రిజిస్ట్రేషన్లలో మరింత ఊపు
ABN, First Publish Date - 2020-05-09T09:35:05+05:30
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మరింత స్పీడందుకున్నాయి. భూములు/స్థలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మూడు రోజుల క్రితం పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడంతో కొనుగోలుదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. అయితే.. ఇదివరకే చలాన్లు కట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నవారే
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మరింత స్పీడందుకున్నాయి. భూములు/స్థలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మూడు రోజుల క్రితం పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడంతో కొనుగోలుదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. అయితే.. ఇదివరకే చలాన్లు కట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతోపాటు సంగారెడ్డి, వరంగల్ అర్బన్ వంటి చోట్ల కూడా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల కంటే స్థలాలు/భూముల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా 43 రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా మందగించాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉన్నప్పటికీ.. డాక్యుమెంట్ రైటర్లు, కింది స్థాయి సిబ్బంది లేక కొనుగోలుదారులు కార్యాలయాలకు రాలేకపోయారు. దాంతో లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 10-15 వరకే డాక్యుమెంట్లు రిజిస్టరయ్యేవి. అయితే రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్ వంటి రాబడుల శాఖల పూర్తి స్థాయి కార్యకలాపాలకు ప్రభుత్వం బుధవారం నుంచి అనుమతించడంతో మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. బుధవారం 700 వరకు డాక్యుమెంట్లు రిజిస్టర్ అయి.. రూ.3.2 కోట్ల మేర ఆదాయం, గురువారం 1545 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయి.. రూ.5.3 కోట్ల రాబడి వచ్చింది. శుక్రవారం మాత్రం ఏకంగా 2151 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయి.. రూ.5.34 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈ నెలలో ఎనిమిది రోజుల ఆదాయం రూ.17.97 కోట్లుగా నమోదైంది. మొత్తం 3497 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సాధారణ రోజుల్లోనైతే ఒక్క రోజుకే 6000-7000 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతుంటాయి.
రవాణా శాఖ రాబడి రూ.2.21 కోట్లు
రవాణా శాఖ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని 54 ఆర్టీఏ/యూనిట్ కార్యాలయాల ద్వారా గురువారం 1580 లావాదేవీలు జరగగా.. శుక్రవారం 2602 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటి ద్వారా రూ.2.21 కోట్ల రాబడి వచ్చింది. అయితే తొలిరోజు వచ్చిన ఆదాయం రూ.1.82 కోట్లే. శుక్రవారం 349 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.
Updated Date - 2020-05-09T09:35:05+05:30 IST