ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌చార్జీల పాలన..

ABN, First Publish Date - 2020-10-04T09:58:14+05:30

జిల్లాలో కలెక్టర్‌తో పాటు పలు కీలక శాఖల అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జీల పాలన కొనసాగుతున్నది. ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సహా చాలా పోస్టులు ఖాళీ

పరిపాలనాపరంగా ఇబ్బందులు

పదవీ విరమణలకు కేరాఫ్‌గా మారిన జిల్లా


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కలెక్టర్‌తో పాటు పలు కీలక శాఖల అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జీల పాలన కొనసాగుతున్నది. ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను నియమించకపోవడంతో పాలనాపరంగా వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లా అధికారుల పదవీ విరమణలకు కేరాఫ్‌గా మారింది. పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటైన నాటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడి నుంచే పదవీ విరమణ పొందడం గమనార్హం. అతి కీలకమైన కలెక్టర్‌ పోస్టు గత రెండున్నర నెలల నుంచి ఖాళీగా ఉన్నది. ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన సిక్తా పట్నాయక్‌ జూలై 15వ తేదీన అనూహ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఆమె కేవలం ఐదున్న మాసాలు మాత్రమే ఇక్కడ పని చేశారు. ఆమె స్థానంలో మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళీకేరికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె వారంలో మూడు, నాలుగు రోజులు జిల్లాకు వచ్చి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన పల్లె ప్రగతి, ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరో అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ రెవెన్యూ పనులు, పౌరసరఫరాలను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ రాజన్న, జిల్లా సహకార శాఖాధికారి సి చంద్రప్రకాష్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వి సుదర్శన్‌ ఒకేరోజు పదవీ విరమణ పొందారు.


డీపీఓగా అదనపు బాధ్యతలను జడ్పీ డిప్యూటీ సీఈఓ గీతకు అప్పగించారు. అసలు జడ్పీకే పూర్తిస్థాయి సీఈఓ లేరు. డిప్యూటీ సీఈఓనే సీఈఓగా వ్యవహరిస్తున్నారు. దానికితోడు డీపీఓ అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి పోస్టు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పోస్టు, మిషన్‌ భగీరథ ఈఈ పోస్టు, రోడ్లు, భవనాల శాఖ ఈఈ పోస్టు, నీటి పారుదల శాఖ ఈఈ పోస్టు, బీసీ సంక్షేమాధికారి పోస్టు, జిల్లా వైద్యాధికారి పోస్టు, జిల్లా పరిశ్రమల శాఖ డీఎం, డీపీఆర్‌ఓ పోస్టు తదితర శాఖల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా విద్యా శాఖకు కూడా రెగ్యులర్‌ అధికారి లేరు. డైట్‌ లెక్చరర్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు.


ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖలకు, బీసీ సంక్షేమ శాఖకు కరీంనగర్‌ ఈఈలు, బీసీ సంక్షేమ అధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వైద్య శాఖాధికారిగా ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ అదనపు బాధ్యతలను అప్పగించారు. పశుసంవర్థక శాఖ, సహకార శాఖలకు ఇంకా ఇన్‌చార్జీలను నియమించలేదు. జిల్లాలో రెగ్యులర్‌ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఏర్పాటైన నాటినుంచి డీఆర్‌ఓ పోస్టు ఖాళీగానే ఉంటున్నది. చాలామంది అధికారులు పదవీ విరమణ పొందడం, ఆయా శాఖల్లో సీనియర్లకు పదోన్నతులు కల్పించకపోవడం, నూతన నియామకాలు చేపట్టని కారణంగా చాలా పోస్టులు ఖాళీ అవుతున్నాయి. దీంతో పరిపాలనపరంగా పనులు ముందుకు సాగడం లేదు. ఇంజినీరింగ్‌ శాఖల్లో ఇన్‌చార్జీల పాలనతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. పనుల నాణ్యతను పట్టించుకునే వారే లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నాసిరకంగా చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.


పదవీ విరమణలకు కేరాఫ్‌..

అధికారుల పదవీ విరమణలకు జిల్లా కేరాఫ్‌గా మారింది. ఇక్కడ జేసీలుగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి 8 మాసాల పాటు ఇన్‌చార్జీ కలెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన తర్వాత జేసీగా వచ్చిన వనజాదేవి పదవీ విరమణ పొందినా కూడా 6 మాసాల పాటు ఆమె పదవిని పొడిగించారు. పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ రాజేంద్రకుమార్‌, డీపీఆర్‌ఓ రాజేశ్వర్‌రెడ్డి, మంథని ఆర్‌డీఓ పద్మయ్య, బీసీ సంక్షేమ శాఖాధికారి దామోదర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ తిరుపతిరావు, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్‌రావు, డీఈఓగా చేసిన వెంకటేశ్వర్‌రావు, పరిశ్రమల అధికారి ప్రేమ్‌కుమార్‌ తదితర శాఖాధికారులు పదవీ విరమణ పొందారు. పోలీస్‌ శాఖలో డీసీపీలుగా పనిచేసిన విజేందర్‌రెడ్డి, తాళ్లపెల్లి సుదర్శన్‌గౌడ్‌, పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌లు పదవీ విరమణ పొందారు. డీసీపీ పోస్టు వెంటనే భర్తీ అయినప్పటికీ పెద్దపల్లి ఏసీపీ మూడు నెలలుగా ఖాళీగా ఉండగా, గోదావరిఖని ఏసీపీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద జిల్లాలోని చాలాశాఖల్లో అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిని ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందో వేచిచూడాల్సిందే. 

Updated Date - 2020-10-04T09:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising