సింగరేణి సీఎండీ నియామకంపై ఉత్కంఠ.. నేటితో ముగియనున్న శ్రీధర్ పదవీకాలం
ABN, First Publish Date - 2020-12-31T05:12:25+05:30
సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీధర్ పదవీకాలం నేటితో ముగుస్తుండగా.. కొత్త సీఎండీని నియమిస్తారా..? లేదంటే మళ్లీ శ్రీధర్‌నే కొనసాగిస్తారా అనే విషయంపై సింగరేణిలో ఉత్కంఠ నెలకొంది.
కొనసాగింపుపై ‘జనరల్‌బాడీ’లో భిన్నాభిప్రాయాలు
వ్యతిరేకంగా ఓటేసిన కేంద్ర బొగ్గుగనుల శాఖ డిప్యూటీ కార్యదర్శి
వాటాదారులంతా అనుకూలంగా ఉండటంతో నెగ్గిన తీర్మానం
కొత్తగూడెం/ఇల్లెందు, డిసెంబరు 30: సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీధర్ పదవీకాలం నేటితో ముగుస్తుండగా.. కొత్త సీఎండీని నియమిస్తారా..? లేదంటే మళ్లీ శ్రీధర్‌నే కొనసాగిస్తారా అనే విషయంపై సింగరేణిలో ఉత్కంఠ నెలకొంది. సీఎండీ పదవీకాలం రెండు సంవత్సరాలే అయినా తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు చేసిన విజ్ఙప్తులతో పాటు సీఎండీగా శ్రీధర్ సింగరేణి కాలరీస్ ఉత్పత్తి, ఉత్పాకతల పెంపుదల, సంస్థను లాభాల బాటలో పయనింపచేయడంతో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో సింగరేణి ఖ్యాతిని ఇనుమడింపజేయడంతో రెండుసార్లు అయన పదవీకాలాన్ని పొడిగించారు. ఫలితంగా ఆరు సంవత్సరాలుగా సింగరేణి సీఎండీగా శ్రీధర్ కొనసాగుతున్నారు. అయితే శ్రీధర్ తన పదవీకాలంలో రాష్ట్రంలో అధికార పార్టీకి సన్నిహితంగా వ్యవహరించారని, ఫలితంగా సింగరేణిలో రాజకీయ, ప్రజాప్రతినిధుల జోక్యం పెచ్చుమీరిందని, సంస్థ నిధులను రాష్ట్ర ప్రభుత్వ పనులకు సైతం మళ్లించారని పలు కార్మికసంఘాలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో సీఎండీగా శ్రీధర్ పదవీ కాలాన్ని పొడగించాలని కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తులు అందినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. వాస్తవానికి సింగరేణిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు 49:51 శాతంగా ఉన్నాయి. వాటాదారులు 75శాతం ఆమోదంతో ఉమ్మడి నిర్ణయాల మేరకు సీఎండీ నియమకాల్లో ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే బుధవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి కాలరీస్ 99వ వార్షిక జనరల్‌బాడీ సమావేశంలో సింగరేణి సీఎండీగా ఎన్.శ్రీధర్‌ను తదుపరి ప్రభుత్వఆదేశాలు వచ్చే వరకు కొనసాగించాలని సింగరేణి బోర్డ్‌ఆఫ్‌డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమోదించడం గమనార్హం. కొన్ని కార్మికసంఘాలు సింగరేణి పరిణామాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులు, కేంద్రంలోని కొందరు మంత్రులదృష్టికి తీసుకెళ్లిన అంశాలు సీఎండీ నియమకాన్ని ప్రభావితం చేస్తాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద సింగరేణిని లాభాల బాటలో పరిగెత్తించిన సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ను తిరిగి కొనసాగిస్తారా? లేదంటే నూతనంగా వేరొకరిని నియమిస్తారా ? అనే అంశం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సీఎండీ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం..
సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగ్గా.. శ్రీధర్ కొనసాగింపుపై వాటాదార్లతో ఓటింగ్ జరిగింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ డిప్యూటీ కార్యదర్శి ఆల్కా శేఖర్ వ్యతిరేకంగా ఓటు వేసినట్టు సమాచారం. మిగతా వాటాదారులంతా శ్రీధర్‌కు మద్దతుగా అభిప్రాయం చెప్పడంతో ఈ తీర్మానం నెగ్గింది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం 51శాతం వాటాతో మెజారిటీతో వాటాదారుగా, కేంద్రం 49శాతం వాటాదారుగా ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తప్పనిసరి. ఈ క్రమంలో కేంద్రం ఆమోదం కూడా కీలకంగా మారనుంది.
వార్షిక ఖాతాలకు ఆమోదం..
సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించి జరిగిన 99వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ క్లీన్‌చిట్ సాధించిన వార్షిక ఖాతాలకు ఆమోదం లభించింది. అలాగే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 10శాతం డివిడెంట్ ఇవ్వాలన్న బోర్డు ప్రతిపాదనకు, చైర్మన్, డైరెక్టర్ల జీత భత్యాల చెల్లింపుపై కూడా బోర్డు నిర్ణయానికి జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆర్‌ఆర్. మిశ్రా, అజితేష్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియాలను కొనసాగించాలని గత బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన శాఖ సహాయ కార్యదర్శి జి. ఎల్లయ్య, కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర బొగ్గుశాఖ అండర్ సెక్రటరీ అల్కా శేఖర్, సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) ఎన్. బలరాం, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణరావు, కంపెనీ కార్యదర్శి సునితా దేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-31T05:12:25+05:30 IST