‘పని’పడుతున్నారు..!
ABN, First Publish Date - 2020-11-03T09:18:48+05:30
ఇళ్లలో పనివాళ్లుగా చేరిన వ్యక్తులు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటుచేసుకుంటున్నాయి
ఆ ఏజెన్సీలపై నిఘా..?
గుర్తుతెలియని, ఇతర రాష్ట్రాల వాళ్లను..
ఇళ్లలో పనులకు పెడుతున్న కొన్ని ఏజెన్సీలు
హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న కొందరు..
అక్రమ ఏజెన్సీలపై ఆరా తీస్తున్న పోలీసులు
నార్సింగ్ పరిధిలో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా బిల్డర్ ఇంట్లో వంటవాళ్లుగా చేరారు నేపాల్ దంపతులు. మూడు నెలల్లో ఇంటి యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపి వారు స్పృహ కోల్పోయాక ఇల్లు గుల్ల చేసి బంగారం సహా.. రూ. కోట్లు విలువైన సొత్తు దోచుకెళ్లారు.
కరీంనగర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నగరంలోని తిరుమలగిరి ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లో వంటమనిషిగా చేరింది. సరిగ్గా నెల తర్వాత తన ప్రియుడిని పిలిపించి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు దోచేసింది.
ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో కుషాయిగూడ పరిధిలోని ఓ కాంట్రాక్టర్ ఇంట్లో నేపాల్ దంపతులు పనివాళ్లుగా చేరారు. నెల రోజుల తర్వాత ఇంటి యజమానులంతా పెళ్లికి వెళ్లడంతో తన ముఠాను రంగంలోకి దింపి రూ. 2 కోట్ల సొత్తు దోచేశారు.
ఇటీవల రాయదుర్గం, నాచారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇలాంటి భారీ చోరీలు చేసిన నేపాల్ దొంగల ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆయా ఇళ్లలో పనికి చేరినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ సిటీ, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లలో పనివాళ్లుగా చేరిన వ్యక్తులు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ముఠాలు ఎక్కువగా వివిధ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానే పనికి కుదురుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత కొన్ని రోజులు నమ్మకంగా పని చేస్తూ.. అదునుకోసం ఎదురుచూసి అవకాశం రాగానే.. డబ్బు, బంగారంతో ఉడాయిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే ఇంటి యజమానులను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
పోలీసుల నజర్...
ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనిలో చేరుతున్న వాళ్లే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటంతో.. పోలీసులు ఆయా ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనల్లో పనివాళ్లను పనిలో చేర్పించిన చాలా ఏజెన్సీలకు లైసెన్స్‌లు కూడా లేవని పోలీసులు విచారణలో తేలింది. దీంతో అలాంటి ఏజెన్సీలు నగరంలో ఎన్ని ఉన్నాయి..? వారు ఎలాంటి వారిని పనిలో చేర్పిస్తున్నారు..? వారు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారు..? అనే వివరాలను ఆరా తీస్తున్నట్లు తెలింది. అనుమానం ఉన్న ఏజెన్సీలపై నిఘా ఉంచాలని నిర్ణయించారు.
తెలిసిన వారి ద్వారానే చేర్చుకోవాలి...మహేష్ భగవత్, రాచకొండ సీపీ.
పని వాళ్లను చేర్చుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. గుర్తుతెలియని వ్యక్తులను పనిలో పెట్టుకోవడం కన్నా.. తెలిసిన వారి ద్వారా పనివాళ్లను చేర్చుకోవడం మంచిది. వారికి ఏమైనా నేరచరిత్ర ఉందా..? వారు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు. అనే వివరాలపై ఆరా తీయాలి. లేదంటే స్థానిక పోలీసులను ఆశ్రయించి పనివాళ్ల వివరాలు అందజేస్తే పోలీసులు ఆరా తీసి సమాచారం ఇస్తారు.
Updated Date - 2020-11-03T09:18:48+05:30 IST