రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
ABN, First Publish Date - 2020-12-30T05:28:12+05:30
సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 28: సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అన్ని లోపాలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో నియంత్రణ సాగును నిర్బంధంగా అమలు చేశారని, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని అన్నారు. వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చిన మిషన్ భగీరథతో ఏ ఒక్కరూ నీరు తాగే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ పేరిట ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డిలో లక్షల కోట్లతో రెండు ప్రాజెక్ట్‌లు తీసుకొస్తే ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదన్నారు. ధరణికి అతీగతి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతును ఇచ్చిందని, మంత్రులు రోడ్లపైన బైఠాయించి ధర్నాలు, రాస్తారోకోలు చేశారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర వ్యవసాయ కొత్త చట్టాలు బాగున్నాయంటూ యూటర్న్ తీసుకోవడంలో మతలబ్ ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను, రైతులను మోసం చేస్తూ ముఖ్యమంత్రి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపి జైల్లో వేస్తుందనే భయంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీరుతో రైతులు పంటలు నష్టపోయి తగలబెట్టుకునే పరిస్థితులు రాష్ట్రంలో రావడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా, రైతు వ్యతిరేఖ విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందని, రైతులకు వెన్నుదండుగా ఉంటుందని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:28:12+05:30 IST