కొనుగోళ్లకు కొర్రీలు
ABN, First Publish Date - 2020-12-06T04:42:53+05:30
ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌లో అడుగడుగునా కొర్రీలు ఎదురవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కోనుగోళ్లు గందరగోళంగా సాగుతున్నాయి.
ధాన్యం నాణ్యత లేదని వెనుకంజవేస్తున్న మిల్లర్లు
కేంద్రాల్లో పేరుకుపోతున్న వడ్లు
నిలిచిన కాంటాలు, ఆందోళనలో రైతులు
పదిరోజులుగా రాశుల వద్ద పడిగాపులు
‘గిట్టుబాటు’కు కోత పెడుతున్న ప్రైవేటు వ్యాపారులు
కల్లూరు/వైరా/కరకగూడెం, డిసెంబరు 5: ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌లో అడుగడుగునా కొర్రీలు ఎదురవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కోనుగోళ్లు గందరగోళంగా సాగుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇష్టానుసారింగా కోతలు విధిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరిసాగులో కల్లూరు మండలం అగ్రగామిగా ఉంది. ఈ మండలంలో 6.60లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడికాగా అందులో ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ సన్నరకం ధాన్యం క్రింటాకు రూ.1,888 నిర్ణయించగా ప్రైవేట్ వ్యాపారులు మాత్రం 1,700లకే కొనుగోలు కొనుగోలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో వ్యాపారులు 75కిలోల బస్తా ప్రభుత్వ మద్దతుధర ప్రకారం రూ.1416కాగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.1250కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
రవాణా ఇబ్బందులు
వైరా మండలంలో లారీలు అందుబాటులో లేక పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు నిలిపివేశారు. వైరా ఏఎంసీ ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డులో వైరా, గరికపాడు, పూసలపాడు సొసైటీల ఆధ్వర్యంలో 17కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో ఒకటి, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. వైరా ఏఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1,882క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా వెయ్యిక్వింటాళ్లకుపైగా ధాన్యం మార్కెట్‌యార్డుకు వచ్చి ఉంది. మూడురోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. కొన్నిచోట్ల కాంటాలు వేస్తున్నా లారీల కొరత వల్ల ఎగుమతుల్లో ఆలస్యమవుతోంది. డీసీఎంఎస్, గరికపాడు, పూసలపాడు సొసైటీల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
అడుగడుగునా దోపిడీ
రైతులు కొనుగోలు కేంద్రాలకు సొంత బస్తాల్లో తరలిస్తే అక్కడ కాంటా వేస్తారు. అంతకు ముందే రైతుల ధాన్యాన్ని శుభ్రం చేయాలి. తేమశాతం 17లోపు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో అడుగడుగునా రైతు దోపిడీకి గురవుతున్నాడు. ఆరిన తరువాత ధాన్యం తూర్పారా పట్టేందుకు ఎకరాకు రూ.300నుంచి రూ.400 చెల్లించాల్సి వస్తోంది. రవాణాకు ట్రాక్టర్, కూలీలకు రూ.800నుంచి రూ. 1000, ప్యాడి క్లీనర్‌కు ఎకరాకు కూలీలకు రూ.600 ధాన్యం పెట్టినందుకు, లారీకి ఎత్తినందుకు క్వింటాకు రూ.32 రైతులు చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ పాటించినా గిట్టుబాటు దక్కడం లేదు. పైగా రైతుల ఆర్థికావసరాన్ని గమనించిన దళారులు క్వింటాకు కేవలం రూ.1200లకే కొనుగోలు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలో ఈ పర్యాయం ‘కాకి బుడ్డలు’ అనే తెగులుతో నాణ్యత తగ్గింది.
మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదు
చావా వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్, చిన్నకోరుకొండి
ఈసారి న్నరకం ధాన్యం ఎక్కువ సాగుచేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ అనేక సాకులతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో సొసైటీ కార్యాలయానికి వచ్చిన రైతులు తమపై వత్తిడి తెస్తున్నారు. మిల్లర్ల నిబంధనలతో తాము ఏం చేయలేకపోతున్నాం. పైస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సి ఉంది.
ఎగుమతి లేక పడిగాపులు కాస్తున్నాం
బొగ్గుల జనార్ధన్‌రెడ్డి, రైతు, వైరా
కాంటా వేసిన బస్తాలను ఎగుమతి చేయటం లేదు. మూడురోజులుగా బస్తాల వద్ద పడిగాపులు కాస్తున్నా. తుఫాన్ వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వర్షం కురిస్తే బస్తాలన్నీ తడిసిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ఎగుమతి చేయాలి.
వేగంగా కొనుగోలు చేయాలి
పూనేం ఓంకార్ తాటిగూడెం రైతు, కరకగూడెం
పంటకు తెగుళ్లు వచ్చాయి. కోత దశలో ధాన్యం కంకులకు కాకి బుడ్డల తెగులు రావడంతో నాణ్యత తగ్గింది. రెండు బస్తాల ధాన్యాన్ని శుభ్రపరచడానికి ఇద్దరు కూలీలు రోజంతా శ్రమించాల్సి వస్తోంది. ఇంత చేసినా మార్కెట్‌లో ‘మద్దుతు’ దక్కడం లేదు.
Updated Date - 2020-12-06T04:42:53+05:30 IST