సొంత పార్టీ ఎంపీ మాటతో తెలంగాణ బీజేపీలో కలకలం!
ABN, First Publish Date - 2020-12-30T17:39:27+05:30
తెలంగాణ బీజేపీలో కోల్డ్‌వార్ ముదురుతోందా...!
తెలంగాణ బీజేపీలో కోల్డ్‌వార్ ముదురుతోందా...! వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మాదే అంటున్న బీజేపీ ముఖ్య నేతలు....అప్పుడే ముఖ్యమంత్రి పీఠంపై గురిపెట్టారా...! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించడం దేనికి సంకేతం...! సీఎం రేసులో బీసీ సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మరో పేరు ఎవరిది? వాచ్ దిస్ స్టోరి..!
కమలంలో కలకలం..!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఊపు రాగానే…ముఖ్యమంత్రి అభ్యర్థులపై చర్చ ప్రారంభమయింది. సాధారణంగా బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయంపై చర్చ జరగదు..కానీ రాష్ట్రంలో మాత్రం సీఎం రేసులో ఉండేది ఎవరు అనే దానిపై పార్టీలో చర్చలు ఊపందుకున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని.. కాబోయే సీఎం కిషన్‌రెడ్డే అని ఇటీవల ఆదిలాబాద్‌లో ఎంపీ సోయం బాపురావు చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలోనే బాపురావు ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో కమలం పార్టీలో కలకలం రేగుతోంది.
ప్రధాని కూడా ఫోన్ చేసి..!
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల వరకు కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీలో ముఖ్యనేతగా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయనకు పోటీగా మరికొందరు దూసుకొచ్చారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయి ఢిల్లీ వెళ్లిన తర్వాత.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ పార్టీని దూకుడుగా నడుపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా బండి సంజయ్ సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ స్థానాలను సాధించారు. సొంత అడ్డా అయినప్పటికీ కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదన్న వాదనలున్నాయి. గ్రేటర్ ప్రచార బాధ్యతలను బండి సంజయ్ అన్ని తానై నిర్వహించారు. దీంతో ఆయనకు ప్రధాని కూడా ఫోన్ చేసి అభినందించారు. ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని ఆయన వర్గీయులు మెళ్లిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారట. ఇది సహజంగానే పార్టీలోని ఇతర నేతలకు గిట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫుల్ ఫామ్‌లోకి రాకముందే..
తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ దూసుకుపోవడం కిషన్ రెడ్డిని కంగారు పెడుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన అనుచరులు ఇప్పటి నుంచే కిషన్ రెడ్డి సీఎం అభ్యర్థి అనే ప్రచారం వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. వాస్తవానికి కమలం పార్టీలో హైకమాండ్ ఎవరిని సీఎంగా ప్రకటిస్తే వారికే మిగతా నాయకులు మద్దతిస్తారు. ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం చాలా అరుదు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం..ఇంకా ఫుల్ ఫామ్‌లోకి రాకముందే ముఖ్యమంత్రి నేనంటే..నేనని అనుకునే పరిస్థితి రావడంపై హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి.
ఇంతకీ అభ్యర్థి ఎవరు..!?
మొత్తానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో ముసలం మొదలయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీ వర్గీయులు మాత్రం తమ నేత ఎవరికో వ్యతిరేకం,మరెవరికో అనుకూలం కాదని అంటున్నారు. సీఎం కేసీఆర్ తీరును తప్పుపడుతూ ఎంపీ బాపురావు చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డినా? లేక బండి సంజయ్? లేక మరొకరా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Updated Date - 2020-12-30T17:39:27+05:30 IST