ఆస్తుల నమోదు అంత ఈజీ కాదు..!
ABN, First Publish Date - 2020-10-04T09:49:04+05:30
ఆస్తుల నమోదు అంత ఈజీ కాదు..!
శివార్లలో అందుబాటులోకి రాని యూజర్ ఐడీ
వెంటాడుతున్న సాంకేతిక, కనెక్టివిటీ సమస్యలు
హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్/సరూర్‌నగర్, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల నమోదు ప్రక్రియ ఆషామాషీ కాదని క్షేత్ర స్థాయిలో పరిస్థితి బట్టి తెలుస్తోంది. సర్వే కోసం వెళ్తున్న వారికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మునిసిపల్ సిబ్బందికి, బిల్ కలెక్టర్లలో చాలా మందికి ఇంకా యాప్ యూజర్ ఐడీలు రాలేదు. దీంతో వారూ మ్యాన్యువల్‌గానే వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తులకు సంబంధించి, ఒక సెట్ డాక్యుమెంట్లను తీసుకుంటున్నారు. మీర్‌పేట్‌కు యాప్ యూజర్ ఐడీ ఇంకా రానందున మ్యాన్యువల్‌గానే ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. యాప్ అందుబాటులోకి రాగానే వివరాలు నమోదు చేస్తామని చెబుతున్నారు. తుర్కయంజాల్ మునిసిపాలిటీ పరిధిలో యాప్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాన్యువల్‌గా వివరాలు నమోదు చేస్తున్నారు. బడంగ్‌పేట్‌లో యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తుండగా, ఇంటర్‌నెట్ సమస్యలు తలెత్తుతున్నాయి. వార్డుల్లో సిగ్నల్ సరిగా అందక పోవడంతో వివరాలు నమోదు చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాంతో ఒక్కో ఇంటి వద్ద సుమారు అరగంట సేపు ఉండాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొన్నారు. సిగ్నల్ సమస్య ఉన్న చోట నిర్ణీత పత్రాలలో వివరాలు నమోదు చేసుకుంటున్నామని, కార్యాలయానికి వచ్చిన తర్వాత వాటిని అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.
మూడు రోజుల్లో 7,500..
గ్రేటర్‌లో మూడు రోజుల్లో కేవలం 7,500 ఆస్తుల వివరాలే నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 3,107 ఆస్తులు నమోదు చేశారు. మొత్తంగా గ్రేటర్‌లో 7,445 ఆస్తుల వివరాలు నమోదయ్యాయి. నిన్నా, మొన్నటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటీఐఎన్) ఆధారంగానే వివరాలు నమోదు చేయగా, తాజాగా న్యూ కేటగిరీ పేరిట పన్ను చెల్లించ ని ఆస్తుల వివరాలూ సేకరిస్తున్నారు. ఒక్కో బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ రోజూ 50 ఆస్తుల వివరాలు సేకరించాలని లక్ష్యం నిర్దేశించగా, లక్ష్యంలో మూడో వంతు వివరాలు సేకరించడమూ సాధ్యపడడం లేదు. దీంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించా రు. వీలైనంత త్వరగా ఎన్యూమరేటర్లను నియమించనున్నారు. సొంతంగా నమోదు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. యజమానులే వివరాలు నమోదు చేసేలా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆప్షన్‌లోనూ ఇబ్బందులున్నాయి. ఆధార్‌లో ఉన్న వివరాల ప్రకారమే మీ సేవా పోర్టల్‌లో నమోదు అవుతోంది. కొంచెం తేడా ఉన్నా సేవ్ కావడం లేదు.
ధరణి ఆన్‌లైన్ వివరాలు
ప్రారంభమైన సర్కిళ్లు 30
డాకెట్లు 325
పని చేస్తోన్న సిబ్బంది 333
శనివారం మధ్యాహ్నం వరకు.. 3,107
న్యూ కేటగిరీల నమోదు 388
మొత్తం సేకరించిన వివరాలు 7,445
సర్వేకు పొదుపు సంఘాల మహిళలు
ఆస్తుల వివరాల నమోదు సర్వేలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉన్న సిబ్బందితో స్థానిక అధికారులు ఈ నెల 10లోగా ఆస్తుల నమోదు సాధ్యం కాదని భావించిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడా సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల వారీగా ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాల రిసోర్స్ పర్సన్లకు రెండు రోజుల శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ, శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందికి తోడు మొత్తం రిసోర్స్ పర్సన్లను వినియోగించుకుని సర్వే చేయించనున్నారు.
ఇవీ ఇబ్బందులు..
ఎల్బీనగర్ పరిధిలోని కొందరు స్థానికులు మునిసిపల్ సిబ్బందిని ఇళ్లల్లోకి రానిచ్చేందుకు సందేహిస్తున్నారు. ‘ఆస్తుల వివరాలు చెప్పాలా, ఎందుకు చెప్పాలి, ప్రభుత్వ జీవో ఉందా’ అంటూ కొందరు ప్రశ్నించారు.
ఆస్తుల నమోదు విషయంపై కొందరికి అవగాహన లేకపోవటంతో సహకరించని పరిస్థితి కనిపిస్తోంది.
మునిసిపల్ సిబ్బంది కేవలం ఇంటి నంబర్ ఉన్న వారి ఆస్తుల నమోదు మాత్రమే చేస్తున్నారు. వారికి సంబంధించిన కొంత డేటా ఇప్పటికే అప్ లోడ్ అయి ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంటి నంబర్ లేకపోయినా, కేవలం ప్లాట్ నంబర్ ఉన్నా నమోదు చేయడం లేదు. ఇతరుల నుంచి ఇల్లు కొనుగోలు చేసి, ఇంటి నంబ ర్, కరెంటు, వాటర్ బిల్లుల మ్యుటేషన్ పెండింగ్‌లో ఉంటే, నమోదు సమయం లో పాత యజమాని వివరాలే వస్తున్నాయి.
పలువురు కేవలం తమ ఆధార్, ఇతర వి వరాలు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
మా ఆస్తుల వివరాలు మీకెందుకు చెప్పాలని కొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో సిబ్బంది అరకొర వివరాలతోనే సరి పెడుతున్నారు.
Updated Date - 2020-10-04T09:49:04+05:30 IST