బీసీ కమిషన్ వర్సెస్ అధికారులు
ABN, First Publish Date - 2020-09-14T10:16:06+05:30
గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితుల విషయంలో జాతీయ బీసీ కమిషన్ తరచూ కలెక్టర్‌తో సహా నగరపాలక కమిషనర్‌కు నోటీసులు
గోళ్లపాడు నిర్వాసితులకు సౌకర్యాలపై ఆరా
విచారణకు హాజరు కావాలని కలెక్టర్, కమిషనర్‌కు బీసీ కమిషన్ నోటీసులు
ఖమ్మం కార్పొరేషన్, సెప్టెంబర్ 13: గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితుల విషయంలో జాతీయ బీసీ కమిషన్ తరచూ కలెక్టర్‌తో సహా నగరపాలక కమిషనర్‌కు నోటీసులు ఇవ్వటం, విచారణకు హాజరు కావాలంటూ తాఖీదులు పంపటం చర్చాంశనీయమైంది. నిర్వాసితులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా వారి ఇళ్లను తొలగిస్తున్నారంటూ. బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజ్ ఆచారి ఆగ్రహం వ్యక్తం చేసి, కలెక్టర్, సీపీ, ఆర్‌డీవో, నగరపాలక సంస్థ కమిషనర్ తన ఎదుట హాజరు కావాలని గతంలో నోటీసులు జారీచేశారు. అయితే ఈ విచారణకు కలెక్టర్ హాజరు కాకపోవటం, సమాచారం అందించని సీసీలపై చర్యలు తీసుకోవటం సంచలనం కలిగించింది.
తాజాగా 15వ తేదినాడు (మంగళవారం) ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరు కావాలని కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్‌కు, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతికు బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి నోటీసులు పంపారు. మొత్తానికి గోళ్లపాడు నిర్వాసితుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం బీసీ కమిషన్ వర్సెస్ అధికారులుగా మారి, చర్చాంశనీయమయింది.
అసలేం జరిగిందంటే..
గోళ్లపాడు ఆధనీకరణ పనులకు ఆక్రమణలు అడ్డుగా నిలిచాయి. దీంతో 41,42,43,44 డివిజన్ల పరిధిలో గోళ్లపాడు ఛానెల్‌ను ఆక్రమించి. ఏర్పాటు చేసిన ఇళ్లను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు..ఈ నేపథ్యంలో తమకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే ఇళ్లను తొలగించాలని నిర్వాసితులు బీజేపీ నేతల ఆధ్వర్యంలో బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి స్యయంగా ఖమ్మం వచ్చి, గోళ్లపాడు నిర్వాసితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అయితే నిర్వాసితులకు స్థలాలు కేటాయించి, మౌలిక వసతులను ఏర్పాటు చేసిన తరువాతే ఇళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాగా వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సుమారు 650 మంది నిర్వాసితులకు స్థలాలు చూపించి, ఆక్రమణలను తొలగించటం ప్రారంభించారు. కాగా నిర్వాసితురాలైన ఒక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందటం, బీసీ కమిషన్ ఎదుట విచారణకు కలెక్టర్ హాజరు కాకపోవటం, కేటాయించిన స్థలాల్లో సౌకర్యాలు లేకపోవటం బీసీ కమిషన్‌కు ఆగ్రహం తెప్పించింది. అందుకే మంగళవారం ఢిల్లీకి రావాలని కలెక్టర్, నగరపాలక కమిషనర్‌కు నోటీసులులలు అందాయి.
తాజాగా..
బీసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపధ్యంలో గోళ్లపాడు నిర్వాసితులకు వెలుగుమట్ల రెవెన్యూ పరిఽధిలో కేటాయించిన స్థలాల్లో విద్యుత్‌సౌకర్యం. మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటికే కొందరు నిర్వాసితులు తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. తాము కల్పించిన మౌలిక సదుపాయాల వివరాలను అధికారులు బీసీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
Updated Date - 2020-09-14T10:16:06+05:30 IST