ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత

ABN, First Publish Date - 2020-12-30T04:42:14+05:30

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన నిబంధనను ఎత్తివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దరఖాస్తు దారులకు ఊరట 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక  నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన నిబంధనను ఎత్తివేసింది.  ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్లాట్ల, నిర్మాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న  1,12,882 మందికి ఊరట లభించింది.  ఈమేరకు మంగళవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మెమో నంబర్‌ జీ/2/257/2019, తేదీ 29.12.2020 ద్వారా సంబంధితశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ప్లాట్లు, నిర్మాణాలకు సంబంధించిన రిజిస్టేషన్లకు అడ్డంకులు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతి లేని, క్రమబద్ధీకరించని కొత్త ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరించిన ప్లాట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొత్త ప్లాట్లకు సంబంధిత సంస్థల అప్రూవల్‌ పొందిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించింది. 


  ఊపందుకోనున్న రిజిస్ట్రేషన్లు


సెప్టెంబరు 1 నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానున్నది. అక్రమ, అనధికార ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 1న ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)ను అమల్లో తెచ్చింది. ఇదే చివరి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయమని, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 1,12,882 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి చేయడం,  రుసుము లక్షల్లోనే ఉండడంతో కొందరు ఎల్‌ఆర్‌ఎస్‌ను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దరఖాస్తులన్నిటినీ పెండింగ్‌లో పెట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్తంభించింది. అవసరాల కోసం ప్లాట్లను అమ్ముకునేందుకు యజమానులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌పై విమర్శలు వెల్లువెత్తడం, ప్రతిపక్ష్యాలు, రియల్టర్లు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను ఎత్తివేసింది. 


 ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 1,12,882 మంది దరఖాస్తు: 


ఉమ్మడి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 1,12,882 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో కరీంనగర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు 14 మున్సిపాలిటీల్లో వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వానికి కోటి 12 లక్షల ఆదాయం వచ్చింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో అత్యధికంగా 26,777 మంది దరఖాస్తు చేసుకోగా, రామగుండం కార్పొరేషన్‌లో 7,074 మంది దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి జిల్లా మంథని లో అతి తక్కువగా 899 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

- కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మున్సిపాలిటీలో 1,467 మంది, హుజురాబాద్‌లో 3,969, జమ్మికుంటలో 5,902, కొత్తపల్లిలో 2,660 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

- పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీలో 9,758 మంది, సుల్తానాబాద్‌లో 1,534 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలో 7,978 మంది, కోరుట్ల మున్సిపాలిటీలో 9,154, మెట్‌పల్లిలో 5,958, ధర్మపురిలో 1,008, రాయికల్‌ మున్సిపాలిటీలో 1,893 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,486 మంది, వేములవాడ మున్సిపాలిటీలో 16,886 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీ చేయక పోవడంతో దరఖాస్తు దారులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను ఎత్తివేయడంతో వారంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులతో కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, మిగిలిన మున్సిపాలిటీలకు కూడా కోట్లలోనే ఆదాయం వస్తుందని అధికారులు భావించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆదాయం నిలిచి పోనుంది. ఇప్పటికే ఒక్కో దరఖాస్తు దారుడు వెయ్యి రూపాయల చొప్పున ఫీజులు చెల్లించారు. వీరికి ఫీజులు ప్రభుత్వం వాపస్తు ఇస్తుందో లేక ఫీజులను తగ్గించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తుందో వేచి చూడాలని అధికారులు చెబుతున్నారు. 

 

Updated Date - 2020-12-30T04:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising