన హామీ అయిన పోడుపట్టాల ఊసే లేకపోవడంతో దీనిపై ఆదివాసీ సంఘాలు నిరాహర దీక్షలకు పిలుపునివ్వడం, ఎమ్మెల్యే అనుచర నాయకుడిపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధమవ్వడంతో ప్రజల్లో ఎమ్మెల్యే రేగాపై అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అటవీశాఖతో యుద్ధం అంశాన్ని లేవనెత్తారన్న విమర్శలు ప్రతిపక్ష నాయకులనుంచే కాకుండా నియోజకవర్గ ప్రజలనుంచీ వినిసిస్తున్నాయి. ఇదిలా ఉండగా అటవీశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని కూడా రియల్‌దాందా చసే గిరిజనేతరులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రేగా కాంతారావు అటవీశాఖ అధికారులపై యుద్ధాన్ని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే రేగా వివరణ...
ఈ విషయమై ఎమ్మెల్యే రేగా కాంతారావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రజా సమస్యలు, పోడు సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అటవీశాఖ అధికారులు గిరిజనులపై దాడులు చేయద్దని ముఖ్యమంత్రి చెప్పినా అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనలను ఇబ్బందిపెడితే ఊరుకోబోమన్నారు. అయితే పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీతో పాటు నాయకులపై వస్తున్న ఆరోపణలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అటవీశాఖపై యుద్ధాన్ని ప్రకటించారన్న ఆరోపణలపై స్పందిస్తూ అవన్నీ చిన్నచిన్న సమస్యలేనని, పనీపాట లేనివారు కొందరు చేసే విమర్శలేనని కొట్టిపడేశారు.
Updated Date - 2020-12-16T04:57:55+05:30 IST