ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకాలతోనే..నా కాలక్షేపం

ABN, First Publish Date - 2020-05-29T09:13:16+05:30

‘తెలుగు సాహిత్యంలో ‘వేలుపిళ్లై’ కథలు ఎంతటి విలక్షణమైనవో తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రఖ్యాత కథా రచయిత సి.రామచంద్రరావు


‘‘ఆయన వయసు 90ఏళ్లు. రోజూ రెండు గంటలు కచ్చితంగా వర్కవుట్స్‌ చేయాల్సిందే. అదీ సాదాసీదా వ్యాయామాలు కాదు. ఇక నిత్యం భోజనంలో నాన్‌వెజిటేరియన్‌ తీసుకోవాల్సిందే. మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన ఒంటికి చాలా దూరం. ఆయనే ప్రఖ్యాత కథా రచయిత సి.రామచంద్రరావు. లాక్‌డౌన్‌లో ఆయన దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు, ఆరోగ్య రహస్యం వెనుక అసలు కారణాలు, జీవనశైలి అలవాట్ల గురించి ఆయన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం...


హైదరాబాద్‌ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి) :

‘తెలుగు సాహిత్యంలో ‘వేలుపిళ్లై’ కథలు ఎంతటి విలక్షణమైనవో తెలిసిందే. ఆ కథల్లో తొణికిసలాడే అసమాన జీవిత చిత్రాలు, రచనా శైలి, శిల్పం అద్భుతమని చాసో, నండూరి రామ్మోహనరావు వంటి ప్రఖ్యాత రచయితలు వేనోళ్లా కొనియాడిన సందర్భాలెన్నో.! అంతటి విలక్షణమైన కథలు రాసిన సి.రామచంద్రరావును ‘అనుభవం’ శీర్షికకు ఇంటర్వ్యూ కోసం ఆంధ్రజ్యోతి పలకరించింది. మొదట, అతిథి మర్యాదలో భాగంగా ఆయన ‘వాట్‌ యు డ్రింక్‌’... టీ, కాఫీ, బీర్‌, విస్కీ’ అని మమ్మల్ని అడిగారు. ఆ చివరి రెండు పేర్లు విని, నిర్ఘాంతపోవడం మావంతైంది. మేము వెంటనే తేరుకొని, ‘వాటర్‌ చాలన్నాం’. రామచంద్రరావు చాలాకాలం ‘నీలగిరి టీ ఎస్టేట్‌’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తొలినాళ్లలో ఆయన ఉద్యోగ జీవితంలో భాగంగా బ్రిటీషర్లతో ఎక్కువగా కలిసి ప్రయాణించారు. ఇంటికొచ్చిన అతిథులకు వైన్‌ లేక విస్కీ ఆఫర్‌ చేయడం యూరోపియన్‌ సంస్కృతిలో భాగం కదా.! బహుశా, రామచంద్రరావు కూడా మర్యాద కోసం అలా అడిగుంటారనుకున్నాం.


ఇక ‘లాక్‌డౌన్‌లో మీ రొజూవారీ జీవితం ఎలా సాగుతోంద’ని అడిగితే, ఆయన ఒక చిరునవ్వు విసిరి, ఇలా మొదలుపెట్టారు ...‘‘రోజూ ఆరింటికి నిద్రలేస్తాను. తర్వాత కచ్చితంగా వర్కవుట్స్‌ చేస్తా. వ్యాయామం అంటే, నడవడమో లేక కాళ్లు, చేతులు ఆడించడమో కాదు. డంబెల్స్‌, పుషప్స్‌, క్రంచెస్‌, బైసెప్స్‌, ట్రైసెప్స్‌... ఇలా చాలా ఎక్సర్‌సైజెస్‌ చేస్తాను. ఇలా ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వర్కవుట్స్‌ చేయడం యాభై ఏళ్లుగా నా డైలీ లైఫ్‌లో భాగం. ఒక్కరోజు కూడా వ్యాయామాన్ని మిస్‌ చేయను. 


టెన్నిస్‌ నుంచి గోల్ఫ్‌కు మారా...

