పనిలేదు.. పూట గడవదు
ABN, First Publish Date - 2020-05-09T10:44:52+05:30
కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో చేతి వృత్తులపై ఆధారపడిన వారి బతుకులు ఆగమయ్యాయి.
వీధిన పడుతున్న వృత్తిపని వారు
దయనీయంగా విశ్వకర్మీయుల పరిస్థితి
లాక్‌డౌన్‌తో మారిన బతుకు చిత్రం
బర్కత్‌పుర/నల్లకుంట/మెహిదీపట్నం/ముషీరాబాద్/కవాడిగూడ, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో చేతి వృత్తులపై ఆధారపడిన వారి బతుకులు ఆగమయ్యాయి. వృత్తినే నమ్ముకున్న కుటుంబాలు వీధిన పడ్డాయి. నగరంలో పనులు లేక విశ్వకర్మీయులు పస్తులుంటున్నారు. గతంలో చేతినిండా పనితో ధీమాగా బతికిన స్వర్ణకారుల జీవితాల్లో కాంతులు కనిపించడం లేదు. కమ్మరి, వడ్రంగి, బీట్ కమ్మరులు పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
కడుపునింపని కులవృత్తి
నగరంలో వేల మంది వడ్రంగులు ఉన్నారు. వీరంతా ఫర్నిచర్‌తో పాటు ఇంటి దర్వాజాలు, తలుపులు, కిటికీలు ఇతర కలప వస్తువులు తయారు చేసేవారు. వేలల్లో దూగోడ మిషన్లు నడిచేవి. ప్రస్తుతం వాటి చప్పుళ్లు ఆగిపోయాయి. నిర్మాణ పనులు లేకపోవడంతో వీరికి ఉపాధి పోయింది. ఇంటిపట్టునే ఉంటున్న వడ్రంగులు తొలి రోజుల్లో ఎలాగోలా సర్దుకున్నా వీరి పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది.
వేలాది మంది స్వర్ణకారులు
లాక్‌డౌన్ లేకుంటే ఇది పెళ్లిళ్ల సీజన్. స్వర్ణకారులకు చేతినిండా పని ఉండేది. పెళ్లిళ్ల సీజన్‌లో నెల రోజుల ముందు నుంచే వివిధ ఆభరణాల తయారీలో బిజీగా ఉండేవారు. చిన్నచిన్న స్వర్ణకారులకూ పని దొరికేది. రోజుకు ఒక్కొక్కరు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించేవారు. ప్రస్తుతం షాపులు మూతపడడంతో పని లేక పస్తులుంటున్నామని రాంనగర్‌కు చెందిన రామాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్, ముషీరాబాద్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో నగల తయారీ షాపులు అధికంగా ఉన్నాయి. ఈ షాపుల్లో ముగ్గురి నుంచి ఐదుగురు పని చేస్తూ ఉపాధి పొందేవారు. లాక్‌డౌన్ వల్ల వీరి జీవనం ఆందోళనకరంగా మారింది. షాపుల అద్దెలు, కరెంట్ బిల్లుల చెల్లింపులతోపాటు కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
బీట్ కమ్మరులకు ఉపాధి కరువు..
నగరంలో బీట్ కమ్మరుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఇనుప వస్తువులు తయారు చేసి జీవనం సాగించే వారు. ప్రస్తుతం వీరి పనులు సాగడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని ఈ కుటుంబాలు పనులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదుకోవాలి..
లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు, బీట్ కమ్మరులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. షాపుల అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు తక్షణమే రూ.250 కోట్ల నిధులను విడుదల చేయాలి. ఆ నిధులను విశ్వకర్మీయులకు అందించాలి. విశ్వకర్మీయుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను ఉచితంగా అందజేయాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే విశ్వకర్మీయులు అర్ధాకలితో అలమటిస్తారు.
- లాలుకోట వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం జాతీయ నాయకుడు
ఉపాధి కోల్పోయాం : పి.శ్రీధర్‌చారి, ముషీరాబాద్, స్వర్ణకారుడు
ముప్పై ఏళ్లుగా స్వర్ణకార వృత్తిలో ఉన్నాను. మా షాపులో నాతో పాటు మరో ముగ్గురు ఉపాధి పొందేవారు. లాక్‌డౌన్ వల్ల షాపు మూతపడడంతో పూర్తిగా ఆదాయం కోల్పో యాం. పెళ్లిళ్ల సీజన్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు షాపులో బిజీగా పని చేసేవాళ్లం. ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ మొత్తం లాక్‌డౌన్‌లో పోయింది. నగరంలో సుమారు 10 వేల మంది స్వర్ణకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.
లాక్‌డౌన్‌తో పనిలేక ఇబ్బంది
లాక్‌డౌన్‌తో షాపులు మూతపడి పనులు లే కుండా పోయాయి. 20 ఏ ళ్లుగా కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ప్ర స్తుతం కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాం. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో ఉపాధి పోయింది. ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలి.
- కూరెళ్ల శ్రీకాంత్‌చారి, కార్పెంటర్, ఉప్పల్ నివాసి
కుటుంబాలను ఆదుకోవాలి..
లాక్‌డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్న కమ్మరి, వడ్రంగి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది కమ్మరి, వడ్రంగుల కుటుంబాలు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. నిధులు విడుదల చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలి.
- కుందారం గణే్‌షచారి, తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
Updated Date - 2020-05-09T10:44:52+05:30 IST