కరోనాపై భయాందోళనలు వద్దు
ABN, First Publish Date - 2020-03-16T11:44:16+05:30
కరోనాపై భయాందోళనలు వద్దు
-ముందు జాగ్రత్తలు మేలు
-కలెక్టర్ కె శశాంక
-కరోనాపై ప్రజలు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు
కరీంనగర్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కరోనా వ్యాధిపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కె.శశాంక అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనాపై సీపీ కమలాసన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రెండు దశల కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ నెల 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసి వేయాలన్నారు. సినిమా థియేటర్లు, బార్లు, మెంబర్ షిప్ క్లబ్‌లు మూసివేయాలన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వ హించవద్దన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని, డీర్‌పార్కు, ఉజ్వలపార్కు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియం మూసి వేయాలన్నారు. ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయన్నారు. ఫంక్షన్ హాల్‌లలో వివాహాలకు ఈ నెల 31వరకు అనుమతి ఉంటుందన్నారు. జన సామర్థ్యానికి దూరం గా ఉండాలన్నారు. సాంఘిక, సంక్షేమ, మైనార్టీ గురుకులాలలో పరీక్షలు రాసే వారు వసతి గృహాలలో ఉండవచ్చని, మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. పెళ్లి ఊరేగింపుల, ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ప్రైమరీ పాఠశాలల నుంచి పీజీ వరకు ఫార్మసి, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు మూసి వేయాలన్నా రు. కరోనాపై అసత్యపు వార్తలు ప్రచారం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుకోవాలని ఆయన కోరారు. నగరంలో సానిటేషన్ నిర్వహించే మున్సిపల్ వర్కర్లు శుభ్రత పాటించాలన్నారు. దగ్గు, జలుబుతో వచ్చే వారికి ఆస్ప త్రుల్లో ప్రత్యేక చికిత్స లభిస్తుందన్నారు. దగ్గు, జలుబు ఉన్న వారు ఇళ్లల్లో విశ్రాంతి తీసుకోవాలన్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొందరు కరోనాపై ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మన రాష్ట్రంలో కరోనా లేదని, విదేశాలనుంచి వచ్చే వారితోనే వస్తుందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అసత్యపు వార్తలను నమ్మొద్దని సూచించారు. మాస్కులు, సానిటైజర్స్ ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని ఎక్కువ ధరలు తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, డీఆర్‌వో పవన్‌కుమార్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీఎంహెచ్‌వో సుజాత, ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T11:44:16+05:30 IST