రైలు కదలక.. కడుపు నిండక..!
ABN, First Publish Date - 2020-09-14T10:01:28+05:30
‘యువర్ అటెన్షన్ ప్లీజ్’.. ఈ సౌండ్ వినిపించగానే వారి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఆ గొంతు వారి జీవన విధానంలో ఓ భాగంగా మారిపోయింది. బోగీల నుంచి భారీ లగేజీలతో దిగే
- రైల్వే కూలీల ఆకలి కేకలు.. వేరే పని రాకపాయె.. ఇచ్చేవారు లేకపాయె
- తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో హమాలీ కుటుంబాలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘యువర్ అటెన్షన్ ప్లీజ్’.. ఈ సౌండ్ వినిపించగానే వారి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఆ గొంతు వారి జీవన విధానంలో ఓ భాగంగా మారిపోయింది. బోగీల నుంచి భారీ లగేజీలతో దిగే ప్రయాణికులే వారికి అత్యంత ఆప్తులు. ఎర్రచొక్కా, ఖాకీ నిక్కరు, భుజాన లైసెన్సు బిల్ల ధరించి క్రమశిక్షణతో పనిచేస్తూ పొట్టపోసుకునే ఈ రైల్వేకూలీ.. నేడు కరోనా కారణంగా ‘బండి’ కదలక పోవడంతో బతుకు ‘బండి’ లాగలేకున్నాడు. సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాడు.
ఇల్లు, ప్లాట్‌ఫాం తప్ప వేరే లోకం తెలియని ఈ కష్టజీవుల కడుపుపై కరోనా వేటు బలంగా పడింది. రైళ్ల కూత ఆగి ఆరు నెలలు దాటింది. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలతో కళకళలాడిన రైల్వే స్టేషన్లు.. నేడు రైల్వే కూలీల జీవితాల్లా కళావిహీనంగా తయారయ్యాయి. అడపాదడపా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా.. కరోనా నిబంధనల వల్ల ఈ కూలీలకు మాత్రం పనిలేకుండా పోతోంది. చాలామంది రైల్వే కూలీలకు ఇది తప్ప మరో పని తెలియదు. ఒక వేళ తెలిసినా.. పనులిచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. లాక్‌డౌన్ కాలం నుంచి వివిధ వర్గాల వారికి చేయూతనందిస్తున్న ప్రభుత్వం.. తమను కూడా ఆదుకోవాలని ఈ శ్రమజీవులు కోరుతున్నారు. తమను నాలుగో తరగతి రైల్వే ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకుంటున్నారు.
దక్షిణ మధ్య రైల్వేలో..
దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్, గుంతకల్లు డివిజన్ల పరిధిలో సుమారు 20 వేల మంది వరకు లైసెన్సు ఉన్న కూలీలు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో 220, హైదరాబాద్‌లో 50, కాచిగూడలో 40, లింగంపల్లిలో ముగ్గురు లైసెన్సు ఉన్న కూలీలు ఉన్నారు. ఈ స్టేషన్లతోపాటు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వందలాది మంది పనిచేస్తున్నారు. కరోనా కారణంగా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా ప్రతి రోజు గోదావరి, ఫలక్‌నుమా, దానాపూర్, గోల్కొండ, రాయలసీమ, తెలంగాణ ఎక్స్‌ప్రె్‌సలు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో.. రోజుకు 55 మందికే పని దొరుకుతోంది. ఇలా ఒక్కో కూలీకి నాలుగు రోజులకు ఒకసారే పని దొరుకుతోంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో నాలుగు రోజుల సంపాదన రూ.400 దాటడంలేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోందని రైల్వే కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రమే ఆదుకోవాలి
కరోనా కారణంగా రైల్వే కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలోలా రైళ్లు నడవకపోవడంతో చేతి నిండా పని దొరకడం లేదు. లాక్‌డౌన్ కంటే ముందు ఒక్కో కూలీకి రోజుకు రూ.800 వరకు వచ్చేది. ఇప్పుడు రైళ్లు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో కూలీకి నెలకు రూ.10 వేల చొప్పున అందించాలి. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి.
ఎగ్గిడి వెంకటేష్, రైల్వే పోర్టర్ల సంఘం
Updated Date - 2020-09-14T10:01:28+05:30 IST