కరోనా ఎఫెక్ట్.. బార్లు, పర్మిట్ రూంలు మూసివేత
ABN, First Publish Date - 2020-03-16T08:45:35+05:30
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ముందస్తుగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, పర్మిట్ రూంలను బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా వాటిని మూసివేశారు.
తెరుచుకోని మల్టిప్లెక్సులు, థియేటర్లు
ఫంక్షన్లలో తగ్గిన రద్దీ
బోసిపోయిన రోడ్లు
షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు విముఖత
మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవు
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ప్రజావాణి, డయల్‌యువర్ కలెక్టర్ రద్దు
కరీంనగర్ టౌన్, మార్చి 15: కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ముందస్తుగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, పర్మిట్ రూంలను బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా వాటిని మూసివేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వ్యాపారవాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు, బార్లు మూసివేయడంతో జిల్లా కేంద్రంలోని రోడ్లపై రద్దీ తగ్గింది. ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తు కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ ప్రయాణికుల సంఖ్య చాలా మేరకు తగ్గింది.
బార్లు, పర్మిట్ రూంలు మూసివేత
ఈ నెల 21వ తేదీ వరకు బార్లు, పర్మిట్ రూంలను మూసివేయాలని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని 28 బార్లు, 87 పర్మిట్ రూంలను మూసివేశారు. వైన్స్ షాపులను తెరచి ఉంచడంతో మద్యం ప్రియులు ఆయా దుకాణాల ముందు బారులు తీరి కొనుగోలు చేశారు. బార్లలో రోజుకు సుమారు 14 లక్షల రూపాయల మేరకు మద్యం అమ్మకాలు జరిగేవని, మూసివేతతో నష్టం భారీగానే ఉంటుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్‌లోని ఏడు థియేటర్లు, రెండు మల్టీప్లెక్సులు, హుజురాబాద్‌లో రెండు, జమ్మికుంటలో మూడు, చొప్పదండిలో ఉన్న ఒక థియేటర్‌ను మూసివేశారు. కరోనా వైరస్ కారణంగా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో థియేటర్లను మూసివేశామని థియేటర్ల ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలు బోసి పోయాయి. ఫంక్షన్‌హాల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికి ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ఫంక్షన్‌హాల్స్‌లో మాత్రమే వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగాయి. తుమ్ము, దగ్గు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, జనసమూహం ఎక్కువగా ఉండకూడదని, ఇప్పటికే కుదుర్చుకున్న వివాహాలకు ప్రభుత్వం అనుమతినిస్తూ, 200 మందికి మించి వివాహశుభకార్యాల్లో పాల్గొనకుండా చూసుకోవాలని ఆదేశించడంతో ఫంక్షన్ హాల్స్‌లో చాలా మేరకు రద్దీ తగ్గిపోయింది.
విద్యా సంస్థలకు సెలవులు
విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లను ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలను తెరచి ఉంచరాదని ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాలల ఎంఈవోలు, హెచ్‌ఎంలకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే పదవ, ఇంటర్మీడియట్ పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించినందున పరీక్షల విధుల్లో పాల్గొనాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సూచించారు. తుమ్ములు, దగ్గుల ద్వారా కరోనా వ్యాప్తిచెందుతుందని, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులు జోడించి నమస్కరించుకోవాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచిస్తుండడంతో చాలా మంది షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జంకుతున్నారు.
ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ రద్దు
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలను కలెక్టర్ కె శశాంక రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఈకార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కరోనాపై ప్రజలు భయపడకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారును ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై తీసుకోవలసిన ముందస్తు చర్యలు, అవగాహన కార్యక్రమాలపై సూచనలు చేశారు. మందుల దుకాణాల్లో మాస్క్‌లు, సానిటైజర్లు ఎక్కువ ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో కరోనాపై ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. ఇక చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లోనే కాకుండా మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో , తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తిచెందుతున్నందునే ప్రభుత్వం సెలవులు ప్రకటించాయని, నలుగురు కలిసిన చోట కరోనాపైనే చర్చించుకున్నారు.
ప్రజల ఆరోగ్యం ముఖ్యం...జాలి శ్రీరాంరెడ్డి, సాయికృష్ణ థియేటర్
15 రోజుల పాటు సినిమా థియేటర్లు మూసి వేయడం వల్ల చాలా నష్టం వస్తుంది. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటిస్తాం.
రోజుకు రూ. 15 వేల నష్టం...అభిలాష్, మమత ధియేటర్
థియేటర్ మూసి వేయడం వల్ల 15 వేల రూపాయల నష్టం వస్తుంది. అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను మూసి వేశాం. అందరి ఆరోగ్యం బాగుండాలి కదా.
Updated Date - 2020-03-16T08:45:35+05:30 IST