ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చర్లపల్లి’కి చేరేదెలా..?

ABN, First Publish Date - 2020-02-10T08:43:23+05:30

కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎప్పటికప్పుడు రైళ్ల నిర్వహణ, అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో మెగా ప్రాజెక్టుతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తగిన రవాణా సదుపాయాలు కరువు

స్టేషన్‌ టెర్మినల్‌ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ.5కోట్ల నిధులు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు

ఈ ఏడాదిలోనే 5 ప్రైవేట్‌ రైళ్లు పరుగులు పెడుతాయని జీఎం వెల్లడి

టెర్మినల్‌గా అభివృద్ధి చేసినా స్టేషన్‌కు త్వరగా వెళ్లలేని పరిస్థితి

ఆందోళనకు గురవుతున్న ప్రయాణికులు 


సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎప్పటికప్పుడు రైళ్ల నిర్వహణ, అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో మెగా ప్రాజెక్టుతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివ సిస్తున్న 1.20 కోట్ల మంది ప్రజలకు సరళమైన రైలు సేవలందించేందుకు కసరత్తు చేస్తోంది. రైళ్ల కోసం గంటలపాటు నిరీక్షించకుండా త్వరగా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లపై నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు రైల్వే చేపట్టిన చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులను త్వరితగతిన  పూర్తి చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.


ఇటీవల రైల్వేశాఖ ప్రతిపాదించిన ప్రైవేట్‌ రైళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలెక్కుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్యా మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టినట్టేనని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లాంటి స్టేషన్లకు వెళ్లకుండా నేరుగా చర్లపల్లికి వెళ్లేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 


ప్రైవేట్‌ రైళ్లు ఈ స్టేషన్‌ నుంచే..

నగర శివార్లలో అభివృద్ధి చెందుతున్న రైల్వేస్టేషన్లలో చర్లపల్లి స్టేషన్‌కు ప్రాముఖ్యత ఉంది. ఈ స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాలకు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను నడిపిస్తే ప్రధాన స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుందని కొన్నేళ్లుగా ప్రయాణికుల సంఘం నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులను కోరుతూ వస్తున్నారు. ఈ తరుణంలో 2020-21 కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి రైల్వే సదుపాయాలకు నిధులు, అదనపు రైళ్లు కేటాయించారు. తాజా రైల్వే బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా ప్రతిపాదించిన 150 ప్రైవేటు రైళ్లలో ఐదు రైళ్లు చర్లపల్లి స్టేషన్‌ నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు బయలుదేరనున్నాయని చెప్పడంతో దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. 


రవాణా సదుపాయాలు కరువు..

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లతో పోల్చితే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి స్టేషన్‌కు తగిన రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి నుంచి వచ్చేందుకు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లడంపై ప్రయాణికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఈ స్టేషన్‌కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్‌ రైళ్లు లేకపోవడంతోపాటు ఆర్టీసీ బస్సు సదుపాయం కూడా సక్రమంగా లేదు. ఈ క్రమంలో సొంత వాహనాలపె, లేకుంటే ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి 13 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాచిగూడ స్టేషన్‌ నుంచి 23 కిలోమీటర్లు, గచ్చిబౌలి నుంచి 25 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. కాగా, లింగంపల్లి నుంచి 40 కిలోమీటర్ల దూరం, ఎల్బీనగర్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే 8 ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాజీపేట్‌ వైపునకు వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లలో చర్లపల్లి స్టేషన్‌కు చేరుకునే సదుపాయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ప్రాంతాల నుంచి చర్లపల్లి చేరుకోవడమే కష్టమైన పరిస్థితి ఉండగా, గచ్చిబౌలి, లింగంపల్లి, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ఏరియాల నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం, రూ.వందల వరకు రవాణా చార్జీలు భరించక తప్పదు. ఆటో ఎక్కితే కనీసం రూ. 50 డిమాండ్‌ చేస్తున్న ప్రస్తుత రోజుల్లో శివారు ప్రాంతాల నుంచి ఆటోలో వెళ్లాలంటే తడిసి మోపెడు కావాల్సిందే. గచ్చిబౌలి లాంటి ప్రాంతం నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే రూ.500పైగా వెచ్చించక తప్పదు. 


సౌకర్యాలు పెంచితేనే ఉపయోగం..

చర్లపల్లి స్టేషన్‌కు నగరం నలుమూలలకు చెందిన ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా అటు ఆర్టీసీ బస్సులు, ఇటు ఎంఎంటీఎస్‌ సర్వీసుల సదుపాయాలను మెరుగు పరచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్‌ రైళ్లు కూత పెట్టేలోపు, టెర్మినల్‌ పూర్తిస్థాయి అభివృద్ధి జరిగే లోపు చర్లపల్లి స్టేషన్‌కు నగరం నలుమూలల నుంచి రవాణా సదుపాయాన్ని కూడా మెరుగు పరచడంపై రైల్వే యంత్రాంగం దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ప్రయాణికులు, ప్రయాణణికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తెలియజేస్తున్నారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి వారణాసి, పన్వేలి, శాలిమార్‌, చెన్నయ్‌, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లు నడిపించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ స్టేషన్‌ శీఘ్రాభివృద్ధికి చొరవ చూపాలని వారు కోరుతున్నారు. 


సా..గుతున్న టెర్మినల్‌ అభివృద్ధి పనులు 

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలోని చర్లపల్లి స్టేషన్‌ను నూతన టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు చాలా కాలం కిందటే వచ్చాయి. దీనికి రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కొన్నేళ్ల క్రితం పనులకు కూడా శ్రీకారం చుట్టి ప్రత్యేక నిధులను కేటాయించింది. నూతన టెర్మినల్‌ నిర్మాణం కోసం రైల్వేకు చెందిన 50 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలానికి ఆనుకునిఉన్న 150 ఎకరాల స్థలం కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణమధ్యరైల్వే అధికార యంత్రాంగం విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సుముఖత లేకపోవడంతో రెండేళ్లపాటు నిరీక్షించింది.


ఇక లాభం లేదని ఏడాదిన్నర క్రితం సొంత (రైల్వే) స్థలంలోనే టెర్మినల్‌ అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు. రెండు ప్లాట్‌ఫారాలు ఉన్న చర్లపల్లి స్టేషన్‌లో కొత్తగా మరో 6 ప్లాట్‌ఫారాలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు పెంచాలని, ఇతర నిర్వహణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు పనులు కొన సాగుతున్నాయి. ఈ పనులను మరింత వేగంగా చేపట్టడమే కాకుండా, స్టేషన్‌కు కనెక్టివిటీ ఏర్పాటుపై రైల్వే యంత్రాంగం దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి జరిగితే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. టెర్మినల్‌ అభివృద్ధి జరిగితే ఆర్టీసీ బస్సు సదుపాయం మెరుగవుతుందని పేర్కొంటున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున చర్లపల్లి స్టేషన్‌కు సొంత వాహనాల ద్వారా చేరుకోవడం పెద్ద సమస్యే కాకపోవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా బడ్జెట్‌లో రూ. 5 కోట్ల నిధులను చర్లపల్లికి రైల్వే శాఖ కేటాయించడంతో టెర్మినల్‌ అభివృద్ధి పనులు మరింత ఊపందుకుంటాయని వారు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-02-10T08:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising