మండలికి కవిత!
ABN, First Publish Date - 2020-03-18T09:00:01+05:30
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కవిత పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి...
- నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా
- సీఎం కేసీఆర్ నిర్ణయం.. నేడు ప్రకటన
- నామినేషన్ దాఖలు కూడా నేడే
- అనూహ్యంగా తెరపైకి సీఎం తనయ పేరు
- ఉమ్మడి నిజామాబాద్‌పై పట్టు సడలకూడదనే..
- కేటీఆర్ సీఎం అయితే ఆయన శాఖలు ఆమెకు?
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కవిత పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం అధికారిక ప్రకటన వెలువడటంతోపాటు, పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేయటానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
అంతకు ముందు ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొద్ది మంది ముఖ్య నేతలను తన వద్దకు పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ నుంచి కవిత ఎంపికపై వారు సానుకూలత వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఫోన్‌లో మాట్లాడారు. వారు కూడా అభ్యర్థిగా కవిత ఎంపికను స్వాగతించారు. ఆ తర్వాతే ఈ విషయం జిల్లాకు చెందిన పలువురు పార్టీ ముఖ్యుల చెవిన పడింది.
చివరి దశలో తెరపైకి..
వాస్తవానికి సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారని టీఆర్‌ఎ్‌సలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాలంలో కవిత ప్రజా క్షేత్రం నుంచి గెలిచి వస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా మారిన సమీకరణాలతో సిటింగ్ ఎంపీ (రాజ్యసభ) కె.కేశవరావు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురే్‌షరెడ్డికి పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. వారు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే బుధవారం వారిద్దరి ఏకగ్రీవ ఎన్నికపై ఈసీ అధికార ప్రకటన చేయనుంది. ఈ దశలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ తరఫున కవిత పేరు తెరపైకి వచ్చింది. అయితే సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఉంటారని, సమయం చూసుకొని పార్టీ నేతలకు వెల్లడించారనే చర్చ టీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
జనవరి 4, 2022 వరకే పదవీ కాలం..
టీఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రె్‌సలో చేరిన డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అర్ధంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుండగా, ఈసీ ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, బుధవారం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సులువుగానే కవిత గెలుపు!
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ నిలిచినప్పటికీ, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత ఇబ్బంది లేకుండా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్‌ఎస్ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, బీజేపీ ఓట్ల సంఖ్య 90. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున బుధ, గురువారాల్లో నామినేషన్లు దాఖలు కానున్నాయని తెలుస్తోంది. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
నియోజకవర్గంపై పట్టు కోసమే..
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సిటింగ్ ఎంపీగా కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ, ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన నుంచి కవిత నియోజకవర్గంతో కొంత దూరం పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై టీఆర్‌ఎస్ పట్టుసడలుతున్నదనే భావనతోనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ స్థానం పార్టీ అభ్యర్థిగా కవిత పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజ్యసభకు పంపించినా ఆమె నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై దృష్టి కేంద్రీకరించే వీలుండేది. ఆ అవకాశం తప్పిపోవటం, వచ్చే ఎన్నికల వరకు కవితను ఖాళీగా ఉంచితే, పార్టీ పరంగా పరిస్థితి మరింత దిగజారుతుందనే భావనతో ఎమ్మెల్సీగా ఆమె సేవలను వినియోగించుకోవాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది.
కవిత కాబోయే మంత్రి !
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కవిత ఎన్నిక లాంఛనమేనని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె ఎమ్మెల్సీగానే పరిమితం కాదని, కాబోయే మంత్రి అనే చర్చ అప్పుడే మొదలైంది. భవిష్యత్తులో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపడితే, కేటీఆర్ స్థానంలో మంత్రిగా కవిత కేబినెట్‌లోకి వస్తారని చెబుతున్నారు. అలాగే కేటీఆర్ నిర్వహించిన మంత్రిత్వ శాఖలనే ఆమెకు అప్పగిస్తారని అంటున్నారు. అయితే ఇందుకు కొంత సమయం పట్టవచ్చని పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. కవిత ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం జనవరి 4, 2022న ముగిశాక, మళ్లీ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుస్తారని వివరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటికి కవితను మంత్రిగా చూడటం ఖాయమనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.
Updated Date - 2020-03-18T09:00:01+05:30 IST