ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సీఐఎస్‌ఎఫ్ భద్రత
ABN, First Publish Date - 2020-12-11T05:40:56+05:30
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎస్) కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం(సీఐఎస్‌ఎఫ్) భద్రత కల్పించున్నది.
- కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్
- సెక్యూరిటీ ఏర్పాట్లపై యాజమాన్యంతో సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సమీక్ష
- 18పోస్టులు, వంద మంది సిబ్బంది అవసరమని అంచనా
కోల్‌సిటీ, డిసెంబరు 10: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎస్) కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం(సీఐఎస్‌ఎఫ్) భద్రత కల్పించున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలతో హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. గతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యంతో జరిగిన సమీక్ష సమావేశంలో భద్రత ఏర్పాట్లకు సీఐఎస్‌ఎఫ్ రక్షణ కల్పించాల్సిందిగా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు ఆయన అంగీకారం కూడా తెలిపారు. ఇన్నాళ్లు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద కర్మాగారమైన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.6120కోట్ల వ్యయంతో నిర్మించింది. ఏటా 12.7లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి అవుతాయి. దీంతో పాటు ముఖ్యమైన లిక్విడ్ అమ్మోనియా నైట్రేట్ కూడా ఉత్పత్తి కానున్నది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనికి తోడు ప్రత్యేకంగా జీఎస్‌పీఎల్ ఇండియా ట్రాన్స్‌కో లిమిటెడ్(జీఐటీల్) ఆధ్వర్యంలో గ్యాస్ సరఫరా కూడా జరుగుతుంది. పైప్‌లైన్ ద్వారా రామగుండంకు గ్యాస్ సరఫరా అవుతుంది. ఇందుకు ప్రత్యేకంగా గ్యాస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అమ్మోనియా స్టోరే జీ ట్యాంకు కూడా పరిశ్రమ ఆవరణలో ఉంటాయి. భారీ రసాయనిక పరిశ్రమ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ కంటే కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం అవసరమంటూ ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ వచ్చింది. మొదట తమ వద్ద అవసరమైన ఫోర్స్ లేదని రక్షణ కల్పించలేమంటూ సీఐఎస్‌ఎఫ్ చేతులెత్తేసింది. తరువాత రాష్ట్ర పోలీస్ శాఖను సంప్రదించినా సానుకూల స్పందన రాలేదు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర మంత్రి ఆదేశాలతో హోంశాఖ సీఐఎస్‌ఎఫ్ రక్షణకు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఇప్పటి వరకు కీలకమైన 18 సెక్యూరిటీ పోస్టులను గుర్తించారు. మూడు షిప్టులకు గాను 60 నుంచి 100మంది సిబ్బంది అవసర ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే సింగరేణిలో సీఐఎస్‌ఎఫ్‌ను యాజమాన్యం వెనక్కుపంపింది. ప్రస్తుతం గోదావరిఖని శ్రీనగర్ కాలనీ వద్ద సీఐ ఎస్‌ఎఫ్ సబ్ హెడ్ క్వార్టర్ ఉంది. ఎన్‌టీపీసీతో పాటు సింగరేణిలోని కీలకమైన ఎక్స్‌ప్లోజివ్స్ గోడౌన్ల వద్ద సీఐఎస్‌ఎఫ్ రక్షణ కొనసాగుతుంది. ఈ సబ్ హెడ్‌క్వార్టర్ నుంచే ఆర్‌ఎఫ్‌సీఎల్ కూడా రక్షణ కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈఓ నిర్లీప్‌సింగ్ రామగుండంలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు కమిషనింగ్ పనులు, సీఐఎస్ ఎఫ్ భద్రత ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సీఐఎస్‌ఎఫ్ నుంచి ఎంత ఫోర్స్ అవసరముంటుందనే విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాగా సీఐఎస్ ఎఫ్‌కు అవసరమయ్యే వేతనాలు, ఇతర వ్యయాలను కూడా యాజమాన్యం భరించుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2020-12-11T05:40:56+05:30 IST