ఆగని బెల్టుజోరు
ABN, First Publish Date - 2020-12-31T05:20:57+05:30
ఒకరో, ఇద్దరో అధికారులు రూల్స్ పాటిస్తూ బెల్టును అరికట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు మాత్రం వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో బెల్టును ప్రోత్సహిస్తున్నారు.
రూ.20 అదనంగా అమ్ముతున్న వైనం
మద్యం ప్రియుల జేబుకు చిల్లు
అధికారులే రేటు పెంచమన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
నూతన సంవత్సర వేడుకలకు మరింత ధర పెంపు
సమాంతర వ్యవస్థ నడుపుతున్న వైన్స్ నిర్వాహకులు
నిర్ణీత దుకాణాల మద్యమే బెల్టుషాపుల్లో అమ్మాలట !
నిర్వాహకులకు హుకుం జారీ చేస్తున్న అధికారులు
ఖమ్మం కమాన్‌బజార్, డిసెంబరు 30: ఒకరో, ఇద్దరో అధికారులు రూల్స్ పాటిస్తూ బెల్టును అరికట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు మాత్రం వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో బెల్టును ప్రోత్సహిస్తున్నారు. ‘ నిబంధనలు పెట్టే అధికారిని పంపిస్తున్నాం .. ఇకపై రోజున్నీ మనవే. ఎక్కువ రేట్లకు అమ్ముకోండి.. మేము ఉన్నాం.. ’ అంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. బెల్టు నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఆయా ప్రాంతాల్లో దుకాణాల ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని, బయట నుంచి మద్యం తెచ్చుకుంటే దాడుల్లో పట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంటే అధికారులకు మద్యం వ్యాపారులు ఎంత ముట్టజెబుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈనెల ఆఖరుకు ఎక్సైజ్‌శాఖలో ప్రమోషన్‌లతో కూడిన బదిలీలు ఉన్నాయి. ఆబదిలీల్లో మనకు అడ్డువచ్చే అధికారులు వెళ్లిపోతున్నారు. అప్పటి నుంచి అంతా తమదే రాజ్యం అంటూ వ్యాపారులకు పలువురు అధికారులు ఊతం ఇస్తున్నారు. అంటే నెలవారి మామూళ్ల మత్తు ఎంత ఉందో అని పలువురు అంటున్నారు.
అధికారులే రేటు పెంచమన్నారు
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఖమ్మం టుటౌన్ పరిధిలో ఓ మద్యం దుకాణానికి బెల్టు నిర్వాహకుడు వెళ్లాడు. గతంలో పై అధికారి సూచనల మేరకు బెల్టుకు సైతం ఎమ్మార్పీకి ఇచ్చారు. ప్రస్తుతం అంతా రేటు పెంచారు. అయితే సదరు వ్యక్తి ఎందుకు రేటు పెంచారు అని నిలదీశాడు. దీంతో మద్యం దుకాణాల్లో ఉన్న సిబ్బంది ‘ ఇక్కడ మేడమే రేటు పెంచమన్నారు. డీసీతో తమకు సంబంధం లేదు .. ఇక్కడ అంతా మేడమే’ అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అంటే యాజమాన్యంకు అధికారులు ఎంత అండగా ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈవీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికారుల బాగోతం అంతా బట్టబయలు అయింది. వారి కాసుల కక్కుర్తి అంతా నేరుగా వీక్షిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకలకు మరింత పెంపు
న్యూ ఇయర్ జోష్ అంతా మద్యంతోనే ఉంటుంది. ఇదే అదునుగా భావించి మద్యం వ్యాపారులు కౌంటర్ సేల్ కంటే బెల్టుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించవద్దని ఖచ్చితమైన ఆదేశాలు ఉండటంతో పట్టణ పరిధిలో కాకుండా గ్రామీణ ప్రాంతాలకు అంతా తరలనున్నారు. ఈక్రమంలో బెల్టు జోరును ముందే పసిగట్టిన వ్యాపారులు ఇష్టానుసారంగా లిక్కర్‌ను గ్రామీణ ప్రాంతాల్లో డంపు చేస్తున్నారని పలువురు అంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎంత రేటు అయిన పర్వాలేదనే ఆలోచనలో మద్యంప్రియులు ఉంటారని, దీన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా అమ్ముతున్నారని పలువురు అంటున్నారు.
