కరీంనగర్‌లో సన్నాలు కొన్నది 1.46లక్షల టన్నులే!
ABN, First Publish Date - 2020-12-12T05:11:46+05:30
వరిధాన్యం కొనుగోలు లక్ష్యం సగం వరకు పూర్తి కాకున్నా అప్పుడే పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తున్నారు.
కొనుగోలు అంచనా 18.79 లక్షల టన్నులు
కొన్నది 7.24 లక్షల టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,367.58 కోట్లు
కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్ల నిలిపివేత
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వరిధాన్యం కొనుగోలు లక్ష్యం సగం వరకు పూర్తి కాకున్నా అప్పుడే పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్దేశించుకున్న ధాన్యం సేకరణ లక్ష్యంలో 40 శాతం కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 18.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనావేసిన ప్రభుత్వం అందుకు వివిధ ఏజెన్సీలను సిద్ధం చేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 7.24 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు మాత్రమే పూర్తయింది. అంచనా వేసిన ధాన్యంలో మరో 60 శాతం ఇంకా కొనుగోలు చేయాల్సి ఉన్నా అప్పుడే కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలోనే చూసినా 337 కొనుగోలు కేంద్రాలకుగాను 136 కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలం 4,88,200 మెట్రిక్ టన్నుల వరిధాన్యం, జగిత్యాల జిల్లాలో 6,28,853 మెట్రిక్ టన్నుల వరిధాన్యం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,10,001 మెట్రిక్ టన్నుల వరిధాన్యం, పెద్దపల్లి జిల్లాలో 4,52,104 మెట్రిక్ టన్నుల వరిధాన్యం మొత్తంగా 18,78,958 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 2,21,537 మెట్రిక్ టన్నులు, జగిత్యాల జిల్లాలో 2,21,238 మెట్రిక్ టన్నులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,42,249 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 1,39,329 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఈ మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం నిర్ణీత లక్ష్యంలో 39 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు 1367 కోట్ల 58 లక్షల రూపాయల విలువ చేసే వరిధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో వెయ్యి కోట్ల రూపాయల మేరకు రైతులకు చెల్లించారు. అయితే ఒకవైపు ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్‌కు రావాల్సి ఉన్నా మరోవైపు కొనుగోలు కేంద్రాలను మాత్రం మూసేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 62 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 37 కేంద్రాలను, 220 ప్రాథమిక సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో 74 కేంద్రాలను, 47 డీసీఎంఎస్ కేంద్రాల్లో 25 కేంద్రాలను మూసేశారు. మార్కెట్‌కు ధాన్యం రాని కారణంగా ఆయా కొనుగోలు కేంద్రాలను మూసేశామని సంబంధిత ఏజెన్సీ వర్గాలు చెబుతుండగా రైతులు మాత్రం ఇంకా ధాన్యం తమ వద్దే ఉందని, కొనుగోళ్లు పూర్తికాకుండానే కేంద్రాలను మూసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సన్నధాన్యం అమ్మకాలు అంతంతే
వరిసాగులో సగం సన్నరకాలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఉమ్మడి జిల్లా పరిధిలో 40 శాతం సన్నరకాలను సాగు చేశారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యంలో విత్తనాల పంట సంబంధిత కంపెనీలకు నేరుగా వెళ్తుంది. రైతులు స్వంత అవసరాలకు కొంత ధాన్యాన్ని మినహాయించుకోగా మిగిలిన 18,75,958 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు. ఇందులో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవరిధాన్యం ఉంటుందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 7,24,347 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో కేవలం 1,46,393 మెట్రిక్ టన్నులు మాత్రమే సన్నరకం వరిధాన్యం ఉన్నది. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇది కేవలం 20 శాతం మాత్రమే. సన్నవరిధాన్యాన్ని సాగు చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి మద్దతు ధరతోపాటు కొంత అదనపు ధరను కూడా చెల్లించే దిశగా ఆలోచిస్తున్నామని కొడగండ్ల రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. మరోవైపు సన్నరకాలకు క్వింటాలుకు 2500 రూపాయలు చెల్లించాలని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడంతో రైతుల్లో ధర పెరుగుతుందోమోనన్న ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ కారణంగా ఇంకా సన్నరకం వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం లేదని భావిస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు, కౌలు రైతులు డబ్బు అత్యవసరమైన వారు మాత్రమే సన్నవరిధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అంతకంటే తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తుండడంతో రైతులు సన్నధాన్యాన్ని అమ్మేందుకు ఇబ్బంది పడాల్పి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో కరీంనగర్ జిల్లాలో 59,586 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 58,600 మెట్రిక్ టన్నులు, జగిత్యాల జిల్లాలో 12,714 మెట్రిక్ టన్నులు, సిరిసిల్ల జిల్లాలో 15,452 మెట్రిక్ టన్నుల సన్నరకాలున్నాయి. మార్కెట్‌కు సుమారు 8 లక్షల మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం వస్తుందని ఆశించగా ఇప్పటికీ లక్షా 46 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. మరో ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంటుందని అంచనా వేస్తుండగా ఆ ధాన్యంలో ఇప్పటికే 30 నుంచి 40 శాతం మేరకు గ్రామాల్లోనే రైస్ మిల్లర్లకు విక్రయించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏది ఏమైనా సన్నవరి సాగు చేయమన్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధరకు అనుబంధంగా బోనస్ ధర చెల్లించక తమను నిలువునా ముంచిందని, దొడ్డు వరి రకంతో పోలిస్తే ఎకరాకు 5 క్వింటాళ్ల మేరకు దిగుబడి తక్కువ రావడమే కాకుండా పెట్టుబడి కూడా ఎక్కువైందని, ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున నికరంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోనస్ ధర ప్రకటించడంలో ఎఫ్‌సీఐ నిబంధనలు ఆటంకంగా ఉన్నందున రైతుబంధు సాయం మాదిరిగా సన్నవరి రకాలను సాగు చేసిన తమకు ఎకరాకు కనీసం 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించించాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2020-12-12T05:11:46+05:30 IST