ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటికి సినీ ప్రముఖులు సంతాపం

ABN, First Publish Date - 2020-02-12T09:08:32+05:30

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు మంగళవారం ఉదయం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్ని కృష్ణానగర్‌లో గల స్వగృహానికి తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు మంగళవారం ఉదయం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్ని కృష్ణానగర్‌లో గల స్వగృహానికి తీసుకొచ్చారు. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, నటుడు-నిర్మాత మాదాల రవి, దర్శక-నిర్మాత సీవీ రెడ్డి, యువ కథానాయకుడు శర్వానంద్‌ తదితరులు రామారావు ఇంటికి విచ్చేసి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కృష్ణానగర్‌ నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుందని తెలిసింది. పదకొండు గంటల సమయంలో జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రామారావు ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.


‘‘నిజాయతీ, సున్నిత మనస్తత్వం కల జర్నలిస్టుల్లో రామారావుగారు ఒకరు. వుయ్‌ మిస్‌ యు సార్‌. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ 

-దర్శకుడు హరీశ్‌ శంకర్‌


‘‘రామారావుగారిలో ఎప్పుడూ అమాయకత్వంతో కూడిన నిజాయతీ ఉండేది. చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా ఉండేవారు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌’’

- హీరో నాని


‘‘నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ జర్నలిజానికి పసుపులేటి రామారావుగారు పర్యాయపదంగా నిలిచారు. ఆయన మృతి అత్యంత బాధాకరం. సినీ జర్నలిజానికి, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. పెద్దవారైనా యువకుల్లోని ఉత్సాహం ఆయనలో కనిపించేది’’

- హీరో నితిన్‌


‘‘పసుపులేటి రామారావుగారి అకాల మరణం చాలా బాధాకరం. ఆయన నిరాడంబరత, పాటించిన విలువలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. పలు సందర్భాల్లో వారితో జరిపిన సంభాషణ నాకు మిగిలిన మంచి స్మృతులు’’

- దర్శకుడు కొరటాల శివ


‘‘రామారావుగారు వినయపూర్వకంగా, సానుకూల దృక్పథంతో... అందరితో ఆత్మీయంగా ఉండేవారు. ఆయన అకాల మరణం నన్నెంతో బాధించింది. ఆయనతో జరిపిన సంభాషణలు నేనెప్పటికీ గుర్తుంచుకుంటా’’

- దర్శకుడు శ్రీను వైట్ల



‘‘మా నాన్నగారు మాదాల రంగారావు, టి. కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తి, పసుపులేటి రామారావుగారు మంచి మిత్రులు. నాకూ ఆయనతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన మా కుటుంబంలో సభ్యుడిగానే మేం ఎప్పుడూ చూశాం. వామపక్ష భావజాలం, ప్రజానాట్య మండలి నేపథ్యం నుండి సినీ జర్నలిజంలోకి వచ్చారు. మా నాన్నగారు, టి. కృష్ణగారి సినిమాలకు, నా సినిమాలకూ పీఆర్వోగా పని చేశారు. పసుపులేటి రామారావు గారు గొప్ప వ్యక్తి. రాజీలేని పోరాటం చేశారు. ఏనాడూ డబ్బుకు విలువ ఇవ్వలేదు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడ్డారు. గొప్ప మానవతావాది. జర్నలిస్టుగా అందరికో ఆదర్శంగా నిలిచారు. జర్నలిస్టు వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి’’

                                           - నటుడు, నిర్మాత మాదాల రవి


‘‘నేను సన్నిహితంగా మెలిగే అతికొద్దిమంది జర్నలిస్టుల్లో పసుపులేటి రామారావుగారు ఒకరు. ఆయన మరణం నాకెంతో బాధ కలిగిస్తోంది. భారీ శూన్యతను మిగిల్చింది. ఆయనతో మాట్లాడిన మాటలను ఎప్పటికీ  గుర్తుంచుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను’’

- హీరో వరుణ్‌ తేజ్‌


‘‘సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావుగారిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ‘పిల్లా నువ్వులేని జీవితం’ కోసం ఆయన తొలిసారి నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా శ్రేయోభిలాషి. నా సినిమాలపై తన అభిప్రాయాలను చక్కగా చెప్పేవారు. ఆయన మరణం తీరని లోటు. ఎవరూ పూడ్చలేనిది’’

- హీరో సాయిధరమ్‌ తేజ్‌



‘‘పాత్రికేయ మిత్రులు, జర్నలిజం విలువలకు నిలువుటద్దం, స్నేహశీలి పసుపులేటి రామారావుగారు ఇకలేరు. ఆయన మరణం తీరని లోటు’’

- నిర్మాత రాజ్‌ కందుకూరి



‘‘ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా కెరీర్‌ ప్రారంభం నుండి పసుపులేటి రామారావుగారు నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి. గొప్ప జర్నలిస్ట్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో నేను ఫ్రెండ్‌ క్యారెక్టర్లు, చిన్న రోల్స్‌ చేసినప్పుడు కూడా ఎంతో మర్యాదగా మాట్లాడేవారు. ఎప్పుడు కలిసినా... ‘ఎలా ఉన్నావు బాబు. సినిమాలు బాగా చెయ్‌’ అని చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. కుమారుడితో తండ్రి ఎలా మాట్లాడతారో... అలా మాట్లాడేవారు. వుయ్‌ ఆల్‌ మిస్‌ హిమ్‌’’

- హీరో శర్వానంద్‌


‘‘రామారావుగారు మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచి ఆయనతో అనుబంధం ఉంది. ఆయన్ను ఎప్పుడు కలిసినా, మా ఇంటికి వచ్చినా ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఫీల్‌ అవుతాం. బాబాయ్‌ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారనే ఫీలింగ్‌ ఉండేది. చాలా మృదు స్వభావి’’

- హీరో శ్రీకాంత్‌


‘‘నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే రామారావే కారణం. స్కూల్‌లో ఆయన నాకు సీనియర్‌. చిన్నప్పట్నుంచి నాటకాలు వేసేవారు. ఆ పిచ్చితోనే ఇండస్ట్రీకి వచ్చారు. అతని ద్వారానే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు రామారావు లేరంటే చాలా బాధగా ఉంది. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆయన లేకపోవడం దురదృష్టం’’

- నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2020-02-12T09:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising