మా కాలనీలో మేమే ఉంటాం..
ABN, First Publish Date - 2020-03-27T08:35:17+05:30
ఐదు వందలకు పైగా ఇళ్లతో ఉంటుంది ఎన్‌బీటీ నగర్. పాటిగడ్డకు అనుకొని ఉండే ఈ బస్తీలోకి ఇతర ప్రాంతాల వారిని అస్సలు అనుమతించడం లేదు.
రహదారులకు అడ్డంగా కంచెలు.. పాత సామాన్లు.. బారికేడ్లు ఏర్పాటు
హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఐదు వందలకు పైగా ఇళ్లతో ఉంటుంది ఎన్‌బీటీ నగర్. పాటిగడ్డకు అనుకొని ఉండే ఈ బస్తీలోకి ఇతర ప్రాంతాల వారిని అస్సలు అనుమతించడం లేదు. వారి వాహనాలు లోనికి రాకుండా ఉండేందుకు రోడ్డును చెక్కలతో.. బైకులతో మూసేశారు. కేవలం మనుషులు మాత్రమే నడుచుకుంటూ వచ్చేలా ఏర్పాటు చేశారు. కొత్తవారిని అనుమతించడం లేదు. దీంతో.. ఆ బస్తీ మీదుగా ప్రయాణించే వారికి ఇప్పుడు కొత్త సమస్యలు షురూ అయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్‌కి వెళ్లేందుకు ఉన్న రహదారుల్లో నేరేడ్‌మెట్ మీదుగా వెళ్లేది ఒకటి. నేరేడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి వాయుపురి కాలనీ మీదుగా శివసాయి నగర్‌లో నుంచి వెళితే తక్కువ సమయంలో చేరుకునే వీలుంది. దీంతో వాహనదారులు శివసాయి నగర్‌లో నుంచి వెళ్తుంటారు. రెండు వందల ఇళ్లు ఉండే ఈ చిన్న కాలనీలోకి కొత్తవారిని రానివ్వడం లేదు. ’మేం బయటకు రాము. మా కాలనీలోకి ఎవరూ రావొద్దు‘ అంటూ కాలనీ సంక్షేమ సంఘం నిర్ణయం తీసుకుంది. కాలనీకి చెందిన కొందరు నిరంతరం పహారా కాస్తున్నారు. కొత్తవారుతమ కాలనీలోకి రాకుండా.. వారి గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలో సాయం చేస్తున్నారు. లోనికి అనుమతించేందుకు ససేమిరా అంటున్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని దుర్గానగర్ బస్తీలో ఏడు చోట్ల, ప్రగతి కాలనీలో రెండు చోట్ల రోడ్లకు అడ్డంగా కట్టెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసరంగా బయటకు వెళ్లాలంటే దుర్గానగర్‌లో ఒక చోట, ప్రగతి కాలనీలో ఒక చోట రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించేలా చేశారు. సంజీవరెడ్డినగర్ ప్రధాన రహదారిని అనుకొని బాపునగర్ బంజారా బస్తీలోకి వెళ్లే దారులను కట్టెలతో, వాహనాలతో మూసివేశారు. ఒకే చోట నుంచి మాస్కులు ఉంటేనే లోపలికి రానిచ్చేలా ఏర్పాట్లు చేశారు.
మహానగరంలోని కొన్ని కాలనీల్లో నెలకొన్న ఈపరిస్థితులకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సిటీని వదిలేసి సొంతూర్లకు వస్తామంటున్న వారిని ఊళ్లలో ఉన్నోళ్లు వద్దంటున్నారు. ఇదిప్పుడు మహానగరానికి పాకింది. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో కొత్త తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వేళ.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు కాలనీ రహదారులను మూసేస్తున్నారు. కొత్తవారిని కాలనీల్లోకి రానివ్వమంటున్నారు. తాము బయటకు వెళ్లమంటున్నారు. ఇందుకోసం రహదారులకు అడ్డంగా చెట్ల కొమ్మలు.. బల్లలు.. పాత సామాన్లు.. బారికేడ్లను అడ్డుగా పెట్టేస్తున్నారు. మరికొందరైతే.. రహదారులను మూసేస్తూ తాత్కాలికంగా కర్రలతో కట్టేస్తున్నారు. కరోనా భయాందోళనల నేపథ్యంలో సామాజిక దూరాన్ని పక్కాగా పాటించాలన్నా.. స్వీయ నిర్బంధానికి కాలనీ రహదారులను మూసేయటమే మంచిదన్న నిర్ణయానికి వారు వస్తున్నారు. ఇలాంటివి కొత్త ఇబ్బందులకు కారణమవుతున్నాయి.
