బోసిపోయిన రవీంద్రభారతి
ABN, First Publish Date - 2020-03-16T10:03:22+05:30
బోసిపోయిన రవీంద్రభారతి
ఆగిపోయిన సాంస్కృతిక కార్యక్రమాలు
రవీంద్రభారతి, మార్చి15 (ఆంధ్రజ్యోతి): నిత్యం కళాకారులు, కళాప్రదర్శనలతో కళకళలాడే రవీంద్రభారతి ప్రాంగణం ఆదివారం బోసిపోయింది. కరోనా ప్రభావం సాంస్కృతిక కార్యక్రమాలపై స్పష్టంగా కనిపించింది. సర్కారు ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు సాంస్కృతిక వేదికలను కూడా నిలిపివేశారు. రద్దీ ఉండే ప్రాంతాలుగా పరిగణనలోకి తీసుకున్న అధికారులు సదరు ఆడిటోరియాలను మూసివేశారు. రవీంద్రభారతిలో ఆదివారం జరగాల్సిన కార్యక్రమాలను రద్దు చేశారు. దీంతోపాటు తెలుగు వర్సిటీ, ఇందిరాప్రియదర్శిని, భారతీయ విద్యాభవన్ వంటి కళా వేదికలనూ మూసేశారు. తెలుగు వర్సిటీ అన్ని శాఖలు, కేంద్రాలు, పీఠాలు, విద్యార్థులకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు. వర్సిటీకి సంబంధించిన అన్ని హాస్టల్స్, మెస్‌ను సోమవారం నుంచి మూసివేయనున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిపాలనా కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు.
Updated Date - 2020-03-16T10:03:22+05:30 IST