అధిక లాభాల పేరుతో రూ. 9.60 లక్షలు స్వాహా
ABN, First Publish Date - 2020-09-14T09:52:25+05:30
తమ సంస్థలో రూ.30 వేలు పెట్టుబడి పెడితే 4 నుంచి 6 నెలల్లో రూ. 4 లక్షలు పొందవచ్చంటూ నగరవాసి నుంచి రూ. 9.60
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 13: తమ సంస్థలో రూ.30 వేలు పెట్టుబడి పెడితే 4 నుంచి 6 నెలల్లో రూ. 4 లక్షలు పొందవచ్చంటూ నగరవాసి నుంచి రూ. 9.60 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన షామ్‌శర్మ 2017లో ‘మనీ సీజర్’ పేరుతో నకిలీ సంస్థను స్థాపించాడు. అనంతరం 2018లో ‘టాప్ గ్లోబల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్’గా పేరు మార్చి మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా మార్కొనియా ప్రాంతంలో కాల్ సెంటర్ ప్రారంభించాడు.
అదే ప్రాంతానికి చెందిన శివశంకర్ ఆదిత్య, అభిషేక్ సోని, అభిలాష్ చౌదరి, రోహిత్‌జైన్, భావే్‌షభారగి, వినేక్ పటేరియా, అక్తర్ హయత్, అతుల్ పటేరియా, రాహుల్‌సోని అనే 9 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. వీరు తమను తాము బిజినెస్ డెవలప్ మేనేజర్లుగా పరిచయం చేసుకొని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసేవాళ్లు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి నగదును షేర్ మార్కెట్లో పెట్టి అధిక మొత్తంలో లాభాలు ఇస్తామంటూ మభ్యపెట్టేవారు. వీరు నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి నూతక్కి కొటి శివకాకాని సుధాకర్ అనే వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించారు. కేవలం రూ. 30 వేలు పెట్టుబడి పెడితే 4 నుంచి 6 నెలల్లో రూ.4 లక్షల వరకు లాభం పొందొచ్చని చెప్పారు.
వారి మాటలు నమ్మిన సుధాకర్ వారు చెప్పిన విధంగా డీమాట్ అకౌంట్‌ను ప్రారంభించి వారికి ఐడీ, పాస్‌వర్డ్‌లను అందించాడు. సుధాకర్ ఖాతానుంచి రూ. 9.60 లక్షలు వేరే ఖాతాలోకి బదిలీ చేసుకున్న నిందితులు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు నకిలీ పత్రాలను పంపారు. నెలలు గడిచినా ఎలాంటి లాభాలను వారు వచ్చినట్లు చూపకపోవడంతో వారికి పలుమార్లు ఫోన్లు చేశాడు మెసేజ్‌లు పెట్టాడు. అయినా వారు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి ఈ ఏడాది మార్చి 11న రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు, సాంకేతిక ఆధారాలు, బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రాచకొండ సైబర్‌క్రైం టీం ఒకటి మధ్యప్రదేశ్ వెళ్లి, మార్కొనియా ప్రాంతంలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 13 హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్, 18 మొబైల్‌ఫోన్లు, 4 డెబిట్/ క్రెడిట్ కార్డులు, 17 సిమ్‌కార్డులతోపాటు వైఫై రూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానికంగా ఉన్న కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆదివారం నగరానికి తరలించి కోర్టులో హాజరుపరిచారు.
Updated Date - 2020-09-14T09:52:25+05:30 IST