పత్తి రైతుల ఆశలు ఫలించేనా?
ABN, First Publish Date - 2020-11-03T10:47:54+05:30
తెల్ల బంగారంపై ఆశలు నింపుకున్న రైతులు తెల్లబోతున్నారు. కరుణించని ప్రకృతి, కొనుగోలుకు ముందుకు రాకుండా చిక్కులు పెడుతున్న సీసీఐ పత్తి రైతును చిత్తు చేస్తోంది
బోణీ బేరాన్నే తిరస్కరించిన సీసీఐ
జిల్లావ్యాప్తంగా 19 జిన్నింగ్ మిల్లులతో సీసీఐ ఒప్పందం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెల్ల బంగారంపై ఆశలు నింపుకున్న రైతులు తెల్లబోతున్నారు. కరుణించని ప్రకృతి, కొనుగోలుకు ముందుకు రాకుండా చిక్కులు పెడుతున్న సీసీఐ పత్తి రైతును చిత్తు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి వచ్చి రైతులకు 275 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావించగా 200 కోట్లు దక్కడం కూడా గగనమేననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాయ పగిలి పత్తి నల్లబడింది. మిగిలిన పత్తిలో తేమశాతం ఎక్కువై కనీస మద్దతు ధర లభించకుండా పోతున్నది. ఇప్పుడిప్పుడే మొదలైన రబ్బర్ పురుగు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మరోవైపు పత్తిని కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాలు ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంతో మొదటి విడత ఏరిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది.
తేలిన సీసీఐ వైఖరి
మంత్రి ఈటల రాజేందర్ సోమవారం జమ్మికుంటలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా బోణి వ్యాపారంలోనే సీసీఐ అధికారులు తిరకాసు పెట్టడంతో రానున్న రోజుల్లో వారు వ్యవహరించే వైఖరి ఏమిటో చెప్పకనే తెలుస్తున్నది. మంత్రి చేతులమీదుగా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిద్దామని నిర్ణయించిన మార్కెంటింగ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మహిళా రైతు మలమ్మకు చెందిన ఆరు క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చిన వాహనానికి రిబ్బన్లు అమర్చి మంత్రి చేత ఆ రిబ్బన్ కట్ చేయించడం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభింపజేశారు. అంతకు ముందు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ పత్తి నాణ్యతను చూసి అంతా సజావుగా ఉందన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతే మంత్రి చేత ఆ పత్తిని కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి అటు వెళ్లారో లేదో సీసీఐ అధికారులు వచ్చి మహిళా రైతు పత్తిని కొనేది లేదని కరాఖండిగా చెప్పేశారు. తేమ అధికంగా ఉందని, ఆ పత్తిని తాము కొనుగోలు చేయమని చెప్పడంతో చేసేదేమి లేక ఆ మహిళా రైతు 4,900 రూపాయలకు క్వింటాలు చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. సీసీఐ కొనుగోలు చేస్తే క్వింటాలుకు 5,825 రూపాయలు రావాల్సిన చోట 4,900 రూపాయలకే అమ్ముకొని ఒక్కో క్వింటాలుపై 925 చొప్పున 6 క్వింటాళ్ల పత్తిని 5,550 రూపాయల నష్టానికి మహిళా రైతు అమ్ముకోవాల్సి వచ్చింది. బోణి బేరంలోనే తిరకాసు పెట్టిన సీసీఐ రాబోయే రోజుల్లో రైతులను మరెన్ని ఇబ్బందులపాలు చేస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది.
4.47 క్వింటాళ్ల దిగుబడి అంచనా
జిల్లాలో వానకాలం 74,158 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. తొలుత ఎకరాకు సుమారు ఆరున్నర క్వింటాళ్ల చొప్పున 4.82 లక్షల క్వింటాళ్ల నుంచి ఐదు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మొదటి పికింగ్‌లో దిగుబడి చాలా తగ్గిపోయింది. పత్తికాయ పగిలి నల్లబడిపోవడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. కొన్ని చేలలో పత్తి ఏరడానికి అయ్యే ఖర్చు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. రెండో పికింగ్ నుంచి మొదలుకొని చివరి వరకు సుమారు 4.47 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చి మార్కెట్‌కు విక్రయానికి వస్తుందని అటు వ్యవసాయశాఖ అధికారులు, ఇటు మార్కెటింగ్‌శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
తేమ శాతం మేరకు పత్తికి ధర
జిల్లాలోని దిగుబడి అయిన పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ 19 జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్నది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని ఈ మిల్లులు జిన్నింగ్ చేసి వాటికి అప్పగిస్తాయి. జమ్మికుంటలో 11 మిల్లుల, కరీంనగర్‌లో 4 మిల్లులు, హుజురాబాద్‌లో 2 మిల్లులు, చొప్పదండిలో ఒక మిల్లు, గోపాల్‌రావుపేటలో ఒక మిల్లు సీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు జమ్మికుంటలో సీసీఐ తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం పత్తిపోగు 29.5 నుంచి 30.5 మిల్లీ మీటర్లు ఉంటే క్వింటాలుకు 5,825 రూపాయల మద్ధతు ధరను నిర్ణయించింది. పోగు 27.5 నుంచి 28.5 వరకు ఉంటే 5,725 రూపాయల ధరను ప్రకటించింది. ఈ సైజ్‌తోపాటు తేమ కూడా 8 నుంచి 12 శాతంలోపు ఉండాలి. సీసీఐ తేమశాతాన్ని అనుసరించి పత్తికి ధరను ఖరారు చేసింది. ఆరు శాతం తేమతో క్వింటాలుకు 5,941.50 రూపాయలకు, 7 శాతం తేమతో 5,883.25, 8 శాతం తేమతో 5,825, 9 శాతం తేమతో 5,766.75, 10 శాతం తేమతో 5,708.50, 11 శాతం తేమతో 5,650.25, 12 శాతం తేమతో 5,592 రూపాయలకు కొనుగోలు చేయాలని ధరను నిర్ణయించింది. 12 శాతానికంటే ఎక్కువ తేమ ఉంటే ఆ పత్తిని కొనేది లేదని సీసీఐ తేల్చి చెప్తున్నది.
మంచు కురుస్తుండడంతో ఆందోళనలో రైతులు
ప్రస్తుతం వరుస అల్ప పీడనాలు ఏర్పడుతుండడంతో మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉదయంపూట, రాత్రిపూట మంచు కురుస్తూ తేమశాతం పెరిగిపోతున్నది. దీంతో రైతులు పత్తి ఏరినా సీసీఐ సూచిస్తున్న నిబంధనలకు అనుగుణంగా తేమ ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. సీసీఐ ఈ తేమను సాకుగా చూపి కొనడానికి నిరాకరించే పక్షంలో విధిలేని పరిస్థితుల్లో రైతులు మిల్లు యజమానులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. జమ్మికుంటలో సీసీఐ తొలి కొనుగోలు కేంద్రం ప్రారంభించినా మార్కెట్‌కు వచ్చిన మొత్తం పత్తిని ప్రైవేట్‌గా మిల్లు యజమానులే కొనాల్సి వచ్చింది. తక్కువ ధరలకు కొనుగోలు చేసిన మిల్లర్లు ఆ పత్తిని కొంత ఆరబెట్టి మళ్లీ సీసీఐకే దానిని విక్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. సీసీఐ అధికారులు సజావుగా పత్తిని కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2020-11-03T10:47:54+05:30 IST