నిరాశ్రయులకు ఆశ్రయం
ABN, First Publish Date - 2020-03-16T12:36:26+05:30
అనాథలు, నిరాశ్రయులు, రాత్రిబస లేక బస్టాండ్, రైల్వే స్టేషన్లలో, ఫుట్‌పాత్‌లపై పడుకునేవారికి ఆశ్రయం ఇచ్చేందుకు
ఖమ్మంలో రూ.కోటి వ్యయంతో రాత్రి బస భవన నిర్మాణం
రాష్ట్రంలోనే తొలి భవనం
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఖమ్మం కార్పొరేషన్, మార్చి 15: అనాథలు, నిరాశ్రయులు, రాత్రిబస లేక బస్టాండ్, రైల్వే స్టేషన్లలో, ఫుట్‌పాత్‌లపై పడుకునేవారికి ఆశ్రయం ఇచ్చేందుకు నగరంలో రాత్రిబస భవనాన్ని నిర్మిం చారు. ఈ భవనాన్ని ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి సారిగా ఖమ్మంలో రాత్రిబస (నైట్‌షెల్టర్) భవనాన్ని నిర్మించారు. రూ.కోటి వ్యయంతో రాత్రిబస భవనాన్ని నిర్మించగా, మునిసిపల్ సాధారణ నిధులు రూ.72 లక్షలు కేటాయించగా, కలెక్టర్ మరో రూ.28లక్షలు కేటాయించారు. ఈ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలోనే తొలి భవనం
రాష్ట్రంలోనే తొలిసారిగా రాత్రిబస భవనాన్ని నిర్మించారు. అనాథలకు, మతిస్థిమితంలేని వారికి. యాచకులకు, అలాగే రాత్రివేళ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అలాగే ఫుట్‌పాత్‌లపై నిద్రించే అభాగ్యు లకు ఆశ్రయం కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆ మేరకు ఖమ్మంలో రాత్రిబస భవన నిర్మా ణాన్ని ఏర్పాటుచేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు రెవెన్యూ అధికారులు ఖమ్మం నగరంలో రాత్రిపూట ఫుట్‌పాత్‌లపై ఎంతమంది నిద్రిస్తున్నారో లెక్కలు తీశారు. సుమారు మూడువందల మంది నిరాశ్రయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అనుమతితో ఖమ్మం బైపాస్‌రోడ్‌లో రూ.కోటి వ్యయంతో రాత్రిబస భవనాన్ని రెండంతస్తులతో నిర్మించారు.
300 పడకలు ఏర్పాటు
రాత్రిబస భవనంలో 300పడకలను ఏర్పాటు చేశారు. మహిళలకు మొదటి అంతస్తులో 150 పడకలు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో పురుషులకు 150 పడకలు ఏర్పాటుచేశారు. మొత్తం 12 బాత్‌రూంలను నిర్మించారు. వాటర్‌ట్యాంకు, వంటగది షెడ్‌లను నిర్మించారు. ఇక్యడే వంటచేసుకునే సౌకర్యం ఉంది. రాత్రి ఆశ్రయం పొందేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుచేశారు. అంతేకాకుండా ఆశ్రయం పొందేవారు ఆహ్లాదం పొందేందుకు పార్కును కూడా ఏర్పాటు చేశారు.
అన్నం సేవాఫౌండేషన్ నిర్వహణలో..
అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాత్రిబస నిర్వహణ చూడనున్నారు. మొత్తం 300మందికి ఈ సంస్థ ద్వారా భోజనాన్ని అందించనున్నారు. నగరం లోని యాచకులు, నిరాశ్రయులకు ఈ భవనంలో రాత్రిబస కల్పిస్తారు. ఫుట్‌పాత్‌లపై పడుకోకుండా అన్ని సౌకర్యాలు ఉన్న ఈ భవనంలో రాత్రివేళ నిద్రించవచ్చు. ఉదయం వెళ్లి తమ పనులు చూసుకొని, రాత్రి ఈ భవనంలో ఉండవచ్చు. ఈ నిరాశ్రయులకు అన్నం సేవా ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందిస్తారు.
Updated Date - 2020-03-16T12:36:26+05:30 IST