కాళేశ్వరం మూడో టీఎంసీకి బ్రేక్?
ABN, First Publish Date - 2020-12-16T05:11:18+05:30
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులు వివాదంలో ఇరుక్కున్నాయి.
అనుమతులు లేవని కేంద్రం కొర్రి
కోటిలింగాల వద్ద పనులు ఆగేనా?
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులు వివాదంలో ఇరుక్కున్నాయి. అనుమతులు లేకుండానే మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకు నిర్మాణ పనులు చేపట్టారని కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వివరాలు పంపించాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం కన్నెపల్లి, అన్నారం, గోలివాడ పంపుహౌస్‌ల వద్ద 14 పంపులను బిగించడంతోపాటు సివిల్ పనులు కూడా పూర్తయ్యాయి. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ వరకు నీటిని తరలించేందుకు వీలుగా కాలువ తవ్వకంతోపాటు పైపులైన్ వేయాల్సి ఉన్నది. ఈ దశలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడం దానిపై కేంద్ర జలవనరులశాఖ దృష్టి సారించి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనుల పరిస్థితి ప్ర శ్నార్థకంగా మారింది. మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకే అనుమతులు లేవని, కేంద్రానికి సమాచారమే లేకుండా ఈ పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కోరడంతో ఇప్పటికైతే ఈ పనులకు బ్రేక్ పడ్డట్లేనని భావిస్తున్నారు.
ఎగువ ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు..
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీరు ఎత్తిపోస్తూ 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించడంతోపాటు మరో 18.50 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో లక్ష్మీ బ్యారేజీని, అన్నారం వద్ద 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సరస్వతి బ్యారేజీని, సిరిపురం వద్ద 8.83 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పార్వతి బ్యారేజీని నిర్మించింది. వీటికి అనుబంధంగా కన్నెపల్లి, అన్నారం, గోలివాడల వద్ద పంపుహౌస్‌ల నిర్మాణాన్ని పూర్తిచేసి విజయవంతంగా నీటి ఎత్తిపోసే కార్యక్రమాన్ని కూడా పూర్తిచేసింది. మల్లన్నసాగర్ వరకు నీటి తరలింపు ప్రక్రియ విజయవంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మరో టీఎంసీ నీటిని అదనంగా తరలించడం ద్వారా రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలన్నింటికి నీటిని అందించవచ్చని భావించిన ప్రభుత్వం అందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు 35 వేల కోట్ల రూపాయలు ఇందుకు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
పంపుహౌస్‌లలో అదనపు మోటార్లు
మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంపుహౌస్‌లో కొత్తగా ఐదు మోటార్లు, అన్నారం పంపుహౌస్‌లో నాలుగు, గోలివాడ పంపుహౌస్ వద్ద ఐదు మోటార్లను బిగించారు. ఇందుకు సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయి. ఈ పంపుహౌస్‌ల వెట్ రన్ పూర్తి చేశారు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ వరకు మూడో టీఎంసీ నీటిని తరలించే పనులు చేపట్టాల్సి ఉన్నది.
కోటిలింగాల వద్ద మరో పంప్‌హౌస్ నిర్మాణం
శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంటే ధర్మపురి వరకు గోదావరి నిండుగా ఉంటుంది. కోటిలింగాల-వెల్గటూర్ మధ్య గుట్టల వద్ద నిల్వ ఉన్న గోదావరి నీటిని తరలించేందుకు పంపుహౌస్ నిర్మాణం చేపడితే అనువుగా ఉంటుందని భావించారు. ఇక్కడ కొత్త పంపుహౌస్ నిర్మాణం చేపట్టి కోటిలింగాల నుంచి దేవికొండ(పెగడపల్లి), నామాపూర్ మీదుగా కోట్లనర్సింహులపల్లి(గంగాధర) వరకు నీటిని తీసుకవెళ్లి వరద కాలువలో 95వ కిలోమీటర్ వద్ద వదలాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మిడ్ మానేరుకు కాలువ ద్వారా నీరు వెళ్లే అవకాశం కలుగుతుంది. కోటిలింగాల, వెల్గటూర్ గుట్టల వద్ద పంపుహౌస్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. కోటిలింగాల నుంచి పంపుహౌస్ వరకు మూడు కిలోమీటర్ల కాలువ తవ్వడంతోపాటు కోట్లనర్సింహులపల్లి వరకు 30 కిలోమీటర్ల మేరకు పైపులైన్ వేయాల్సి ఉంటుంది. కోట్లనర్సింహులపల్లి నుంచి వరద కాలువ వరకు మరో మూడు కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంటుంది. ఈ పనులను ఇప్పటివరకు చేపట్టలేదు. పనులను చేపట్టేందుకు టెండర్లు పిలిచి ఆయా ఏజెన్సీలతో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ పనులమీద కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి దీనికి అనుమతి లేదని పేర్కొనడంతోపాటు వివరాలు కోరడంతో మూడో టీఎంసీ పనులకు బ్రేక్ పడ్డట్లేనని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున ఆయన ప్రస్తుతం దీనిపై ఏ చర్య తీసుకుంటారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న అంశాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Updated Date - 2020-12-16T05:11:18+05:30 IST