భయంతో మూసేస్తున్నారు
ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కాలనీకి కాస్త దూరంలో కరోనా పాజిటివ్ అని తేలడంలో.. ఎన్‌బీటీ నగర్ బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అంతే.. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వారు.. తమ కాలనీలోకి ఎవరినీ రానిచ్చేది లేదని తేల్చేశారు. కొత్తవారు రాకుండా కాలనీ తరఫున తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అత్యవసరమైతే అనుమతిస్తామని చెబుతున్నారు. కొన్ని కాలనీల్లో ఇలాంటి ఏర్పాట్లకు సంబంధించి పక్కాగా ఉంటున్నా.. కొన్నిచోట్ల మాత్రం సమస్యలకు కారణంగా మారుతున్నాయి. ఇక.. కొన్ని కాలనీల్లో కరోనా అనుమానితుల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలానా బజారులో వారికి అనుమానిత లక్షణాలు వచ్చాయన్న ప్రచారంతో పాటు.. అటువైపుగా వెళ్లటానికి సైతం భయపడుతున్నారు. ఇక.. ఆ వీధుల్లోని వారిని రానిచ్చేందుకు ససేమిరా అనే కాలనీలు కొన్ని ఉండడం గమనార్హం.
రాకపోకలకు ఇబ్బంది
హయత్ నగర్‌లోని ఒక కాలనీలో రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలను నరికి వేశారు. అటువైపు నుంచి రాకపోకలు సాగించే వారికి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ప్రత్యామ్నాయ రహదారి ఉన్నా.. అటువైపు ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికంగా అవగాహన ఉన్న వారికి ఫర్వాలేదు కానీ.. కొత్తవారికి ఇబ్బందిగా మారుతోంది. ఇక.. అత్యవసర సేవలు అందించే వారికి కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి. దీంతో.. పాల వాహనాలు.. కూరగాయల బండ్లు లాంటివి లోపలికి రాలేకపోతున్నట్లు చెబుతున్నారు.
పోలీసులకు సమాచారం ఇచ్చాకే అనుమతి
కొన్నికాలనీల్లో మరింత ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తవాళ్లు వస్తే.. తప్పనిసరిగా వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు అనుమతించవచ్చని చెప్పిన తర్వాత రానిస్తున్నారు. కాలనీల్లోకి వారెందుకు వస్తున్నారు? వారెక్కడి నుంచి వస్తున్నారు? లాంటివి ఆరా తీస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి తప్పనిసరిగా పాటించాలని.. లేకుంటే కరోనా వ్యాప్తిని అరికట్టడం కష్టమన్న వాదనను వారు వినిపిస్తున్నారు.
చెక్ పోస్టులతో కొత్త తిప్పలు
స్థానికంగా ఉండే వారు మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చు అని ప్రభుత్వ ఆదేశాలు. బయటకు వస్తున్న వారిని పోలీసులు చెక్ పోస్టుల గుండా ప్రయాణించేందుకు అనుమతించడం లేదు. కాలనీల్లో నుంచి ప్రయాణించాలని వారు సూచిస్తున్నారు. కొన్ని కాలనీల వారు రహదారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. తమ వివరాలు రాయొద్దని.. కాలనీ వారితో మరింత ఇబ్బంది ఎదురవుతుందని చెప్పడమే కాదు.. ఫొటోలు తీసుకునేందుకు సైతం ఒప్పుకోకపోవటం గమనార్హం.
అవగాహన కల్పించేలా వ్యవహరిస్తే..
కాలనీల్లోకి కొత్తవారిని రానివ్వకుండా చేస్తున్న ఏర్పాట్లు కొన్ని బాగున్నా.. కొందరు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అభ్యంతరకంగా ఉంటోంది. రహదారులను మూసివేసే కన్నా.. అవగాహన కల్పించేలా వ్యవహరిస్తే మంచిందంటున్నారు కొందరు. రాత్రిళ్లు కొత్తవారు రానివ్వకూడదన్న ఆలోచన ఉన్న వారు.. గస్తీ ఏర్పాటు చేసి.. కొత్తగా వచ్చిపోయే వారి వివరాలు సేకరించడం లాంటివి చేస్తే మంచిందంటున్నారు. అదే సమయంలో.. కాలనీల్లో సామాజిక దూరాన్ని ఉల్లంఘించే వారికి కౌన్సెలింగ్ చేయడం బాగుంటుంది కానీ.. ఇలా రహదారుల్ని మూసివేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. అనవసర ఆందోళన కంటే.. అవగాహనతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ప్రాధాన్యం ఇస్తే మంచిదంటున్నారు.
Updated Date - 2020-03-27T08:35:17+05:30 IST