ధాన్యం ఆరబోతకు రైతుల పాట్లు..
ABN, First Publish Date - 2020-12-16T04:36:54+05:30
ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నిబంధనలు పాటించి అమ్మాలంటే కష్టం
వ్యాపారులకు అమ్మేందుకే అన్నదాతల ఆసక్తి
వాతావరణ మార్పుతో రైతుల్లో కలవరం
బోనకల్, డిసెంబరు 15: ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాని క్షేత్రస్థాయిలో రైతులు ధాన్యం ఆరబోతకు రోజుల తరబడి కష్టం చేయలేక, వేచి ఉండటానికి వీలుకాక ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిబందనలు పాటించి ధాన్యం అమ్మాలంటే రోజుల తరబడి అక్కడే ఉండటంతో ాటు వాతావరణ మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. దింతో ఎక్కువ మంది రైతులు కొనుగోలు కేంద్రాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో క్వింటా వరి ధాన్యంను ఏ గ్రేడ్ రూ. 1888, కామన్ గ్రేడ్ రూ.1868లకు కొనుగోలు చేస్తారు. వడ్లు ఆరబెట్టి కేంద్రానికి తీసుకువస్తే నిబందనల మేరకు 17శాతం లోపు వస్తే కొనుగోలు చేస్తారు. చలికాలం కావడంతో తేమశాతం తగ్గాలంటే పదిరోజులకు పైగా పడుతుందని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబెట్టడం పోగు వేయడం కత్తిమీద సాములా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పనికి వెళ్లకుండా రోజుల తరబడి ధాన్యం ఆరబోతకు సమయాన్ని కేటాయించాల్సి రావడంతో మిగిలిన వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుంది. వాతావరణ మార్పులతో పట్టాలు కప్పినా వర్షం పడితే తీరని నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ బాదలు పడలేక ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు 77 కేజీల బస్తాను 1100 నుంచి 1250 రూపాయలకు అమ్ముతున్నారు. బయట అమ్మినా పెద్దగా నష్టం ఉండటం లేదని రోజుల తరబడి కష్టం, వాతావరణ పరిస్థితుల మూలంగా ప్రైవేటుకు అమ్మాల్సి వస్తుందని రైతులు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో మాత్రం నాణ్యతతో తీసుకొచ్చిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేస్తున్నారు. తేమశాతం తక్కువగా ఉంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నిర్వాహాకులు తెలుపుతున్నారు.
Updated Date - 2020-12-16T04:36:54+05:30 IST