లాక్‌డౌన్‌కు ముందు నా రెగ్యులర్‌ లైఫ్‌ కాస్త భిన్నంగా సాగేది. వర్కవుట్స్‌ ముగిశాక, ఎనిమిదింటికి బొల్లారంలోని ఆర్మీ గోల్ఫ్‌ కోర్టుకు బయలుదేరతా. అక్కడ కనీసం రెండు గంటలైనా గోల్ఫ్‌ ఆడాల్సిందే. నేను టెన్నిస్‌ ప్లేయర్ని. మాది టెన్నిస్‌ ఫ్యామిలీ. ప్రఖ్యాత టెన్నిస్‌ ప్లేయర్‌ మహేశ్‌ భూపతి నా తమ్ముడి కొడుకు. నా సంగతికొస్తే, 16ఏళ్లప్పుడు జూనియర్స్‌ టోర్నమెంట్లో చాంపియన్‌గా గెలిచాను. ఆంధ్రా స్టేట్‌ నుంచి టెన్నిస్‌ నెంబర్‌ వన్‌ పొజిషన్‌లోనూ ఉన్నా. కొంతకాలం మైసూర్‌ స్టేట్‌ (1956కు ముందు)కు ప్రతినిధిగానూ ఆడాను. కంటిచూపు కాస్త తగ్గడంతో పదేళ్ల కిందట టెన్నిస్‌ నుంచి గోల్ఫ్‌కు మారాను. నా పెద్ద కూతురు రమా రావు వయసు 64ఏళ్లు. ఇప్పటికీ ఆమె రోజూ టెన్నిస్‌ ఆడతారు. గోల్ఫ్‌కోర్టు నుంచి తిరిగి వస్తూ, సికింద్రాబాద్‌ క్లబ్‌ లైబ్రరీలో ఒక గంట గడుపుతా. అక్కడ చాలా అరుదైన పుస్తకాలుంటాయి.


లాక్‌డౌన్‌తో నేను గోల్ఫ్‌కోర్టునూ, లైబ్రరీని బాగా మిస్‌ అవుతున్నా. నేను ఇల్లు దాటి రెండున్నర నెలలు అవుతోంది. ఇప్పుడు రోజుకు దాదాపు ఆరుగంటలు పుస్తకాలు చదవడంతో సరిపోతోంది. అయితే, నేను చదువుతున్న బుక్స్‌ పేర్లు మాత్రం బయటకు చెప్పలేను. కానీ, ఒకేసారి మూడు, నాలుగు పుస్తకాలు చదవడం నాకు మొదటి నుంచి అలవాటు. అప్పుడప్పుడు ఆసక్తి కొద్దీ ‘చాటువులు’, ‘పాండవ ఉద్యోగ విజయాలు’ చదువుతుంటా. ఓటీటీ ప్లాట్‌ఫాంలోని సినిమాలతో కాస్త కాలక్షేపం అవుతోంది. ఇంగ్లిష్‌ మూవీస్‌ ఎక్కువ చూస్తుంటా. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక రెండు గంటలు కచ్చితంగా నిద్రపోతాను. రాత్రిళ్లూ నాకు బాగా నిద్రపడుతుంది. ఇక రచనా వ్యాపకం అంటే, రాయాలనుకున్నప్పుడే రాస్తాను.! 


మధ్యాహ్నం బీర్‌.. రాత్రికి విస్కీ..

నాకు షుగర్‌, బీపీ వంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. నేను హైదరాబాద్‌లో స్థిరపడి 33ఏళ్లు. అప్పటి నుంచి కాఫీ, టీ పూర్తిగా మానేశా. ముప్పై ఏళ్ల పాటు నేను నీలగిరి టీ ఎస్టేట్‌ ప్లాంటేషన్‌లో పనిచేశా. గతంలో తమిళనాడు ప్లాంటర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ ఉన్నాను. నాకు అక్కడ అలవాటైన టీ వేరు. ఆ తయారీ పద్ధతి ఇక్కడి మా వంటవాళ్లకు తెలియదు. పాలు కలిపి మరిగించిన టీ నాకు అస్సలు నచ్చదు. కనుక వాటికి దూరంగా ఉన్నా. ఉదయం ఎనిమిదింటి లోపే బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి అవుతుంది. అందులో పూరి, వడ, పెసరట్టు...ఇలా రోజుకొక వెరైటీ తింటాను. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక బీర్‌ కచ్చితంగా తాగుతాను.


చికెన్‌, మటన్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఏదో ఒక నాన్‌వెజ్‌ కర్రీ ప్రతిరోజూ తప్పనిసరి..! రోజుకొక కోడిగుడ్డు తింటాను. పండ్లూ ఎక్కువగా తీసుకొంటా. వెజిటేబుల్‌ కర్రీ తినడమంటే వెరీ రేర్‌, ఎప్పుడో ఒకసారి అంతే.! రాత్రి తొమ్మిదింటికి డిన్నర్‌ చేస్తాను. తర్వాత 11 గంటలకు రెండు పెగ్గులు విస్కీ తాగి, నిద్రపోతా. ఎప్పుడైనా పార్టీలు, ఫ్రెండ్స్‌తో కూర్చొన్నప్పుడు మాత్రం మరొక పెగ్‌ ఎక్కువ తీసుకుంటా. అంతకు మించి ఒక్క డ్రాప్‌ కూడా ఎక్కువ తాగను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కు వ తింటా. రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరిగా చే స్తా. నెగెటివ్‌ థాట్స్‌ నా ఆలోచనలకు చాలా దూరం. ఇవే నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని నమ్ముతున్నా’’ అని రామచంద్రరావు చెబుతున్నారు.

Updated Date - 2020-05-29T09:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising