ములుగు ఏజెన్సీలో హై అలర్ట్
ABN, First Publish Date - 2020-10-04T15:04:05+05:30
తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో గత రెండు నెలలుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న విషయం విదితమే....
హైదరాబాద్ : తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో గత రెండు నెలలుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. భద్రాద్రిలో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం మావోలు తప్పించుకున్నారని వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ములుగు ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వెంకటాపురంలో పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చారన్న సమాచారంతో ఈ భేటీ జరుగుతోంది. కాగా.. రెండు నెలల్లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం రెండోసారి. సమావేశం అనంతరం డీజీపీ, ఐజీ ఇరువురూ మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తారని తెలిసింది.
కాగా.. శనివారం నాడు భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలను చత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లో గుర్తించామన్నారు. చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, ములుగు సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఈ గాలింపులో చత్తీస్‌ఘడ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూడా భాగమయ్యాయని.. అడవిలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నామని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.
Updated Date - 2020-10-04T15:04:05+05:30 IST