గ్రేటర్ జోన్‌లో 140 కోట్ల విద్యుత్ బకాయిలు
ABN, First Publish Date - 2020-12-30T05:30:00+05:30
గ్రేటర్‌జోన్ పరిధిలో 42
60 శాతం నష్టాల్లో సౌత్ సర్కిల్
గ్రేటర్‌లో విద్యుత్ నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడటంతో విద్యుత్ డిమాండ్ పడిపోయింది. దీనికితోడు పలు సంస్థలు బిల్లులు చెల్లించకపోవడంతో గ్రేటర్‌జోన్ పరిధిలోని 9 సర్కిళ్లలో రూ. 140.19 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. లక్షకు పైగా పెండింగ్ బిల్లులున్న కనెక్షన్లను కట్ చేస్తూ అధికారులు బకాయిల వసూలుకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌జోన్ పరిధిలో 42 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. సౌత్ సర్కిల్ పరిఽధిలో అత్యధికంగా 60 శాతం నష్టాలు నమోదవుతున్నా వాటిని అరికట్టడంతో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. సౌత్‌సర్కిల్ పరిధిలో గృహ వినియోగ కనెక్షన్లు - 5,08,368, కమర్షియల్ కేటగిరిలో - 1,27,545, ఇండస్ర్టియల్ 3 కేటగిరి - 3430, కాటేజ్ ఇండస్ర్టీస్ కేటగిరి 4 - 42 కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ చౌర్యంతో పాటు భారీగా బకాయిలు పేరుకుపోతున్నా ఉన్నతాధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. సౌత్ సర్కిల్ పరిధిలోని అధిక నష్టాలు ఇతర సర్కిళ్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
విద్యుత్ చౌర్యం నష్టమే ఎక్కువ
విద్యుత్ చౌర్యంతో ప్రతినెలా డిస్కంకు సుమారు రూ. 20 నుంచి 25 కోట్లకు పైగా నష్టం వస్తోంది. శివారులోని చిన్న.. చిన్న కంపెనీలు, ఇండస్ర్టియల్ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ కొంత మంది విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ చౌర్యం కారణంగా ఏటా రూ. 200-240 కోట్లు నష్టం వస్తోంది. కొంతమంది పరిశ్రమల నిర్వాహకులు స్థానిక సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. బిల్లుల వసూళ్లపై దృష్టి పెడుతున్న అధికారులు పంపిణీ నష్టాలు, సాంకేతిక సమస్యలను పట్టించుకోవడం లేదు. సైబర్‌సిటీ, మేడ్చల్, హబ్సిగూడ, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, కుంటల పక్కన కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
Updated Date - 2020-12-30T05:30:00+05:30 IST