అంతా బెల్టుతోనే
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మార్పికే మద్యం అమ్మాల్సి ఉంది. అయితే బెల్టు షాపులను రెవెన్యూ పడిపోకుండా ప్రభుత్వం అనధికారికంగానే నిర్వహిస్తోందని పలువురు అంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ప్రియులు మండల జిల్లా కేంద్రాలకు వచ్చి లిక్కర్ కొనుగోలు చేయని పరిస్థితి ఉండటంతో బెల్టుకు ఒకింత అనధికార అనుమతులు ఉన్నట్లే అని అంటున్నారు. అయితే కొంత మంది అధికారులు దుకాణానానికి వచ్చిన వారికైనా, బెల్టు నిర్వాహకులకైనా ఎమ్మార్పీకే అమ్మాలని హుకుం జారీ చేశారు. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి కొంతకాలం బెల్టుకు మద్యం సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం క్వార్టర్‌కు రూ.20 పెంచి విక్రయిస్తున్నారు. కౌంటర్ సేల్ కంటే బెల్టు ద్వారానే ఎక్కువ మందు అమ్ముతూ రూ.కోట్లు గడిస్తున్నారు. దుకాణాల్లో దొరకని బ్రాండ్ బెల్టు దుకాణాల్లోనే ఎక్కువగా దొరుకుతుండటంతో వారి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు 20రూపాయలు అదనంగా అమ్ముతుంటే బెల్టు దుకాణదారులు మరో 30రూపాయలు కలుపుకొని ఒక్కో క్వార్టర్‌కు 50రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయని పలువురు అంటున్నారు.
మద్యం దుకాణాదారులే ఎక్సైజ్ సిబ్బంది
మద్యం దుకాణదారులే ఎక్సైజ్ అధికారుల్లా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. మద్యం దుకాణదారులు ఏరియాలు పంచుకొని లిక్కర్‌ను సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో ఆయా గ్రామాల పరిధిలో ఉన్న వ్యాపారులు బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి వేరే ప్రాంతంలో కొనుగోలు చేసిన మందును స్వాధీనం చేసుకొంటున్నారు. ఎదురు తిరిగిన వారిపై అధికారులతో దాడులు చేయిస్తున్నారు. పై అధికారులు చెప్పినట్టు కాకుండా వ్యాపారుల చేతిల్లో కీలుబొమ్మలుగా స్థానిక అధికారులు మారారు అంటే అతిశయోక్తి కాదు. అధికారుల జేబులు నింపుకోవటం కోసం మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారని పలువురు అంటున్నారు. బెల్టు ద్వారా ప్రభుత్వానికి అదాయం వస్తుందనన్న ఏకైక కారణంతో అధికారులు ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నప్పటికి పట్టించుకోవటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు ఎంత ఎక్కువ ధరకు అమ్మితే అధికారుల జేబులు అంతగా నిండుతాయని, అందుకే అధికారులు మిన్నుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారికి జీతాల కంటే మామూళ్లే ఎక్కువగా వస్తుండటంతో వ్యాపారుల అక్రమాలకు అండగా ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
అంజన్‌రావు, డిప్యూటీ కమీషనర్, ఖమ్మం
ఓ అధికారి ఆదేశాలమేరకే మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నట్టు వైరల్ అవుతున్న వీడియోపై విచారణకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా ఎక్సైజ్ అధికారి సోమిరెడ్డి విచారణ చేసిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. మద్యం అధిక ధరలకు అమ్మవద్దని ఆదేశాలు ఉన్నాయి. ఎవరికైనా ఎమ్మార్పీకి విక్రయించాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2020-12-31T05:20:57+05:30 IST