యాసంగికి ఎస్సారెస్పీ నీరు
ABN, First Publish Date - 2020-11-10T09:49:14+05:30
వానాకాలం పంటలు పూర్తి కావస్తుండడంతో రైతులు యాసంగిపై దృష్టి కేంద్రీకరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈసారి పూర్తి స్థాయిలో నీటిని అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. నాలుగు రోజుల క్రితం
డిసెంబరు 15 నుంచి విడుదలకు ఏర్పాట్లు
ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు
(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)
వానాకాలం పంటలు పూర్తి కావస్తుండడంతో రైతులు యాసంగిపై దృష్టి కేంద్రీకరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈసారి పూర్తి స్థాయిలో నీటిని అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సాగునీటిపై సుదీర్ఘంగా చర్చించారు. డిసెంబరు 15 నుంచి మార్చి 31 వరకు సాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
శివం కమిటీ సమావేశం
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శివం కమిటీ సమావేశంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టంతో పాటు నీటి విడుదలపై ఉన్నతాధికారుల కమిటీ సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్న దృష్ట్యా ఆయకట్టు చివరికి నీరు అందేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందాలని ఈఎన్సీ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇందుకు సంబంధించిన మినిట్స్ జారీ కానున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద ఎల్‌ఎండీ ఎగువ, దిగువ ప్రాంతాలు కలిపి 9.60 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతాల్లో కాకతీయ కాలువతో పాటు లక్ష్మి, సరస్వతి కాలువల కింద దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే ఎల్‌ఎండీ దిగువ ప్రాంతాల్లో దాదాపు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. మొత్తం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఉన్న ఆయకట్టు ప్రాంతానికి డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. వారబంధీ పద్ధతిలో మార్చి 31 వరకు నీటిని విడుదల చేస్తారు. ఎనిమిది రోజులు నీటిని విడుదల చేసి, ఏడు రోజుల పాటు నిలిపివేస్తారు. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న దాదాపు కోతలు పూర్తి కాగా, వరి పంట కోతలు ఊపందుకున్నాయి.
నిండుకుండలా శ్రీరాంసాగర్
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది. అక్టోబరు 29న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం లేదు. జూన్ 1 నుంచి ప్రాజెక్ట్‌లోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చింది. ప్రాజెక్ట్ నిండటంతో దాదాపు 227.46 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. దీనికితోడు శ్రీపాద ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ నుంచి ఎల్‌ఎండీకి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాలువపై నిర్మించిన పంపుహౌస్‌లు కూడా నిండా నీటితో ఉన్నాయి.
ప్రతి ఎకరాకు నీరందిస్తాం..శంకర్, ఎస్‌ఈ, ఎస్సారెస్పీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేయాలని హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రాజెక్ట్‌లో నీరు ఉన్న దృష్ట్యా ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. మార్చి 31 వరకు నీరు వస్తుంది. ఆ విధంగా రైతులు పంటలు వేసుకోవాలి. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తాం. కొద్ది రోజుల్లోనే మినిట్స్ రూపొందిస్తాం.
Updated Date - 2020-11-10T09:49:14+05:30 IST