భూముల జాబితాపై సర్కారీ నిషేధం
ABN, First Publish Date - 2020-03-01T09:03:17+05:30
సర్కారీ భూములు అంగడి సరుకుగా మారాయి. ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, దేవాదాయ, పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం గుర్తించిన భూములను అడ్డదిడ్డంగా అమ్ముకుంటున్నారు. క్రయవిక్రయాలు బాజాప్తాగా జరుగుతున్నాయి. ఇందుకు కారణం..
- రూపకల్పనకు హైకోర్టు ఆదేశించి నాలుగేళ్లు
- జాబితాను 2016లోనే పంపిన తహసీల్దార్లు
- ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పక్కనబెట్టిన కలెక్టర్లు
- బాజాప్తాగా ప్రభుత్వ భూముల కబ్జాపర్వం
- ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ లేకపోవడమే కారణం
- నవీకరణ తర్వాత తెలంగాణలో భూముల లెక్క
- భూదాన్ భూములు 3,933 ఎకరాలు
- ప్రభుత్వ కార్యాలయాలు/ఇతర భవనాలు 25,773 ఎకరాలు
- దేవాదాయ భూములు 36,584 ఎకరాలు
- నీటిపారుదల ప్రాజెక్టులు/శిఖం భూములు 5,88,556 ఎకరాలు
- వక్ఫ్ భూములు 11,473 ఎకరాలు
- ప్రభుత్వ భూములు 17,64,312 ఎకరాలు
- అటవీ భూములు 19,96,356 ఎకరాలు
సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో జీఎల్‌ఆర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.1,100 కోట్లపైనే! గత ఆరేళ్లలో ఇందులో సగానికిపైగా భూమి మాయమైంది! ఎవరికి దొరికినంత వాళ్లు కబ్జా చేస్తున్నారు!!
వనపర్తి నడిమధ్యలో 3.20 ఎకరాలను దేవాలయాల కోసం రాజా రామేశ్వరరావు కొనుగోలు చేశారు. దేవాదాయ శాఖ జాబితా (సెక్షన్ 43ఏ)లో చేర్చారు. దీన్ని నిషేధిత జాబితాలో చేర్చకపోవడంతో విలువైన ఈ భూమి విక్రయాలు జరిగిపోయాయి. న్యాయస్థానంలో స్టే ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లతో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ భూమి విలువ అక్షరాలా రూ.100 కోట్ల పైనే.
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): సర్కారీ భూములు అంగడి సరుకుగా మారాయి. ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, దేవాదాయ, పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం గుర్తించిన భూములను అడ్డదిడ్డంగా అమ్ముకుంటున్నారు. క్రయవిక్రయాలు బాజాప్తాగా జరుగుతున్నాయి. ఇందుకు కారణం.. ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీవోబీ)ను సిద్ధం చేయకపోవడమే! నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే! నిజానికి, రిజిస్ట్రేషన్ యాక్ట్-1908లోని సెక్షన్ 22(ఏ) కింద విక్రయించడానికి వీల్లేని భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించి నాలుగేళ్లు అవుతోంది. కానీ, దానిని సిద్ధం చేసే పనిని ప్రభుత్వం అటకెక్కించింది. భూ రికార్డుల నవీకరణ తర్వాత ప్రభుత్వ, ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న భూముల విషయంపై స్పష్టత వచ్చినా.. సెక్షన్ 22(ఏ) ప్రకారం విక్రయాలను నిషేధించే ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీవోబీ)ను సిద్ధం చేయలేదు. జిల్లా కలెక్టర్లే ఈ జాబితాను సిద్ధం చేసి సీసీఎల్‌ఏ ద్వారా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు పంపించాలి. ప్రజల కోసం దీన్ని వెబ్‌సైట్‌లో పెట్టాలి. కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు పూర్తికావస్తున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో సిద్ధం చేసిన జాబితానే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒకసారి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగితే.. ఆ డీడ్‌ను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని ఇటీవలే ఓ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు జరగడానికి ముందే ఒకటికి పదిసార్లు పరిశీలించే అవకాశం పీవోబీతో ఉంటుంది. కానీ, పీవోబీ లేకపోవడంతో సర్కారు భూములను గంపగుత్తగా అమ్ముకుంటున్నారు.
వివరాలు ఉన్నా జాబితా ఏదీ!?
భూ రికార్డుల నవీకరణ తర్వాత రాష్ట్రంలో ఏయే రకాల భూములు ఎంత మేరకు ఉన్నాయో స్పష్టత వచ్చింది. మరోవైపు, వివిధ ప్రాజెక్టుల కోసం నాలుగున్నరేళ్లలో దాదాపు 70 వేల ఎకరాలకుపైగా భూములను సేకరించారు. వాటి యజమానులకు పరిహారం ఇచ్చినా రికార్డుల్లో పాత యజమానుల పేర్లే ఉంటున్నాయి. ఈ అంశంపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అసహనం వ్యక్తం చేశారు. దాంతో, కొత్త జాబితాను అనుసరించి పీవోబీని సిద్ధం చేయాలని పలువురు కోరుతున్నా సర్కారులో కదలిక లేదు. నిజానికి, ఈ ప్రక్రియనంతా పర్యవేక్షించే సీసీఎల్‌ఏ పోస్టు మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉండడంతో భూ పరిపాలనంతా అటకెక్కింది.
అంగట్లో వేల కోట్ల భూములు
భూ రికార్డుల నవీకరణతో ప్రభుత్వ భూముల వివరాలు బయటికి వచ్చాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంది. చాలా చోట్ల భూములు మాయమైనా.. కొన్నిచోట్ల నిక్షేపంగానే ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో తహసీల్దార్లు 2016లోనే నిషేధిత ఆస్తుల జాబితాను కలెక్టర్లకు పంపించగా.. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో ఆ జాబితా గెజిట్ నోటిఫికేషన్‌కు నోచుకోలేదని తెలుస్తోంది. ‘‘2016లోనే జాబితా పంపించాం. దానిని పక్కనపెట్టేశారు’’ అంటూ తహసీల్దార్ ఒకరు వాపోయారు కూడా! ఇక, హైకోర్టు ఆదేశాలతో 2017 సెప్టెంబరు 1న నిషేధిత ఆస్తుల జాబితాపై అభ్యంతరాలు/విజ్ఞప్తుల పరిశీలనకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎవరైనా ఆధారాలతో విజ్ఞప్తులు చేస్తే విచారణ జరిపించడం.. అవసరమైతే నవీకరించడం కమిటీ బాధ్యత. అయితే, కమిటీ వేసిన తర్వాత అసలు నవీకరణ లేదు.. జాబితా సవరణా లేదు. ఇందుకు కమిటీకి అసలు చైర్మనే(సీసీఎల్‌ఏ) లేరు.
Updated Date - 2020-03-01T09:03:17+05:30 IST