60డివిజన్ల ఖమ్మం!..
ABN, First Publish Date - 2020-12-12T05:05:03+05:30
వచ్చే మార్చితో ఖమ్మం నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుండటం.. ఈ లోపే కార్పొరేషన్‌కు ఎన్నికలు ఉంటాయని వస్తున్న వార్తలతో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులు కూడా దృష్టి సారించారు. ఖమ్మంనగరంలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా వాటిని 60 డివిజన్లుగా మారుస్తూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, చట్టం చేశారు.
కార్పొరేషన్ వార్డుల పెంపు లాంఛనమే
50నుంచి 60కి పెరగనున్న సంఖ్య
రిజర్వేషన్ల మార్పు, ఓటర్ల సర్దుబాటులో అధికారులు
నగరపోరుపై రోజురోజుకు పెరుగుతున్న ఉత్కంఠ
ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆశావహులు
ఖమ్మం కార్పొరేషన్, డిసెంబరు 11: వచ్చే మార్చితో ఖమ్మం నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుండటం.. ఈ లోపే కార్పొరేషన్‌కు ఎన్నికలు ఉంటాయని వస్తున్న వార్తలతో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులు కూడా దృష్టి సారించారు. ఖమ్మంనగరంలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా వాటిని 60 డివిజన్లుగా మారుస్తూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, చట్టం చేశారు. దీంతో ఈ సారి నగరపాలక సంస్థ ఎన్నికలు 60 డివిజన్ల పరిధిలో జరగనుండంతో రిజర్వేషన్లు మారడం ఖాయంగా కనిపిస్తుండటంతో.. స్పష్టత కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లలో ఓటర్ల సంఖ్య భిన్నంగా ఉంది. కొన్ని డివిజన్లలో 3వేల మంది ఓటర్లు ఉండగా, మరికొన్ని డివిజన్లలో 7వేల వరకు ఓటర్లున్నారు. ఇటీవల ఖమ్మం రూరల్ మండలంలోని ఆరు పంచాయతీలు ఖమ్మం నగరపాలక సంస్థలో కలవగా, ఆయా పంచాయతీలను కలిపి డివిజన్లను పెంచుతారని భావించారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో సదరు పంచాయతీలు తిరిగి ఖమ్మం రూరల్ మండలంలోనే కలిశాయి. దీంతో ఉన్న డివిజన్లలోనే ఉన్న ఓటర్లను సర్దుబాటు చేసి, 60 డివిజన్లుగా మార్చనున్నారు. దీనివల్ల మరో పదిమందికి కార్పొరేటర్లుగా అవకాశం రావటమే కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. రిజర్వేషన్లు మారితే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తుండగా, కొత్తగా పోటీ చేయాలనుకొనే ఆశావహులు ఇప్పటినుంచే ప్రచారాలు చేస్తున్నారు. వచ్చేనెలలో నగరపాలక సంస్థలో ఎన్నికల నగారా మోగుతుందనే వార్తలు వస్తుండటంతో ఎవరికి వారే ప్రణాళికలు వేస్తున్నారు.
ఈ డివిజన్లలో ఓటర్లు తక్కువ..
నగరంలోని పలు డివిజన్లలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండగా ఆయా డివిజన్లలో ఓటర్ల సంఖ్య పెంచుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటో డివిజన్‌లో అలాగే 41, 46, 49, 50 డివిజన్లలో ఓటర్ల సంఖ్య 3వేలకు పైన ఉంది. 1వ డివిజన్‌లో 3,159 మంది ఓటర్లు ఉండగా,41వ డివిజన్‌లో 3614, 46వ డివిజన్‌లో 3732 మంది ఉన్నారు. అలాగే 49వ డివిజన్‌లో 3106, 50వ డివి.జన్‌లో 3021 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 4వేల మంది ఓటర్లు ఉన్న డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో ఓటర్ల సంఖ్యను పెంచి 4500 నుండి 5వేల వరకు చేయనున్నారు.
11వ డివిజన్‌లో 9వేలకు పైగా ఓటర్లు.
నగరంలోని 11వ డివిజన్‌లో అత్యదికంగా 9123 మంది ఓటర్లు ఉన్నారు. ఈ డివిజన్‌ను విభజించే అవకాశం ఉంది. అలాగే 22వ డివిజన్‌లో 7416 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 34 డివిజన్‌లో 8570 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు డివిజన్లను రెండుగా విభజిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక 39వ డివిజన్‌లో 7043, 35వ డివిజన్‌లో 6965, 40వ డివిజన్‌లో 6865 మంది ఓటర్లు ఉన్నారు. 10వ డివిజన్‌లో కూడా 6838 మంది ఓటర్లు ఉన్నారు. 8వ డివిజన్‌లో 6109 మంది ఓటర్లు ఉండగా, ఇలా పలు డివిజన్లలో 5నుండి 6వేల వరకు ఓటర్లు ఉండటంతో ఆయా డివిజన్లను విభజించే అవకాశం ఉంది.
ఆశావహుల ప్రచారం..
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించక ముందే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నవారు ప్రచారం చేస్తున్నారు. తాము పోటీ చేస్తున్నామంటూ తమకు మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు తమ డివిజన్ల పరిధిలో సొంత నిధులతో అభివృద్ధిపనులు చేస్తుండగా, మరికొందరు తాము పొటీ చ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
Updated Date - 2020-12-12T05:05:03+05:30 IST