అందని అమ్మఒడి సాయం
ABN, First Publish Date - 2020-12-30T05:23:34+05:30
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే దిశగా అమ్మఒడి పథకం సత్ఫలితాలు ఇస్తున్నా ఆర్థిక సహాయం మాత్రం సకాలంలో అందడం లేదు.
- కేసీఆర్ కిట్‌లతోనే సరి
- రూ.2.38 కోట్ల ప్రోత్సాహక బకాయిలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే దిశగా అమ్మఒడి పథకం సత్ఫలితాలు ఇస్తున్నా ఆర్థిక సహాయం మాత్రం సకాలంలో అందడం లేదు. మగబిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేల వరకు నాలుగు విడతల్లో తల్లి అకౌంట్‌లో జమ చేస్తారు. నిధుల విడుదల జాప్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోత్సాహం కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో అమ్మఒడి పథకంలో ఏటా 10,834 మంది గర్భిణుల నమోదు లక్ష్యంగా పెట్టుకు న్నారు. ఇందులో 2019- 2020లో 9097 మంది, ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబరు వరకు 5479 లక్ష్యాన్ని సాధించారు. 2019 ఏప్రిల్ నుంచి మార్చి 2020 వరకు ప్రభుత్వ ఆస్పత్రులో 3787 ప్రసవాలు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు 2730 ప్రసవాలు జరిగాయి. అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 12 వేల 382 మంది ప్రభుత్వ ఆస్పత్రుల ద్వా రా వివిధ సేవలను పొందారు. వీరిలో 4451 మందికి అమ్మఒడి ప్రోత్సాహక డబ్బులు అందాయి. 7931 మంది ఎదురు చూస్తున్నారు. ప్రసూతి అయిపోయిన ఒక్క విడత కూడా ప్రోత్సాహం అందుకోనివారు ఉన్నారు.
రూ.2.38 కోట్ల బకాయిలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మఒడి పథకంలో నగదు ప్రోత్సాహకం కింద ఇప్పటి వరకు రూ.1.33 కోట్లు అందించారు. ప్రస్తుతం 7931 మందికి రూ.2.38 కోట్ల ప్రోత్సాహక బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో మొదటి విడతలో 2026 మందికి రూ.60.78 లక్షలు, రెండో విడతలో 1438 మందికి రూ.64.71 లక్షలు, మొదటి టీకా వేసుకున్న 2388 మందికి రూ.71.64 లక్షలు, రెండో టీకా వేసుకున్న 2079 మందికి రూ.41.58 లక్షలు అందాల్సి ఉంది.
Updated Date - 2020-12-30T05:23:34+05:30 IST