ఎండిన కొమ్మలు, వేర్లతో అద్భుత కళాఖండాలు
ABN, First Publish Date - 2020-03-16T10:16:07+05:30
ఎండిన కొమ్మలు, వేర్లతో అద్భుత కళాఖండాలు
ఔరా అనిపిస్తున్న పెట్లోజు శ్రీనివాస్
వంట చెరకును సేకరించి బొమ్మల సృష్టి
అడ్డగుట్ట, మార్చి15 (ఆంధ్రజ్యోతి) : ఎండిపోయిన చెట్ల కొమ్మలు, వేర్లతో అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు జనగాం జిల్లా తిరుమలగిరి మండలం సీతారాంపురం(కడవెండి) గ్రామానికి చెందిన పెట్లోజు శ్రీనివాస్. వంట చెరకును సేకరించి తన మదిలోని ఆలోచనలకు అనుగుణంగా బొమ్మలను చెక్కుతున్నాడు. జీవం లేని వేర్లకు ఉలి దెబ్బలు పెట్టి వివిధ రూపాల్లో బొమ్మలు రూపొందిస్తున్నాడు. వీటిని చూసినవారందరూ ‘అద్భుత సృష్టి.. భళా కళా నైపుణ్యం’ అంటూ ఆ కళాకారుడిని ప్రశంసిస్తున్నారు.
వృత్తి రీత్యా వైద్యుడైనా.. కళాకారుడిగా గుర్తింపు...
పెట్లోజు శ్రీనివాస్ దేవర్పులో ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఇంటర్ జనగామ ప్రభుత్వ కళాశాలలో చదివాడు. కర్నాకులంలో డీఎంఎల్‌టీ చేశాడు. 30 ఏళ్లుగా తిరుమలగిరిలో మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్‌గా ప్రాక్టీస్ నడుపుకుంటున్నాడు. గ్రామాల్లో వైద్య వృత్తిని కొనసాగిస్తునే కళకారుడిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కళాకారుడు.. గ్రామాల్లో చెట్ల కొమ్మలతో అరుదైన కళా ఖండాలను సృష్టించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాను 7వ తరగతి చదువుతున్న రోజుల్లో అప్పటి పాఠశాల ఉపాధ్యాయుడు మర్రి గోపాల్ రెడ్డి చెట్ల వేర్లతో చెక్కిన కొన్ని కళారూపాయాలను చూసి ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాని పెట్లోజు శ్రీనివాస్ చెబుతున్నాడు. తొమ్మిదో తరగతి నుంచే చెట్ల వేర్ళతో రకరకాల బొమ్మలు, పక్షులు, జంతువుల నమూనాల్లో బొమ్మలు తయారు చేసి అబ్బర పరుస్తున్నాడు. ఒకే బొమ్మలో ఇరువైపులా చూసినప్పుడు భిన్నమైన రూపాలు కనిపించడం విశేషం. సాధారణంగా చెక్కలు, బండరాళ్లపై చెక్కడం ఒక ఎత్తయితే.. చెట్ల వేర్ల ఆధారంగా బొమ్మలు తయారు చేయడం శ్రీనివాస్ కళ.
పది మందికి ఉపాధికల్పిస్తా...
ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజకూ పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో కళా ఖండాలకు ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలుసు. ఈ తరుణంలో ప్రజలకు కళ్లకు కట్టినట్లు కళా ఖండాలను రూపొందించి.. రానున్న రోజుల్లో పది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంది. అందుకు ఓ పరిశ్రమను స్థాపించాలనుకుంటున్నా. ఎవరైనా దాతలు నాకు సహాయం చేస్తే ఇంకా అద్భుతమైన కళాకండాలను తీర్చిదిద్దుతా. దాతలు సహాయం చేయాలనుకుంటే సెల్ నెంబరు 7989864843, 9885344773లలో సమాచారం తెలుసుకోవచ్చు.
Updated Date - 2020-03-16T10:16:07+05:30 IST