నాకే ఎందుకిలా?.. కరోనా పేషెంట్లలో భావోద్వేగ సమస్యలు
ABN, First Publish Date - 2020-09-14T20:37:54+05:30
హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. తర్వాత ఆయన తండ్రికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ ఇంట్లోనే వేరే గదిలో ఉంటున్నారు.
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. తర్వాత ఆయన తండ్రికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ ఇంట్లోనే వేరే గదిలో ఉంటున్నారు. కొద్దిరోజులకు తండ్రి మృతి చెందాడు. ఇంతలో తల్లికి కూడా జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. భర్త చనిపోవడం, తనకు కరోనా సోకినట్టు అనుమానం రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఖైరతాబాద్‌కు చెందిన ఒక వృద్ధుడికి (65), ఆయన భార్యకు (60) వైరస్ పాజిటివ్ వచ్చింది. రోజులో ఎక్కువసేపు తమ దగ్గరే ఉండి ఆడుకునే మనవలకు ఆ వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
..కరోనా దెబ్బకు ఇలా అతలాకుతలమైన జీవితాలు ఎన్నో! కరోనా వచ్చినవారిలో కొందరు.. ఆ వైరస్ తమకెక్కడ సోకుతుందోనన్న భయంతో ఇంకొందరు.. బలవంతంగా ఉసురుతీసుకుంటున్నారు. చుట్టుపక్కలవారు తమను వెలివేసినట్టుగా ప్రవర్తించడంతో (సోషల్ రిజెక్షన్) భావోద్వేగపరమైన సమస్యలకు (ఎమోషనల్ ట్రామా) గురవుతున్నారు. ‘నాకే ఎందుకిలా జరిగింది’ అనే ఆలోచనతో సతమతమై.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మానసిక సంఘర్షణ...
కరోనా వస్తే ఇంట్లోనే విడిగా ఉండాలి. అయినవారే తాకకూడని పరిస్థితి. ఇతరులకు సోకకుండా ఉండేందుకే ఆ జాగ్రత్త అని సరిపెట్టుకున్నా.. తమను అంటరానివారిగా చూడడం చాలా మంది కరోనా పేషెంట్లను బాధిస్తోంది. దీనికితోడు.. వైరస్ తగ్గుతుందో లేదో, బతికి బట్టకడతామో లేదోనన్న ఆందోళన పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరినవారికి ఆర్థిక సమస్యలు అదనం. ‘‘హోం ఐసోలేషన్‌లో ఉండే కరోనా పేషెంట్లలో కొందరు నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని భరించలేరు. తమ బాధను పంచుకునేవారు లేక.. ఏ అర్ధరాత్రి పూటో ఊపిరి తీసుకోవడం కష్టమైతే ఆదుకునే వారు ఉండరు అనే భావనతో పాజిటివ్స్‌లో ఒక రకమైన మానసిక వేదన మొదలువుతుంది. అది చిలికి...చిలికి గాలివానగా మనస్సును అల్లకల్లోలం చేసి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది’’ అని మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఇటీవలికాలంలో జరుగుతున్న కరోనా ఆత్మహత్యలకు కారణం ఇదేనని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-09-14T20:37:54+05:30 IST